వచ్చేసారి మండపేటలో వేగుళ్లకు చంద్రబాబు సీటిస్తారా..?

By Aditya Sep. 10, 2021, 12:30 pm IST
వచ్చేసారి మండపేటలో వేగుళ్లకు చంద్రబాబు సీటిస్తారా..?

సాధారణ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీపై, సీట్లపై పలు చోట్ల జోరుగా చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో జరిగిన పరిణామాలు, ఒప్పందాలు, కొత్త రాజకీయ సమీకరణాలు ఈ చర్చకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలోనే మండపేట సిట్టింగ్‌ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు 2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ దక్కుతుందా అన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.

మండపేట మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ చుండ్రు శ్రీవరప్రకాశ్ ఆయనకు పోటీదారుగా ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికే చెందిన ఈయనకు పార్టీలోనూ, ప్రజల్లోను పట్టుంది. ఆర్థికంగా కూడా వేగుళ్లతో పోటీపడగలవారే. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటుకు ఆయన వేగుళ్లతో పోటీపడ్డారు. అయితే ఎప్పట్నుంచో పార్టీలో ఉండడమే కాక తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్థికంగా అండదండలు అందించిన వేగుళ్లవైపే చంద్రబాబు మొగ్గు చూపారు. పైగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వేగుళ్లను కాదని శ్రీవరప్రకాశ్‌కు టికెట్‌ ఇవ్వడానికి ఆయన అంగీకరించలేదు.

Also Read:ఏపీ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శి ఆయనే!

శ్రీవరప్రకాశ్‌ వైఎస్సార్‌ సీపీ తరఫున వేగుళ్లకు పోటీగా బరిలోకి దిగుతారని, అందుకు చర్చలు కూడా పూర్తయ్యాయని గట్టిగా వినిపించింది. అదే జరిగితే కమ్మ సామాజికవర్గం ఓట్లలో చీలికవచ్చి తెలుగుదేశం ఓడిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన చంద్రబాబు 2024లో ఎన్నికల్లో అవకాశం ఇస్తానని చుండ్రు శ్రీవరప్రకాశ్‌కు హామీ ఇచ్చారు. చంద్రబాబు హామీ ఇవ్వడంతో వేగుళ్ల గెలుపునకు శ్రీవరప్రకాశ్‌ సహకరించారు.

ఈ లెక్కలు చూసుకున్నా వేగుళ్లకు చిక్కే..

2014 ఎన్నికల్లో 36,014 ఓట్ల మెజార్టీతో గెలిచిన వేగుళ్ల 2019లో 10,600 మెజార్టీనే సాధించగలిగారు. వేగుళ్లకు గణనీయంగా తగ్గిన మెజార్టీ కూడా శ్రీవరప్రకాశ్ ప్లస్‌ పాయింట్‌. 30 ఏళ్లకు పైగా ఏకాఛత్రాధి పత్యంగా తెలుగుదేశం హవా కొనసాగిన మండపేట మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ ఓటమి సిటింగ్‌ ఎమ్మెల్యే అయిన వేగుళ్లకు మైనస్‌గా ఉంది. ఈ అంశాలను అనుకూలంగా చూపి 2024 ఎన్నికల్లో సీటు తెచ్చుకుంటానని శ్రీవరప్రకాశ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పైగా తాను టీడీపీని వీడకుండా, వేగుళ్ల గెలుపునకు సహకరించి పార్టీ అధినేత ఆదేశాలకు అనుగుణంగా పనిచేశాను కనుక చంద్రబాబు తనకు తప్పక సీటు ఇస్తారని శ్రీవరప్రకాశ్ ఆశిస్తున్నారు.

Also Read : లోకేష్ కి గతం గుర్తు చేయాలి..!

వేగుళ్ల తగ్గుతారా?

2009 నుంచి అక్కడ ఎమ్మెల్యేగా వరుసగా మూడోసార్లు గెలిచిన వేగుళ్ల జోగేశ్వరరావుది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన తండ్రి సర్దార్‌ వేగుళ్ల వీర్రాజు మండపేట మున్సిపల్‌ చైర్మన్‌గా మూడుసార్లు పనిచేశారు. జోగేశ్వరరావు కూడా ఒకసారి మున్సిపల్‌ చైర్మన్‌గా చేశారు. చంద్రబాబు దగ్గర ఆయనకు గట్టిపట్టు ఉంది. సిట్టింగ్‌ అయిన తనను కాదని ఇతరులకు ఎలా టికెట్‌ ఇస్తారని, వచ్చే ఎన్నికల్లోనూ తాను టీడీపీ అభ్యర్థినని ధీమాగా చెబుతున్నారు. దీంతో పార్టీలో ఇప్పట్నుంచే 2024లో అసెంబ్లీ టికెట్‌పై హాట్‌హాట్‌గా చర్చ సాగుతోంది.

వైఎస్సార్‌ సీపీలో జోష్‌

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో.. 1986 తర్వాత టీడీపీయేతర పాలకవర్గం మండపేటలో కొలువుదీరింది. 30 కౌన్సిలర్‌ స్థానాలకు 22 చోట్ల గెలిచి వైఎస్సార్‌ సీపీ విజయఢంకా మోగించింది. ఎప్పట్నుంచో కొరకరాని కొయ్యగా ఉన్న మండపేటలో వైఎస్సార్‌ సీపీకి విజయాన్నందించిన తోటకు జగన్‌ ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ సాధించిన గెలుపు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మండపేటలో విజయంపై వైసిపిలో ఆశలు కల్పించింది. టీడీపీ అభ్యర్థి ఎవరైన తోట త్రిమూర్తులు వంటి సమర్థమైన నాయకుడి ఆధ్వర్యంలో మండపేటలో ఈసారి వైఎస్సార్‌ సీపీ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read : బుచ్చయ్య ఎపిసోడ్‌లో కొత్త వివాదం.. ఎవరు లోకల్‌..? ఎవరు నాన్‌లోకల్‌..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp