ప్చ్.. లోకేశ్ : ఇలా అయితే ఎలా?

By Kalyan.S Jul. 31, 2021, 09:00 am IST
ప్చ్.. లోకేశ్ : ఇలా అయితే ఎలా?

త‌న‌ను తాను రాజ‌కీయ నాయ‌కుడిగా నిరూపించుకోవాల‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేశ్ తెగ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. జ‌గ‌న్ పై డైలాగులు రాయిపించుకుని మ‌రీ వ‌దులుతున్నారు. ఉద్యోగాల కోస‌మంటూ ఉద్య‌మాలూ చేప‌డుతున్నారు. యువ‌త‌కు ఆక‌ట్టుకునేలా ప్ర‌సంగాలూ చేస్తున్నారు. కానీ, ఆయ‌న‌ను రాజ‌కీయ నాయ‌కుడిగా జ‌నం గుర్తించడం లేదు. ప్ర‌జ‌ల్లో అంత‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌డం లేదు. ఆయ‌న‌కు ఎక్క‌డ‌కు వెళ్తున్నా, ఇప్ప‌టికీ చంద్ర‌బాబు కొడుకు వ‌స్తున్నాడ‌ట అంటున్నారే కానీ లోకేశ్ వ‌స్తున్నాడ‌నే మాట చాలా త‌క్కువ‌గా వినిపిస్తోంది. పైగా ఆయ‌న కార్య‌క్ర‌మాల‌కు పెద్ద‌గా జ‌నాలు కూడా రావ‌డం లేదు. తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లా పెద్దాపురంలో చేప‌ట్టిన విగ్ర‌హావిష్క‌ర‌ణే ఇందుకు నిద‌ర్శ‌నం.

లోకేష్ త‌న స్థాయిని పెంచుకునేందుకు జగన్ మీద గట్టిగానే విమర్శలు చేస్తున్నారు కానీ ఫ‌లితం ఉండ‌డం లేదు. పార్టీ లోని చాలా మంది నేత‌లు కూడా లోకేశ్ ను త‌మ లీడ‌ర్ గా చెప్పుకోవ‌డం లేదు. ట్వీట్లు.. పొలిటిక‌ల్ ఫీట్లు చేసే నేత‌గానే చ‌ర్చించుకుంటున్నారు. అలాంటి వ్య‌క్తి పార్టీని ఎలా న‌డ‌ప‌తాడ‌నే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. దివంగత ఎన్టీఆర్ త‌న ఆహార్యం, హుందాత‌నంతో పార్టీని న‌డిపిస్తే, ఆ త‌ర్వాత‌.. చంద్రబాబు తన వ్యూహాలతో చాతుర్యంతోనే పార్టీని ఇంతకాలం నడిపారు. చంద్రబాబు కి గ్లామర్ లేకపోయినా గ్రామర్ అయినా ఉంది. అన్నింటికి మించి ఎవరిని ఎలా గుప్పిట పట్టాలో తెలిసిన చాతుర్యం బాబు సొంతం.

లోకేష్ దగ్గరకు వస్తే అటు గ్లామర్ లేదు ఇటు గ్రామర్ కూడా లేదు. దాంతో ఆయన జనాలలోకి వెళ్తున్నా ఏ మాత్రం స్పందన రావడంలేదు అంటున్నారు ప‌రిశీల‌కులు. లోకేష్ ని జిల్లాల టూర్లకు పంపించి భావి నాయకుడిగా ప్రొజెక్ట్ చేయాలని చంద్రబాబు అయితే తెగ ఉబలాటపడుతున్నారు కానీ చంద్రబాబు ఆలోచనలు ఆశలు తప్పు అని లోకేష్ బోసిపోయిన పర్యటనలు నిరూపిస్తున్నాయి. లోకేష్ వస్తున్నాడు అంటే టీడీపీ క్యాడర్ లో ఎక్కడా జోష్ కనిపించడంలేదు. పైగా ఆయన పరామర్శ యాత్రలు కూడా తేలిపోతున్నాయి. హడావుడి అంతా కూడా టీడీపీ అనుకూల మీడియాలో తప్ప మరెక్కడా లేదనే చెప్పాలి.

పార్టీ యువనేత భవిష్యత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ అవుతోన్న నేత వస్తున్నాడంటే పర్యటన అంతా దద్దరిల్లిపోవాలి. కానీ నేతలకే ఆయన పర్యటనలు పట్టడం లేదు. ఇక మరో వైపు వైసీపీ దూకుడుగానే ఉంది. టీడీపీని ఈ పాటికే టార్గెట్ చేసి చెక్ పెట్టేసింది. ఇప్పటికే ఆ పార్టీలో నోరున్న లీడర్లకు మూడు చెరువుల నీళ్ళు తాగిస్తోంది. ఎవరు గట్టిగా నోరు మెదిపితే ఎక్కడ చిక్కుల్లో పడతామో ? అన్న భయంతో ఉంటున్నారు. వారి తరఫున నిలబడి లోకేష్ సర్కార్ కి ఇస్తున్న వార్నింగులు కూడా గాలిలోనే కలసిపోతున్నాయి. ఏ మాత్రం వైసీపీ పట్టించుకోవడంలేదు. అసలు ఖాతరు చేయడంలేదు. నిజానికి ఈ టైమ్ లో చంద్రబాబు టూర్లు చేసి విమర్శలు చేసినా కూడా వైసీపీ పెద్దల నుంచి నో రెస్పాన్స్ అన్నట్లుగానే సీన్ ఉంది.

దాంతో రాజకీయంగా ఏ మాత్రం అనుభవం లేని లోకేష్ పెద్ద మాటలు మాట్లాడుతుంటే చాలా బాగుంది అని అనుకూల మీడియాలో రాసుకుని మురిసిపోవడమే తప్ప ఇటు జనాలలో కానీ అటు పార్టీలో కానీ వాటి ఇంపాక్ట్ అసలు కనిపించడం లేదు. ప్ర‌స్తుతం ఆ పార్టీకి, లోకేశ్ ఉన్న ఆద‌ర‌ణ‌ను ప‌రిశీలిస్తే.. వ‌చ్చేది మ‌న ప్ర‌భుత్వ‌మే అనేది ఓ డ‌ప్పుగానే మిగులుపోతుంద‌ని అర్థం అవుతోంది. మ‌రి మున్ముందు రాజ‌కీయాలు ఎలా చేస్తారో చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp