చరిత్ర సృష్టించాలంటే ముందు చరిత్ర తెలిసుండాలి చినబాబు

By Ravuri.SG Dec. 13, 2019, 06:57 pm IST
చరిత్ర సృష్టించాలంటే ముందు చరిత్ర తెలిసుండాలి చినబాబు

మంగళగిరిలో పోటీ చేసి చరిత్ర సృష్టించాలన్నా లోకేష్ ఆలోచన బాగానే ఉందికానీ అంతకన్నా గొప్ప చరిత్ర సృష్టించే అవకాశాన్ని ఆయన వదులుకున్నాడు. చంద్రబాబు సొంత నియోజకవర్గము తొలిసారి ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గము, చంద్రబాబు రాజకీయ జీవితంలో ఏకైక రాజకీయ ఓటమిని చూపించిన నియోజకవర్గమైన చంద్రగిరిలో టీడీపీ చివరిసారిగా 1994 ఎన్నికల్లో గెలిచింది. 1994 ఎన్నికల్లో లోకేష్ సొంత బాబాయి నారా రామ్మూర్తి నాయుడు గెలిచాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో జరిగిన తొలి ఎన్నికల్లో1999లో తమ్ముడు రామ్మూర్తి నాయుడిని సొంత నియోజకవర్గం చంద్ర గిరిలో గెలిపించుకోలేకపోయాడు.

చంద్రగిరి నుండి 1999-2009 మధ్య కాంగ్రెస్ తరపున హ్యాట్రిక్ విజయాలు సాధించిన గల్లా అరుణ 2014లో టీడీపీ తరపున పోటీ చేసినా గెలవలేక పోయింది. 2014లో వైసీపీ తరపున గెలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శాసనసభలో చంద్రబాబు కంట్లో నలుసయ్యాడు. 2019 ఎన్నికల్లో లోకేష్ చంద్రగిరి నుండి పోటీ చేసి గెలిచి ఉంటే తండ్రి ఓడిపోయిన నియోజకవర్గంనుండి గెలిచినందుకు తండ్రిని మించిన తనయుడని, మరోవైపు చెవి రెడ్డిని ఓడించినందుకు జెయింట్ కిల్లర్ అని పేరు తెచ్చుకునేవాడు. చంద్రగిరి నుండి పోటీ చేయకుండా లోకేష్ బాబు గొప్ప అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

లోకేష్ తన తండ్రి సొంత నియోజకవర్గం చంద్రగిరి నుండి కాకపోయినా కనీసం తాతగారు తమ దైవం, తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు సొంత నియోజకవర్గం అయిన గుడివాడనుండి పోటీ చేసి గెలిచినా చరిత్ర సృష్టించినట్లయ్యేది. మొదటి రెండు సార్లు 'తెలుగుదేశం' పార్టీ తరపున గెలిచిన కొడాలి నాని 2014 మరియు 2019 లో వైసీపీ తరపున గెలిచాడు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2014-19 మధ్యకూడా ఆయనకు శాసనసభలోనూ బయట కూడా తన మాటలతో ప్రశాంతత లేకుండా చేసాడు కొడాలి నాని. కనీసం గుడివాడనుండైనా పోటీచేసి గెలిచినట్లయితే అటు కొడాలి నానికి చెక్ పెట్టినట్లయ్యేది., తాత ఎన్టీఆర్ వారసుడిగా తనను గుడివాడ ప్రజలు గెలిపించారని చెప్పుకున్నట్లయ్యేది. ఇంత చరిత్ర సృష్టించే అవకాశం ఉన్న చంద్రగిరి గుడివాడ రెండింటిని వదులుకుని,ప్రజలకే కాదు రాజకీయ విశ్లేషకులకు కూడా,గుర్తురాని చరిత్ర ఉన్న మంగళగిరి నుండి పోటీ చేసి బోల్తాబడ్డాడు.

కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలలో ఏ ఒక్కరి మీద పోటీ చేసి ఓడించినా లోకేష్ గెలుపుకు గుర్తింపు వచ్చేది. చంద్రబాబుకు శాసనసభలో వారి తలపోటు తప్పేది.

చరిత్ర సృష్టించాలనుకోవడం మంచిదే కానీ, ఏది చరిత్ర అని గుర్తించడమే గొప్ప రాజకీయ లక్షణం. లోకేష్ ఆ దిశగా కృషి చేసి 2024 కు సంసిద్ధమైతే మంచిది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp