ఆ పరిస్థితి రాకూడదనే దీదీ ప్రయత్నం

By Srinivas Racharla Sep. 20, 2020, 05:01 pm IST
ఆ పరిస్థితి రాకూడదనే దీదీ ప్రయత్నం

బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ' పూలు అమ్మిన చోట కట్టెలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ' అసెంబ్లీ ఎన్నికలలో తమకు రాకుండా చూసుకునేందుకు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతుంది.తమ పార్టీ ముఖ్య నేతలు అవినీతి మరకలు అంటించుకోగా ప్రజల అభిమానాన్ని చూరగొన్న వామపక్ష నాయకులను తమ పార్టీలోకి లాక్కునేందుకు ప్రయత్నించి విఫలమైంది.తాజాగా భారతీయ జనతా పార్టీ ప్రాబల్య ప్రాంతాలపై ' పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్స్' చెయ్యాలని అధికార టీఎంసీ భావిస్తుంది

గతేడాది జరిగిన కలిగగంజ్, ఖరగ్‌పూర్ సదర్, కరీంపూర్ మూడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలలో ఓటమి పాలవ్వడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖంగు తిన్నారు.పైగా 2019 లోక్‌సభ సాధారణ ఎన్నికలలో టీఎంసీకి అననుకూల ఫలితాలు రావడంతో ఆ పార్టీ అధినేత కలవరపాటుకు గురయ్యారు.దీంతో 2021 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపిని నిలువరించేందుకు వ్యూహరచనపై సీఎం మమతా బెనర్జీ కసరత్తు మొదలు పెట్టారు.

వచ్చే ఏప్రిల్-మే నెలలో జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా "తమని ఎక్కువగా దెబ్బతీసే చోట బిజెపిని దెబ్బ కొట్టాలి" అని టిఎంసి అధినేత మమతా బెనర్జీ వ్యూహరచన చేస్తున్నారు.తదనుగుణంగా ఉత్తర బెంగాల్ మరియు జంగల్‌మహల్ ప్రాంతాలలోని బుర్ద్వాన్, బిర్భం,పురూలియా, బంకురా,మిడ్నాపూర్ జిల్లాలతో సహా బిజెపి యొక్క బలమైన ప్రాంతాలపై ' పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్స్' కోసం వెళ్లాలని ఆమె నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో కోవిడ్ -19 సంక్షోభం కారణంగా కొన్ని నెలల వర్చువల్ సమావేశాల తరువాత మమతా వ్యక్తిగతంగా సెప్టెంబర్ 21న ఉత్తర బెంగాల్‌ను సందర్శించాలని నిర్ణయించుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బిజెపిని కార్నర్ చేయడానికి పరిపాలన అధికారులు మరియు స్థానిక ప్రజలతో ముఖాముఖి సమావేశమై ఆ ప్రాంత సమస్యలపై చర్చించి పరిష్కరించనున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో తన పార్టీ పరిస్థితిని అర్థం చేసుకొని పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించడంతోపాటు తమకు దూరమైన వర్గాలను తిరిగి పార్టీ వైపు తీసుకొచ్చేందుకు ప్రయత్నించనున్నారు.

2019 లోక్‌సభ ఎన్నికలలో ఉత్తర బెంగాల్‌లోని కూచ్ బెహర్, అలీపుర్దువార్, జల్పాయిగురి, డార్జిలింగ్, రైగంజ్, బలూర్‌ఘాట్, నార్త్ మాల్డా మరియు దక్షిణ మాల్డా ఎనిమిది లోక్‌సభ స్థానాలలో టిఎంసి ఒకటి కూడా గెలవలేకపోయింది.వాటిలో ఏడు బిజెపికి దక్కగా దక్షిణ మాల్డా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దివంగత ఘని ఖాన్ చౌదరి సోదరుడు అబూ హసీం ఖాన్ చౌదరి గెలుపొందారు.ఈ స్థానంలో అధికార టీఎంసీ అభ్యర్థి ఎండి హుస్సేన్ 27.47 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలవడంతో టిఎంసికి షాక్ తగిలింది.

ఉత్తర బెంగాల్‌లో బిజెపి బలం భారీగా పెరిగినట్లు గత లోక్ సభ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.వచ్చే ఏడాది ఎన్నికలలో టిఎంసి యొక్క అదృష్టం ఈ ప్రాంత పార్టీ నాయకులు పనితీరుపై ఆధారపడి ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.దీంతో పార్టీలో ముఠా కక్షలను తొలగించడానికి మమతా ఇటీవల పెద్ద ఎత్తున సంస్థాగత పునర్ నిర్మాణం చేపట్టారు. కాగా అధికార పీఠం దక్కించుకోవడానికి అవసరమైన 148 అసెంబ్లీ స్థానాలలో కీలకమైన 54 సీట్లు ఉత్తర బెంగాల్‌లో ఉన్నాయి. దీంతో ఇరుపక్షాల రాజకీయ ఎత్తుగడలు పరాకాష్టకు చేరడంతో ఈ ప్రాంతం రణరంగాన్ని తలపిస్తుంది.

ఇదిలా ఉంటే మరోవైపు ప్రధానంగా 12 అసెంబ్లీ సీట్లు కలిగిన గిరిజన ప్రాంతం బంకురాతో పాటు మొత్తం గిరిజన ప్రాబల్యం గల జంగల్‌మహల్ ప్రాంతంలో దాదాపు 35.8 శాతం షెడ్యూల్డ్ కుల (ఎస్సీ) మరియు షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) ఓటర్లను లక్ష్యంగా చేసుకుని టిఎంసి వ్యూహరచన చేస్తోంది.2019 లోక్‌సభ ఎన్నికలలో కమలం పార్టీ గణనీయమైన పురోగతి సాధించిన ప్రాంతంలో బిజెపిని అడ్డుకోవడానికి తనదైన శైలిలో ఎత్తుగడలను సీఎం మమత రూపొందిస్తున్నారు.తన ఉత్తర బెంగాల్ పర్యటన తరువాత, కమలం శిబిరంలో మరో 'సర్జికల్ స్ట్రైక్' చేసే ప్రయత్నంలో భాగంగా మమతా జంగల్‌మహల్‌ను సందర్శిస్తారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.

ఇక బెంగాల్‌ లోక్‌సభ స్థానాలలో బిజెపి తన 2 సీట్ల నుండి ఏకంగా 18 స్థానాలకు పెంచడానికి ఉత్తర బెంగాల్ సహాయపడింది. ఈ నేపథ్యంలో తన పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో గెలవడం లేదా ఓడిపోవడం మధ్య వ్యత్యాసం ఉత్తర బెంగాల్‌కు ఉంటుందని మమతాకు అర్థమైంది.అలాగే బెంగాల్ సీఎం కుర్చీ అధిష్టించడానికి ప్రతిపక్ష బిజెపికి కూడా ఈ ప్రాంతం ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp