బీజేపీ లక్ష్యంగా ఢిల్లీ వైపు దీదీ.. రేపు దేశప్రజలకు సందేశం

By Ramana.Damara Singh Jul. 20, 2021, 05:45 pm IST
బీజేపీ లక్ష్యంగా ఢిల్లీ వైపు దీదీ.. రేపు దేశప్రజలకు సందేశం

దేశంలో భారతీయ జనతా పార్టీ ఓటమే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందులో తొలి అంకానికి ఈ నెల 21న (బుధవారం) శ్రీకారం చుట్టబోతున్నారు. దేశప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించనున్నారు. అదే ఊపులో ఈ నెల 25న ఢిల్లీ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ పర్యటనలో ప్రతిపక్ష పార్టీల నేతలందరినీ కలిసి బీజేపీకి వ్యతిరేకంగా కూడగట్టాలని భావిస్తున్నారు. సొంత రాష్ట్రంలో ఒంటిచేత్తో మూడోసారి తృణమూల్ కాంగ్రెసును గెలిపించి.. బీజేపీకి దూకుడుకు కళ్లెం వేసిన దీదీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆ పార్టీని అడ్డుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నారు.

రేపటి ప్రసంగానికి పలు రాష్ట్రాల్లో ఏర్పాట్లు

పశ్చిమ బెంగాల్లో ఏటా జులై 21న అమరవీరుల దినోత్సవం నిర్వహిస్తుంటారు. 1993లో ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేయాలన్న డిమాండుతో అప్పట్లో యూత్ కాంగ్రెస్ నేతగా ఉన్న మమత ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటనలో 13 మంది మరణించారు. తృణమూల్ కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఆ ఘటన జరిగిన జులై 21ని అమరవీరుల దీనంగా పాటిస్తున్నారు. అదే క్రమంలో బుధవారం(21న) నిర్వహించే అమరవీరుల దినోత్సవాన్ని బీజేపీపై తిరుగుబాటు దినంగా మార్చాలని మమత ప్లాన్ చేశారు. కేంద్రంలోని ఆ ప్రభుత్వ అరాచకాలు, ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రజలకు వివరించేలా ప్రసంగించాలని నిర్ణయించుకున్నారు.

Also Read : సిద్ధూ సాధించారు.. కెప్టెన్ ఏం చేస్తారో?

కోల్కతా నుంచి ఆమె ఇచ్చే సందేశాన్ని దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు.. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలన్నిం టిలో ప్రత్యక్ష ప్రసారానికి టీఎంసీ నేతలు ఏర్పాట్లు చేశారు. బెంగాల్ తోపాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్, త్రిపుర, అసోం రాష్ట్రాల రాజధానుల్లో మమత ప్రసంగాన్ని ప్రసారం చేసేందుకు భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మమత బెంగాలీలో చేసే ప్రసంగాన్ని ఆయా ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేసి వినిపించేలా ఏర్పాట్లు చేసినట్లు తృణమూల్ నేత మదన్ మిత్రా వెల్లడించారు. తమిళనాడుపైనా టీఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. చెన్నైలో భారీ స్క్రీన్లతోపాటు జయలలిత తరహాలో మమతను అమ్మగా సంబోధిస్తూ పలు కూడళ్లలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.

పార్లమెంటులో బీజేపీని ఇరుకునపెట్టే వ్యూహం

మరోవైపు ఈ నెల 25న ఢిల్లీ వెళ్లాలని మమత నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలన్నీ కలిసి ఇరుకున పెట్టేలా చేయాలన్నది.. ఆమె పర్యటన లక్ష్యం. ఇందుకోసం ఆమె కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఎన్సీపీ నేత శరద్ పవార్, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్, పలువురు ఇతర పార్టీల నేతలను కలుసుకుంటారు. మమతతో భేటీపై సోనియా కూడా ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీని నిలువరించే విషయంలో ఇతర పార్టీల సహకారాన్ని ఆశిస్తున్న ఆమె మమత కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పెగసుస్ స్పైవేర్ వివాదంలో చిక్కుకొని ఎన్డీయే ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ తరుణంలో ఇతర కీలక అస్త్రాలను కూడా ప్రతిపక్షాలు మూకుమ్మడిగా సంధిస్తే బీజేపీ ఆత్మ రక్షణలో పడుతుందని.. తద్వారా ఆ పార్టీ దూకుడుకు చాలావరకు కళ్లెం వేయవచ్చన్నది మమత ఆలోచన. అయితే మిగతా పార్టీలు ఎంతవరకు కలిసి వస్తాయన్నదే ప్రశ్న.

Also Read : మణిపూర్‌ కాంగ్రెస్‌లో కుదుపు.. అధ్యక్షుడు సహా 8 మంది ఎమ్మెల్యేలు రాజీనామా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp