బీజేపీలో చేరటం కోసమే ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు,8 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారా?

By Karthik P Jul. 20, 2021, 04:38 pm IST
బీజేపీలో చేరటం కోసమే ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు,8 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారా?

మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మణిపూర్‌ కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు (ఎంపీసీసీ) గోవిందాస్‌ కొంతౌజమ్‌ సహా 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వారు బీజేపీలో చేరబోతున్నారు.

60 అసెంబ్లీ స్థానాలు ఉన్న మణిపూర్‌లో బీజేపీ సారధ్యంలోని ఎన్‌డీఏ కూటమి అధికారంలో ఉంది. బీజేపీ నేత. బీరేన్‌ సింగ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 24 సీట్లు గెలుచుకుంది. మిత్రపక్షాలు నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (4), నాగ పీపుల్స్‌ పార్టీ (4), లోక్‌ జనశక్తి (1), స్వతంత్రులు ముగ్గురుతో కలసి (మొత్తం బలం 36) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

గత ఏడాది జూన్‌లో బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. నేషనల్‌ పీల్స్‌ పార్టీ సహా మరో నలుగురు తమ మద్ధతును ఉపసంహరించుకోవడంతో బీరేన్‌ సింగ్‌ ప్రభుత్వం మైనారిటీలో పడింది. అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి బీరేన్‌ సింగ్‌కు తలెత్తింది. 2020 ఆగస్టు 11వ తేదీన జరిగిన విశ్వాస పరీక్షలో బీరేన్‌సింగ్‌ గెలిచారు. తన పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్‌కు విశ్వాస పరీక్ష సమయంలో బీజేపీ ఊహించని షాక్‌ ఇచ్చింది.

Also Read : రాజ్ కుంద్రా ఫెయిల్యూర్ స్టోరీ - విలువల్లేని వ్యాపారం..మనిషిగా పతనం!

నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ తిరిగి బీజేపీ ప్రభుత్వానికి మద్ధతు ఇవ్వగా.. ముగ్గురు రాజీనామా, నలుగురిపై అనర్హత వేటుతో సభలో సభ్యుల సంఖ్య 53కు చేరుకుంది. బీజేపీ ప్రభుత్వం నిలబడేందుకు 27 మంది సభ్యుల బలం కావాలి. అయితే బీజేపీకి స్పీకర్‌తో కలిపి 29 మంది సభ్యుల బలం ఉంది. అయినా.. బీజేపీ తన మార్క్‌ను చూపించింది. విశ్వాస పరీక్ష సమయంలో 8 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకుండా చేసింది. దీంతో ఎలాంటి సంచలనాలు లేకుండా బీరేన్‌ సింగ్‌ ప్రభుత్వం విశ్వాస పరీక్షల్లో నెగ్గింది.

గత ఏడాది ఆగస్టులో జరిగిన విశ్వాస పరీక్ష సమయంలో సభకు గైర్హాజరైన 8 మంది ఎమ్మెల్యేలు తాజాగా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. అయితే వారితోపాటు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందాస్‌ కొంతౌజమ్‌ రాజీనామా చేయడమే విశేషం. నెల రోజుల వరకూ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడిన గోవిందాస్‌ అనూహ్యంగా కాంగ్రెస్‌ పార్టీకి, అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపులు తిరిగాయి. వచ్చే ఏడాది మార్చి–ఏప్రిల్‌లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో మణిపూర్‌ రాజకీయ పరిణామాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.

Also Read : మమత రేపు జాతిని ఉద్దేశించి మాట్లాడుతుందంట

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp