జండా పీకేయటం కాదంట జస్ట్ కలిసి పనిచేయటం అంట...

By Ravuri.SG Jan. 14, 2020, 10:40 am IST
జండా పీకేయటం కాదంట జస్ట్ కలిసి పనిచేయటం అంట...

భారతీయ జనతా పార్టీ(భాజపా)-జనసేనల మధ్య జరిగిన చర్చల గురించి ప్రధాన మీడియా  "కలిసి నడుద్దాం"  అంటూ శీర్షికలు పెట్టాయి. "ఇక పై రాష్ట్రంలో జరిగే అన్ని ఆందోళనల నుంచి ఎన్నికల్లో పోటీ వరకు భాజపా-జనసేనలు కలిసి చేయాలని..." అనే పెద్ద వాక్యాన్ని "విలీనం" అనే చిన్న మాటకు ప్రత్యామ్నాయంగా వాడటం ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన మీడియా వారికే చెల్లింది. ఇక్కడ పార్టీ అధికారికంగా విలీనం చేయలేదనేది వాస్తవమే అయినా ఇంత చర్చలు జరిగాక 'భాజపాలో జనసేన విలీనం దిశగా అడుగులేస్తోందా ?' అని విశ్లేషించలేని మీడియా రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉండాలని దినదినం దిశానిర్దేశం చేయడం; వారం వారం వేదాలు వల్లించడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం.

"ప్రజారాజ్యం" పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు కానీ దానికి దాదాపు మూడేళ్ళు ముందుగానే కేవలం ఊహాగానాల ఆధారంగా "జెండా పీకేద్దాం" అనే పతాకశీర్షిక పెట్టి పేజీలకు పేజీలు కథనాలు రాశారు. ఎందుకంటే ఏ మాత్రం భావసారూప్యత లేని పార్టీలన్నీ కట్టిన కూటమిని భుజాన మోసినా, ఏళ్ళ తరబడి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ మీద ఎన్ని వ్యతిరేక కథనాలు రాసినా జనం తెలుగుదేశాన్ని ఛీ కొట్టారంటేనే - ఇక దాదాపు ఇరవైశాతం ఓటు బ్యాంకు సంపాదించిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో కలిస్తే తెలుగుదేశం పార్టీ సోదిలో కూడా లేకుండా పోతుందని ఆవేదన. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు 'పాహి పాహి' అంటూ హస్తినకు వెళ్ళి సోనియా గాంధీని ఆశ్రయించేవరకు, "మొద్దబ్బాయి" అన్న నోటితోనే "మనమంతా కలిసి..." అంటూ రాహుల్ గాంధీకి వీణను జ్ఞాపికగా ఇచ్చే వరకు తెలుగుదేశం పార్టీ కన్నా ఎక్కువగా ఈ మీడియానే కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేసింది. 2014, 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, భాజపాలు కలిసి పోటీ చేస్తున్నాయి అంటూ ఇష్టమొచ్చినట్టు రాశారు - ఎందుకంటే రెండు ఎన్నికల ముందూ తెలుగుదేశం పార్టీ పరిస్థితి మూలిగే నక్క లాంటిది, ఈ రెండు పార్టీలు కలిస్తే దాని మీద తాటికాయ పడ్డట్టవుతుందనే భయం వీరికే ఎక్కువ ఉండింది.

ఇప్పుడు జనసేన భాజపాల కలయిక వల్ల తెలుగుదేశం పార్టీకి వెంటనే కాకపోయినా తర్వాతైనా ఎంతో కొంత లాభం కలుగుతుంది కనుక ఆ పొత్తు పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెద్దగా రాకుండా(ఎన్నికల వరకు) చూసుకుంటారు. ఈ రోజు జనసేన స్థానంలో వైకాపా కానీ భాజపాతో ఇంత చర్చలు జరిపి, ఇన్ని నిర్ణయాలు కానీ తీసుకుని ఉండుంటే - తన మీద ఉన్న కేసుల మాఫీ కోసం; మతతత్వ భాజపాతో కలిసి తనను నమ్మి ఓట్లేసిన అధికశాతం మైనారిటీలను నిట్టనిలువునా వైఎస్ జగన్ మోసం చేశాడని ఈ రోజు ప్రత్యేక సంచికలే వేసుండేవారు.

ఇంత పచ్చి అవకాశవాద 'పచ్చ'మీడియాలో "రాష్ట్ర రాజధాని కోసం అమరావతిలో ఉద్యమం" అంటూ వస్తున్న వార్తల్ని, అక్కడ ప్రభుత్వ కట్టడాలు సగానికి పైగా పూర్తయిపోయాయి అంటూ చేస్తున్న ఫుల్ పేజ్ ప్రచారాల్ని సామాన్య జనం నమ్ముతారనుకుంటే పొరబాటే !

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp