స్టాలిన్ అను నేను...

By Kalyan.S May. 07, 2021, 07:39 am IST
స్టాలిన్ అను నేను...

ఇటీవ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన ఐదు రాష్ట్రాల‌లో ప‌శ్చిమ బెంగాల్, త‌మిళ‌నాడు ప్ర‌త్యేక మైన‌వి. మిగ‌తా రాష్ట్రాల‌తో పోల్చుకుంటే ఆయా రాష్ట్రాల‌లో గెలుపు కోసం బీజేపీ విస్తృతంగా పోరాడింది. కానీ ఓట‌ర్లు ప్రాంతీయ పార్టీల వైపే మొగ్గు చూపారు. ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రిగా టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఈనెల 5న ప్ర‌మాణ స్వీకారం చేయ‌గా, తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే శాసనసభాపక్ష సమావేశం లో నూతన ఎమ్మెల్యేలంతా స్టాలిన్‌ను తమ నేతగా లాంఛనంగా ఎన్నుకున్న సంగ‌తి తెలిసిందే.

కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో స్టాలిన్‌, ఆయన కేబినెట్‌ సహచరులు 7వ తేదీ రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా ప్రమాణం చేయనున్నారు. ఉదయం 9 గంటలకు జరిగే ప్రత్యేక కార్యక్రమంలో స్టాలిన్‌తో పాటు మరో 33 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఏడుగురు తెలుగువారికి మంత్రివర్గంలో చోటు లభించింది. తన తండ్రి కరుణానిధి మంత్రివర్గంలో పని చేసిన 14 మంది పాత వారికి కూడా స్టాలిన్‌ తన మంత్రివర్గంలో స్థానం కల్పించడం విశేషం. ప్ర‌మాణ స్వీకారానికి ముందు తన తల్లిదండ్రుల నివాసమైన గోపాలపురంలోని ఇంటికి వెళ్లి అక్క‌డ మాతృమూర్తి దయాళు అమ్మాళ్‌ ఆశీస్సులు అందుకుంటారు. అనంత‌రం స్థానిక మెరీనాతీరంలో ఉన్న తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి సమాధి వద్ద స్టాలిన్ నివాళులు అర్పించ‌నున్నారు. ఫ‌లితాలు వెల్ల‌డైన మ‌ర్నాడు కూడా ఎమ్మెల్యేగా తను గెలిచినట్లు ఇచ్చిన ధ్రువీకరణపత్రాన్ని సమాధిపై ఉంచారు. ఆ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎన్‌.రంగస్వామి కూడా శుక్రవారమే ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పుదుచ్చేరి రాజ్‌నివాస్‌లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇద్దరు సీఎంల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కొవిడ్‌ నిబంధనల మేరకు నిరాడంబరంగా జరుగనున్నాయి. అత్యంత ముఖ్యమైన అతికొద్ది మందికి మాత్రమే ఆహ్వానాలు వెళ్లాయి. స్టాలిన్ ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ను ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు. స్టాలిన్ కు జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు తెలిపారు. జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి స్టాలిన్ కుమారుడితో స‌హా హాజ‌రైన విష‌యం తెలిసిందే. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టనున్న స్టాలిన్‌కు పళనిస్వామి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు స్టాలిన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ‘రాష్ట్రాభివృద్ధికి మీ ఆలోచనలు, మద్దతు అవసరం. అధికార, ప్రతిపక్ష పార్టీలు కలసి పనిచేయడమే ప్రజాస్వామ్యం’ అని ఆయనకు సమాధానమిచ్చారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp