పరారీలో టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

By Kotireddy Palukuri Jul. 03, 2020, 05:35 pm IST
పరారీలో టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మోకా భాస్కర రావు హత్య కేసులో నిందితుడుగా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర పరారీలో ఉన్నారు. మోకా భాస్కర రావు హత్య కేసులో ఇప్పటికే టీడీపీ మాజీ కౌన్సిలర్‌ చింతా చిన్నితో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిచ్చిన వాగ్మూలంతో పోలీసులు కొల్లు రవీంద్రను కూడా ఈ హత్య కేసులో నిందితుడిగా చేర్చారు. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌లో కొల్లు రవీంద్ర పేరును పొందుపరిచారు. ఈ నేపథ్యంలో హత్య కేసు విషయమై కొల్లు రవీంద్రను విచారించేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు.

అయితే పోలీసులు వచ్చిన సమయంలో కొల్లు రవీంద్ర ఇంట్లో లేరు. పోలీసులు కుటుంబ సభ్యులను విచారించగా లేరని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. రవీంద్ర పరారు కావడంతో భాస్కర రావు హత్య కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్లుగా పరోక్షంగా అంగీకరించినట్లేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తన ప్రమేయం లేకపోతే ఆయన పోలీసు విచారణ నుంచి ఎందుకు తప్పించుకుంటారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో తాను తప్పకుండా చిక్కులు ఎదుర్కొవాల్సి వస్తుందనే కారణంతోనే ముందస్తు రక్షణ చర్యల కోసమే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. న్యాయపరమైన రక్షణ పొందేందుకు కొల్లు రవీంద్ర ప్రయత్నిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

కాగా, హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేరు చేర్చడంపై టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యంతరం తెలిపారు. ఏసీబీ కేసులు, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసులు, నిర్భయ కేసులు అయిపోయాయని, ఇప్పుడిక టీడీపీ నేతలపై హత్య కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బీసీ నేతలే లక్ష్యంగా అక్రమకేసులు పెట్టడం ఏంటి? అని ప్రశ్నించారు. మాజీమంత్రి అచ్చెన్నాయుడుపై తప్పుడు కేసు, యనమల రామకృష్ణుడుపై అట్రాసిటి కేసు.. అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసులు పెట్టారని తెలిపారు. బీద రవిచంద్ర యాదవ్‌పై మండలిలోనే మంత్రులు దాడి చేశారని, ఇప్పుడు మరో బీసీ నేత కొల్లు రవీంద్రపై హత్యకేసు బనాయిస్తారా? అని ప్రశ్నించారు. మీ ప్రలోభాలకు లొంగకపొతే.. మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే.. మీకు అలవాటైన హత్యారాజకీయాలను వారికి అంటగడతారా అని బాబు నిలదీశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp