బిజెపికి మమతా పెగసిస్ కమీషన్ సెగ.

By Suresh Jul. 28, 2021, 11:15 am IST
బిజెపికి మమతా పెగసిస్ కమీషన్ సెగ.

భారతీయ జనతా పార్టీకి వర్తమాన రాజకీయాల్లో ఎదురు నిలిచిన ఓకే ఒక్క తిరుగుబాటు స్వరం మమతాబెనర్జీ. వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఉత్తరభారతదేశంలో తన సత్తా చాటిన బిజెపి క్రమంగా దక్షిణాదిలో కూడా అడుగులు వేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేసింది. కర్ణాటకలో విజయవంతమైంది. మొదటి సారి కంటే రెండవ దఫా ఎవరి మద్దతు లేకుండా స్వతంత్రంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం స్థాపించిన తర్వాత తనకు ఎదురు నిలిచిన ఏ నాయకత్వాన్ని ఎదగనీయలేదు.

ఉత్తర భారత దేశమైనా దక్షిణ భారత దేశమైనా బిజెపేతర రాజకీయ పార్టీలను అణచివేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగాయి.అందులో భాగంగానే పశ్చిమబెంగాల్ రాజకీయాలలో తీవ్రమైన ప్రయత్నాలు చేసింది. తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని ఎలాగైనా బలహీన పరచాలని వ్యూహాలను ఎన్నింటినో రచించింది. మమతా బెనర్జీకి వెన్నుదన్నుగా ఉన్న సువేందు అధికారిని మమతా బెనర్జీ కి వ్యతిరేకంగా తయారు చేయడంలో విజయవంతమయ్యారు. కర్ణాటక మధ్యప్రదేశ్ లాగానే పశ్చిమ బెంగాల్ లో కూడా తృణమూల్ కాంగ్రెస్ కుచెందిన నాయకులను భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంది.

అయినా దీదీ ఎక్కడా వెనుకడుగు వేయలేదు. చివరకు సువేందు అధికారి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నందిగ్రామ్ నుండి పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓటమి పాలైంది. అయినప్పటికీ పశ్చిమ బెంగాల్ ప్రజలు ఘన విజయాన్ని ఆమె సొంతం చేశారు తిరిగి ఆమె ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టింది.ఆమె కు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం వేసిన ప్రతి అడుగును మమతా బెనర్జీ ధైర్యంగా ఎదుర్కొంటోంది.

తాజాగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన పెగాసన్ వివాదం ముదిరింది. ప్రముఖుల ఫోన్లు హ్యాకింగ్ అవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల మమతా బెనర్జీ చట్టం ప్రకారం కమిషన్ నియమించింది.

1952 నాటి విచారణ కమిషన్ చట్టం ప్రకారం సెక్షన్ 3 ద్వారా ప్రముఖుల ఫోన్లు హాకింగ్ సంబంధించి రిటైర్డ్ జడ్జి లతో కూడిన విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి మమతా బెనర్జీ ట్విస్ట్ ఇచ్చినట్లయింది.
విచారణ కమిషన్ చట్టం ప్రకారం ఏదైనా అంశం పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా కమిషన్ నియమించవచ్చు. అయితే ఒకే అంశంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ పై రాష్ట్ర ప్రభుత్వం మరో కమిషన్ నియమించే అధికారం లేదు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ మీద కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం లేదు. కాకపోతే ఆ రాష్ట్ర పరిధిని దాటి మరిన్ని రాష్ట్రాలకు సంబంధించిన విస్తృత పరిధిలో విచారణ చేపట్టాలని అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో కమిషన్ నియమించవచ్చు. మమతా బెనర్జీ పెగాసస్ అంశంపై కమిషన్ నియమించడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది.

రాష్ట్ర కేంద్ర ప్రముఖులకు సంబంధించిన ఫోన్లు హ్యాకింగ్ అవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదనే నిద్ర మోపింది. కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండానే ఏ అంశంపైనైనా తాను ధైర్యంగా నిర్ణయం తీసుకోగలననే సంకేతాన్ని కూడా పంపింది.పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని తప్పనిపరిస్థితుల్లో పెగాసన్ పై స్పందించాల్సిన అవసరాన్ని సృష్టించింది.ఇన్నేళ్లు కేంద్రంలో చక్రం తిప్పుతున్న ఎన్డిఎ యుపిఎ కూటమికి ప్రత్యామ్నాయంగా మూడో కూటమి తయారు చేయడంలో ఇప్పటికే మమతా బెనర్జీ పావులుకదుపుతోంది.

ఇటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని కాదని జాతీయ సమస్య పైన కమిషన్ నియమించడం గొప్ప సాహసమనే చెప్పుకోవాలి.మాటల మాంత్రికుడు నరేంద్ర మోడీ, అపర చాణిక్యుడు అమిత్ షా అటువంటివారికి కొరుకుడు పడని విధంగా తయారైన మమతాబెనర్జీ భవిష్యత్తులో దేశ నాయకత్వాన్ని అందిపుచ్చుకుంటుదన్నడంలో సందేహం లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp