Municipal Elections - మినీ మున్సిపోల్‌కు రంగం సిద్ధం.. అందరి దృష్టి కుప్పం పైనే..

By Karthik P Oct. 18, 2021, 02:00 pm IST
Municipal Elections - మినీ మున్సిపోల్‌కు రంగం సిద్ధం.. అందరి దృష్టి కుప్పం పైనే..

ఆంధ్రప్రదేశ్ లో మ‌రో పొలిటిక‌ల్ యుద్ధానికి తెరలేస్తోంది. త్వరలో మినీ మున్సిపోల్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన రెండు మున్సిపల్ కార్పోరేషన్లు, 11 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ( ఎస్ఈసీ ) కసరత్తు చేస్తోంది. న్యాయపరమైన సమస్యలు తీరిన అర్బన్ బాడీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం తుది కసరత్తులు చేస్తోంది. ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న మున్సిపాలిటీలలో పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుపై ఎస్‌ఈసీ సమాలోచనలు జరుపుతోంది. పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఈ నెల 23వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికలు జరిగేది ఇక్కడే..

రాష్ట్రంలో పలు కారణాలతో 32 మున్సిపాలిటీలు, 4 నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరగలేదు. అయితే వాటిలోని 11 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లకు ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించే అవ‌కాశం ఉన్న విష‌యాన్ని ఎస్ఈసీ అధికారులు ప‌రిశీలిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని అకివీడు, కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, కొండపల్లి, గుంటూరు జిల్లాలోని దాచేపల్లి, గురజాల, ప్రకాశం జిల్లాలోని దర్శి, నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం, చిత్తూరు జిల్లాలోని కుప్పం, కర్నూలు జిల్లాలోని బేతంచర్ల, వైఎస్సార్ కడప జిల్లాలోని కమలాపురం, అనంతపురంలోని పెనుకొండ మున్సిపాలిటీలు, నెల్లూరు, శ్రీకాకుళం కార్పొరేషన్లకు ఎన్నికలు జరిపేందుకు కోర్టు అడ్డంకులేం లేవని ఎస్ఈసీకి అధికారులు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. దీంతో ఓటర్ల జాబితా, వార్డులు, డివిజన్ల వారీగా రిజర్వేషన్ల ఖరారు వంటి వివరాలను అధికారులు ఎస్‌ఈసీకి అందజేశారు.

Also Read : 3 Capitals - Centrel Minister Ramdas -మూడు రాజధానులపై రాందాస్ వ్యాఖ్యలు టీడీపీ నేతలనెందుకు కలవరపరుస్తున్నాయి

వైసీపీకి ఎదురుందా?

ఏపీలో వీస్తున్న ఫ్యాను గాలి దెబ్బకు సైకిళ్లు, గాజు గ్లాసులు పత్తాలేకుండా పోయాయి. 2019 ఏప్రిల్ లో మొదలైన వైసీపీ ప్రభంజనం ఇంకా కొనసాగుతోంది. కొన్ని నెలల కిందట జరిగిన మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మినహా దాదాపు అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఈ ఫలితాలతో బిత్తరపోయిన టీడీపీ.. ఏకంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నామని ప్రకటించింది.ఇక తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి కూడా వెళ్లకుండా వైసీపీ అభ్యర్థిని గెలిపించుకున్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆ రేంజ్ లో ఉంది వైసీపీ హవా. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అవుతుందని, వైసీపీ క్లీన్ స్వీప్ ఖాయమని చర్చ జరుగుతోంది.

కుప్పం.. ఆసక్తికరం..

ఇప్పుడు జరగబోయే మినీ మున్సిపోల్స్ లో ఆసక్తికర మున్సిపాలిటీ ఒకటి ఉంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనూ మున్సిపల్ ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ ఎన్నిక వైసీపీ, టీడీపీకి కీలకంగా మారనుంది. కుప్పం నియోజకవర్గంలోని 89 పంచాయతీలకు గాను 74 పంచాయతీలను వైసిపి గెలుచుకుంది. పరిషత్ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వచ్చాయి. కుప్పం మండల పరిషత్ ను వైసిపి గెలుచుకుంది. పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలో చేదు ఫలితాలను చూసిన చంద్రబాబుకు కుప్పం మున్సిపాలిటీలోనూ షాక్ తగులుతుందా..? లేదా.. ? అనేది ఆసక్తికరం.

Also Read : TDP CBN Dicipline -టీడీపీలో కొత్త పంథా : బాబు మార్క్ రాజ‌కీయాలు ప‌ని చేయ‌డం లేదా?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp