Maredumilli, Gudise Tourist Place - గుడిసె.. తూర్పు కనుమలకు ‘కోహినూరు’

By Prasad Dec. 25, 2021, 10:20 am IST
Maredumilli, Gudise Tourist Place - గుడిసె.. తూర్పు కనుమలకు ‘కోహినూరు’

పచ్చని కొండలు..దట్టమైన అటవీ ప్రాంతం...స్వచ్ఛమైన గాలి...వాగులు..వంకలు..చెంగుచెంగున దూకుతూ సాగిపోయే సెలయేళ్లు...ఇన్ని అందాలు తూర్పు కనుమలకు సొంతం. అటువంటి కనుమల మధ్య కొలువైన కోహినూరు వజ్రం ‘గుడిసె’. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాలకు తలమానికంగా నిలిచిన మారేడుమిల్లి మండలంలో ఉన్న గుడిసె ఇటీవల పర్యాటక కేంద్రంగా ఆదరణ పొందుతోంది. వర్షాకాలం.. శీతాకాలం సీజన్‌లో ఇక్కడకు దేశం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకుల సందడి పెరిగింది.

ఐదేళ్ల క్రితం గుడిసె ఒక సాధారణ గిరిజన గ్రామం.ఈ గ్రామం వెళ్లేందుకు రహదారి సౌకర్యం కూడా లేదు. గ్రామానికి ఆనుకుని ఉన్న కొండ మీదకు పర్యాటకులు పెరగడంతో ఈ గ్రామం దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇంతకీ ఇక్కడ ఏముంది అంటారా?.. గుడిసెను ఆనుకుని పెద్దపెద్ద కొండలు పక్కపక్కనే ఉన్నాయి. కొండలంటే సాధారణంగా ఏటవాలుగా ఉంటాయి. కాని గుడిసె కొండపై భాగం ఏటవాలుగా కాదు.. నలు చెదరంగా ఉంటుంది. కనీసం 25 ఫుట్‌బాల్‌ స్టేడియంలు పట్టేంత స్థలం సమతలంగా ఉంటుంది. అక్కడక్కడా చిన్నచిన్న గొప్పులు ఉంటాయి తప్ప మిగిలిన భాగమంతా చదునుగానే ఉంటుంది. ఇంత విశాలమైన కొండ ప్రాంతం మరెక్కడ ఉండదు.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీష్‌ ప్రభుత్వం దీనిని అత్యవసర ఎయిర్‌ స్ట్రిప్‌గా వినియోగించాలని యోచించిందంటే ఇది ఎంత విశాలంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గుడిసె చేరుకున్న తరువాత చుట్టూ ఎటుచూసినా కనుచూపు మేర పచ్చగా పరుచుకున్న కొండలు,వాటి మధ్య లోయలు కనిపిస్తుంటాయి. ప్రకృతి ప్రేమికులకు ఇది స్వర్గధామం. కొండల మీద నుంచి సాగిపోయే మేఘాలు..దుప్పటిలా పరుచుకున్న మంచు చూసేందుకు రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. వర్షాకాలం వెళ్లడం రోడ్డు పరంగా కాస్త ఇబ్బందే అయినా ఈ కాలంలో మనల్ని తాకుకుంటూ వెళ్లే మేఘాలు చెక్కిలిగింతలు పెడతాయి.

శీతాకాలంలో సాయంత్రం నాలుగు నుంచే ఇక్కడ చీకట్లు కమ్ముకుంటాయి.ఉషోదయ వేళ మంచు తెరలు తెరలుగా పరుచుకుంటుంది. అందుకే రాత్రిళ్ళు ఇక్కడ బస చేసి సూర్యాస్తమయం..ఉషోదం చూడాలని పర్యాటకులు భావిస్తుంటారు. అటువంటి వారికి పలు ప్రైవేట్‌ పర్యాటక సంస్థలు టెంట్లు ఏర్పాటు చేయడం, క్యాంప్‌ ఫైర్లు అందుబాటులోకి తెచ్చింది. ఇవి మారేడుమిల్లి,రంపచోడవరం,భద్రాచలంలో దొరుకుతున్నాయి. పైగా సంప్రదాయ గిరిజన పద్ధతిలో చేసే బ్యాంబూ చికెన్‌, బ్యాంబూ బిర్యానీ రాత్రి వేళ ఆహారంగా అందిస్తుంటారు. గుడిసె పై భాగంలో లోయలను ఆనుకుంటూ నిర్మించిన రహదారి మీద ప్రయాణం కూడా సహాసమనే చెప్పాలి.

Also Read : Kakinada,Kotipalli - రైల్‌ బస్సు ప్రయాణం మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో..?

గుడిసెకు వెళ్లే దారిలోనే ఎన్నో పర్యాటక అందాలు. దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రయాణించడం ఒక అద్భుతం. పగలే చీకట్లు కమ్ముకున్నట్టు ఉండే అటవీ ప్రాంతమది. ఎగుడు దిగుడు రోడ్లు...సన్నని బాటలు మీదుగా ప్రయాణం సాగిపోతుంది.అమాయక గిరిజన మోములు,వారి సంప్రదాయ అలంకరణ ఆకట్టుకుంటుంది. దారిలో జాఫ్రా తోటలు...వందల ఎకరాల్లో విస్తరించిన కొండ చీపుర్లు తయారు చేసే గడ్డి.. పూరి గుడిసెలు కూడా ఇక్కడ అందాలను రెట్టింపు చేస్తాయి. ముఖ్యంగా కొండల్లో వంపులు తిరుగుతూ సాగే పాములేరు నది అందాలు...సెలయేల్ల సవ్వడులు అటు కనుల విందు.. ఇటు వీనుల విందును చేస్తుంది.

మారేడుమిల్లి నుంచి గుడిసె కొండ వద్ద వరకు గతంలోనే రహదారి ఉండేది. అక్కడ నుంచి కొండమీదకు ఘాట్‌ రూట్‌ లేని సమయంలో నడిచి కొండ ఎక్కాల్సి వచ్చేది. ప్రభుత్వం రహదారి నిర్మించడంతో ప్రయాణీకుల కష్టాలు చాలా వరకు తీరాయి. ఈ రహదారి నిర్మాణం పూర్తయిన తరువాతనే పర్యాటకుల సంఖ్య కూడా పెరిగింది. గుడిసెలో గిరిజనలు నివాసముండే గ్రామం పర్యాటక ప్రాంతంగా పేరొందిన కొండ దిగువున ఉంటుంది. ఇక్కడ సుమారు వంది మంది నివాసముంటున్నారు. 32 ఎకరాల విస్తీరణంలో గ్రామం విస్తరించి ఉంది. గుడిసె కొండ నుంచి దిగువునకు వెళ్లాల్సి ఉంటుంది. మారేడుమిల్లి నుంచి గుడిసె హిల్‌ స్టేషన్‌కు వెళ్లి అక్కడ నుంచి ఆవలివైపు కొండ దిగితే ఈ ఊరు వస్తుంది.

మారేడుమిల్లి నుంచి 40 కిమీల దూరం. కాకినాడ నుంచి 157, రాజమహేంద్రవరం నుంచి 117 కిమీల దూరం. మారేడుమిల్లి నుంచి చిన్న కార్లు మీద గుడిసె వెళ్లే అవకాశం లేదు. నిలువుగా ఉండే ఘాటి రోడ్డు ఎక్కడం సాధ్యం కాదు. స్కార్పియో... బొలెరో...సుమో.. వంటి కార్లు వెళ్లే అవకాశముంది. పర్యాటకులు ఇక్కడకు సొంత కార్లు మీద మారేడుమిల్లి చేరుకుని అక్కడ నుంచి బొలెరా వాహనాలు ఏర్పాటు చేసుకుని గుడిసె వెళుతుంటారు. భారీ వర్షాలు తగ్గి శీతాకాలం ప్రవేశించింది. అటవీ ప్రాంతం పచ్చగా మారిపోయింది. ఇప్పుడే తనివితీరా అందాలను వీక్షించాలని ఆశించే పర్యాటకులకు గుడిసె అందాలు ఒక స్వర్గధామం.

Also Read : P Gannavaram Aqueduct - 1851 లో నిర్మించిన పి.గన్నవరం అక్విడెక్టు గురించి తెలుసా..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp