యూ టర్న్‌ల పరంపర..

By Jaswanth.T Dec. 08, 2020, 09:16 am IST
యూ టర్న్‌ల పరంపర..

యూ టర్న్‌కు పేటెంట్‌ హక్కు ఎవ్వరికైనా ఉందంటే టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడిపేరే చెబుతుంటారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌లో భాగంగా కూడా యూటర్న్‌కు అంత పేరు రాలేదు కానీ చంద్రబాబుకు సంబంధించిన టాపిక్‌లలో మాత్రం యూటర్న్‌ బాగానే పాపులర్‌ అయ్యింది. అయితే అధికారంలో ఉండగా ఈ యూటర్న్‌లు బాగా ఎక్కువగానే తీసుకున్నారని ప్రత్యర్ధి పార్టీలు విమర్శలకు దిగేవి. ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా యూటర్న్‌ల పరంపరను చంద్రబాబు కొనసాగిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రైతుల ఆందోళనలకు మద్దతుగా జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మీడియా ముందుకొచ్చిన మంత్రి కన్నబాబు చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు అప్పట్లో బేషరతుగా చంద్రబాబు మద్దతు పలికినవిషయాన్ని గుర్తు చేసారు. సెప్టెంబరు నెలలో వ్యవసాయ బిల్లు అమోదం పొందితే నవంబరు వరకు కూడా దానిని గురించి స్పందించలేదన్నారు. కేంద్రానికి కనీసం లేఖ కూడా రాయలేదన్నారు. తీరా ఇప్పుడు జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని చెప్పడం చంద్రబాబు యూ టర్న్‌ తీసుకోవడమేనని మంత్రి కన్నబాబు స్పష్పం చేసారు.

రైతు బాగుకోరే ప్రభుత్వంగా రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న చర్చలు సఫలం కావాలని కోరుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రజలకు ఇబ్బందుల్లేకుండా రైతుల సంఘాల నాయకులు బంద్‌ పాటించాల్సిందిగా కోరారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు మధ్యాహ్నం 1 గంట తరువాతే తెరవాల్సిందిగా ఆదేశించామన్నారు. ఆర్టీసీ బస్సులు కూడా ఇలాగే వ్యవహరించాల్సిందిగా చెప్పామని మంత్రి అన్నారు. పాఠశాలలు కూడా మూసివేయాల్సిందిగా దేశించినట్లు వివరించారు.

చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చినప్పటికీ ఇలా యూటర్న్‌లను కొనసాగించడాన్ని మంత్రి తీవ్రంగానే ఎత్తి చూపారు. ఎంతో అనుభవజ్ఞుడని చెప్పుకునే చంద్రబాబు ఎటువంటి రాజకీయ వ్యూహం లేకుండా సగటు రాజకీయ నాయకుడి మాదిరిగానే వ్యవహరిస్తుండడం సోషల్‌మీడియా వేదికగా చర్చకు తావిస్తోంది. ఏలూరులో గుర్తు తెలియని అస్వస్థత అంశంలో కూడా ఒక పక్క వైద్యులు త్రాగునీరు కారణం కాదని తేల్చిచెప్పారు. అయినప్పటికీ చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్‌లు త్రాగునీరు కలుషితం అయిపోయిందని, పారిశుద్ధ్యం సరిగా చేయడం లేదంటే ట్విట్టర్‌కు ఎక్కడం పట్ల పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలు వచ్చిన ఈ ఇబ్బందిని టీడీపీ కేవలం రాజకీయ కోణంలో మాత్రమే చూస్తోందని రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి ఆళ్ళ నాని కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏలూరు పట్టణాన్ని వైద్య బృందాలు జల్లెడపడుతున్నాయని, ప్రజలకు అందుబాటులో ఉండి వీలైనంత వేగంగా వైద్య సదుపాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం నోటికొచ్చిన ఆరోపణలు చేస్తుండడం పట్ల ఆయన కూడా అభ్యతరం తెలిపారు.

కీలక వైద్య పరీక్షల నివేదికలు వచ్చి గుర్తు తెలియని అస్వస్థతకు కారణం తెలిస్తే అప్పుడు మరోసారి చంద్రబాబు యూ టర్న్‌ తీసుకోవాల్సి ఉంటుందని పలువురు నెటిజన్లు కూడా ట్రోల్‌ చేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp