విశాఖలో ఆధిపత్యం వారిదేనా..? మంత్రి మాటల్లో నిజమెంత..?

By Kotireddy Palukuri Jan. 21, 2020, 07:37 pm IST
విశాఖలో ఆధిపత్యం వారిదేనా..? మంత్రి మాటల్లో నిజమెంత..?

కృష్ణా జిల్లాకు చెందిన పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో చేసిన ప్రసంగం ఆసక్తిగా సాగింది. కొడాలి ప్రసంగంపై ప్రస్తుతం ప్రజలతోపాటు, రాజకీయ నేతల మధ్య చర్చ సాగుతోంది. ముఖ్యంగా రాజధానిగా ఒక్క అమరావతే ఉండాలని డిమాండ్‌ చేస్తున్న వారిలో మూడు రాజధానులకు అనుకూలంగా సరికొత్త భావన వచ్చేలా కొడాలి ప్రసంగం సాగింది.

రాజధానిని ఎక్కడికీ తీసుకెళ్లడంలేదంటూ అమరావతిపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసిన కొడాలి నాని.. ఆ తర్వాత తన సామాజికవర్గం ప్రజలనుద్దేశించి ఆసక్తికరంగా మాట్లాడారు. మూడు రాజధానుల ఏర్పాటుతో ఇకపై తమకు (తన సామాజికవర్గం వారికి) రెండు రాజధానులు ఉండబోతున్నాయని కొడాలి వ్యాఖ్యానించారు.

ఇకపై తమకు అమరావతితోపాటు విశాఖ.. రెండు రాజధానులన్న మంత్రి కొడాలి.. తమకు రెండు రాజధానులు ఎలా ఉండనున్నాయో వివరించి చెప్పారు. విశాఖలో ఫైవ్‌స్టార్‌ హోటళ్లు అన్నీ తమ (తన సామాజికవర్గం) వారివేనని, మోటారు వాహనాల డీలర్లు తమవారేనని, ఎక్కువ వ్యాపారాలు తమ వారివేనని.. విశాఖలో తమ సామజికవర్గం ప్రజల ఆధిపత్యాన్ని వివరించారు. విద్యలో గీతం యూనివర్సిటీ, రాజకీయాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు... ఇలా ప్రతి రంగంలో తమ వారిదే పైచేయని మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు.

విశాఖలో తమ సామాజికవర్గం వారే ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారనే భావన వచ్చేలా కొడాలి మాట్లాడారు. సభలోనే ఉన్న వెలగపూడి రామకృష్ణను ఉద్దేశిస్తూ.. విజయవాడ నుంచి విశాఖకు వెళ్లిన వెలగపూడి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేశారు. భవిష్యత్‌లో మేము కూడా వైజాగ్‌కు వెళ్లి ఎంపీగానో, ఎమ్మెల్యే గానో పోటీ చేసి గెలుస్తామని చమత్కరించారు. ఉత్తరాంధ్ర ప్రజలు మంచివాళ్లని ఎవరు వచ్చినా వారి పట్ల ప్రేమాప్యాయతలు చూపిస్తారని కొనియాడారు. అందుకే తమకు అమరావతి, వైజాగ్‌.. రెండు రాజధానులు ఇప్పుడు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

కొడాలి నాని ఏదో ఉద్దేశపూర్వకంగా అనలేదని విశాఖ చరిత్రను పరిశీలిస్తే అర్థమవుతోంది. 1990 దశకం నుంచి బయటి ప్రాంతాల నుంచి వెళ్లి పోటీ చేసిన వారినే విశాఖ నగర ప్రజలు ఆదరించారు. విశాఖ, పూర్వపు విశాఖ జిల్లాలో భాగమైన విజయనగరం వాసులు పోటీ చేసినా కూడా కోస్తా జిల్లాలకు చెందిన అభ్యర్థులనే పార్టీలకు అతీతంగా గెలిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇందులోనూ కొడాలి నాని చెప్పినట్లు ఆయన సామాజికవర్గం వారినే ఎక్కువగా సార్లు గెలిపించారు.

– 1991లో విశాఖ ఎంపీగా ఎంవీవీఎస్‌ మూర్తి గెలిచారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎంవీఎస్‌ఎస్‌ మూర్తి విజయవంతమైన వ్యాపారిగా పేరొందారు. అనేక వ్యాపారాలు చేశారు."గోల్డ్ స్పాట్" కూల్ డ్రింక్ పేరుతొ "గోల్డ్ స్పాట్" మూర్తిగా సుపరిచితులు. విశాఖలో గీతం విశ్వవిద్యాలయం స్థాపించారు. ఈ ఎన్నికలో మూర్తి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయగా ఆయనపై కాంగ్రెస్‌ అభ్యర్థిగా పూర్వ విశాఖ జిల్లా ప్రాంతమైన విజయనగరం జిల్లాకు చెందిన పూసపాటి ఉమా గజపతి రాజు పోటీ చేశారు. అయితే 5,000 ఓట్ల మెజారిటీతో మూర్తి గెలిచారు.

– 1996 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా టి.సుబ్బిరామి రెడ్డి గెలిచారు. నెల్లూరు జిల్లాకు చెందిన సుబ్బిరామిరెడ్డి వ్యాపారి, కాంట్రాక్టర్‌. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా సుబ్బిరామిరెడ్డి పోటీ చేయగా.. టీడీపీ అభ్యర్థిగా విజయనగరం జిల్లాకు చెందిన పూసపాటి ఆనందగజపతి రాజు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కూడా విశాఖ ప్రజలు స్థానికేతరుడైన సుబ్బిరామిరెడ్డికే పట్టం కట్టారు. పూర్వ విశాఖ జిల్లా ప్రాంతమైన విజయనగరం జిల్లాకు చెందిన పూసపాటి ఆనందగజపతి రాజును కాదని, విశాఖ ప్రజలు నెల్లూరు జిల్లాకు చెందిన సుబ్బిరామిరెడ్డిని 7,500 ఓట్ల మెజార్టీతో గెలిపించారు.

– 1998 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా టి.సుబ్బిరామిరెడ్డి, టీడీపీ అభ్యర్థిగా పూసపాటి ఆనందగజపతి రాజులు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కూడా విశాఖ ప్రజలు స్థానికేతరుడైన సుబ్బిరామిరెడ్డి వైపే నిలిచారు. ఈ ఎన్నికల్లో 61,000 ఓట్ల మెజార్టీ ఇచ్చారు.

– 1999 ఎన్నికల్లో మాత్రం కోస్తా జిల్లాలకు చెందిన వారే విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. కాంగ్రెస్‌ నుంచి టి.సుబ్బిరామిరెడ్డి, టీడీపీ నుంచి ఎంవీఎస్‌ఎస్‌ మూర్తి బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో మూర్తి 39,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు.

– 2004 ఎన్నికల్లో కూడా నెల్లూరుకు చెందిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్‌ రెడ్డి కాంగ్రెస్‌ తరఫున, టీడీపీ తరఫున ఎంవీఎస్‌ఎస్‌ మూర్తి విశాఖ ఎంపీ స్థానం నుంచి బరిలో నిలిచారు. అంతకు ముందు ఎన్నికల్లో మూర్తిని గెలిపించిన విశాఖ ప్రజలు ఈ సారి నేదురుమల్లి జనార్థన్‌lరెడ్డి వైపు నిలిచారు. జనార్థన్‌ రెడ్డికి 1,30,000 ఓట్ల మెజార్టీ ఇచ్చారు.

– 2009 ఎన్నికల్లోనూ లోకల్, నాన్‌లోకల్‌ అభ్యర్థులు విశాఖ ఎంపీ బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ తరఫున ప్రకాశం జిల్లాకు చెందిన దగ్గుబాటి పురందేశ్వరి, పీఆర్‌పీ తరఫున స్థానికుడైన పల్లా శ్రీనివాసరావు (యాదవ సామాజికవర్గం) ప్రత్యర్థులుగా నిలిచారు. ఈ ఎన్నికల్లో విశాఖ నగర ప్రజలు స్థానికేతురాలైన పురందేశ్వరిని ఆదరించారు. స్థానికుడు పల్లా శ్రీనివాసరావును కాదని పురందేశ్వరిని 67,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారు.

– 2014 ఎన్నికల్లో విశాఖ ఎంపీ స్థానానికి టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా బీజేపీ తరఫున కంభంపాటి హరిబాబు, వైఎస్సార్‌సీపీ తరఫున వైఎస్‌ విజయమ్మ బరిలో నిలిచారు. కంభంపాటి హరిబాబు ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి కాగా, విజయమ్మ కడప వాసి. ఈ ఎన్నికల్లో కంభంపాటి హరిబాబుకు విశాఖ ప్రజలు 90,000 ఓట్ల మెజారీటీ ఇచ్చారు.

– 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంవీవీ సత్యనారాయణ, టీడీపీ తరఫున ఎంవీవీఎస్‌ మూర్తి మనవడు మరియు బాలకృష్ణ చిన్నల్లుడు అయిన భరత్‌ , జనసేన తరఫున సిబిఐ మాజీ జేడీ వి.వి. లక్ష్మీ నారాయణ పోటీ చేశారు. ఎంవీవీ సత్యనారాయణ పశ్చిమగోదావరి జిల్లా , టీడీపీ అభ్యర్థి భరత్‌ తూర్పుగోదావరి జిల్లా ,జేడీ వి.వి. లక్ష్మీ నారాయణ అనంతపురం జిలాకు చెందినవారు ఈ ఎన్నికల్లో విశాఖ ప్రజలు ఎంవీవీ సత్యనారాయణకు జై కొట్టారు.

కొడాలి నాని చెప్పింది.. నిజమే..

1991లో విశాఖ ఎంపీగా ఎంవీఎస్‌ఎస్‌ మూర్తి, 1996లో సుబ్బిరామిరెడ్డి, 1998లో సుబ్బిరామిరెడ్డి, 1999లో ఎంవీఎస్‌ఎస్‌ మూర్తి, 2004లో నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి, 2009లో దగ్గుబాటి పురందేశ్వరి, 2014లో కంభంపాటి హరిబాబు, 2019లో ఎంవీవీ సత్యనారాయణ లు గెలిచారు. 1991 నుంచి 2019 వరకు ఎనిమిది సార్లు జరిగిన ఎన్నికల్లో ఐదు సార్లు కమ్మ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులు గెలవగా, మూడు సార్లు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు గెలిచారు. వీరిపై పోటీ చేసిన క్షత్రియ, యాదవ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులు భారీ ఓటమి చవిచూడడం, కమ్మ సామాజికవర్గం అభ్యర్థులు ఎక్కువసార్లు గెలవడం.. కొడాలి ప్రసంగంలోని వాస్తవికతను అద్దం పడుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp