రాం విలాస్‌ పాశ్వాన్ కన్నుమూత

By Srinivas Racharla Oct. 08, 2020, 09:42 pm IST
రాం విలాస్‌ పాశ్వాన్ కన్నుమూత

లోక్‌జనశక్తి పార్టీ నేత, కేంద్రమంత్రి రాం విలాస్‌ పాశ్వాన్ (74) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. రాం విలాస్‌ పాశ్వాన్ మరణవార్తను ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ట్విటర్‌లో వెల్లడించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో ఓ ఆస్పత్రిలో గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. కానీ ఇతర ఆరోగ్య సమస్యలు ఆయనని చుట్టుముట్టడంతో వాటికి చికిత్స పొందుతూ మరణించారు.

1946 జులై 5న బీహార్‌లోని  ఖగారియా జిల్లా షాహర్‌బన్నీలో ఓ దళిత కుటుంబంలో రాం విలాస్ పాశ్వాన్ జన్మించారు.ఆయన పాట్నా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్, పీజీ చేశారు.తన రాజకీయ జీవితాన్ని పాశ్వాన్ యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ సభ్యునిగా ప్రారంభించాడు.1969 లో అలౌలి (ఖాగారియా) నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యాడు.

ఆయన 1974 లో లోక్‌దళ్ ఏర్పడిన తరువాత దానిలో చేరి ప్రధాన కార్యదర్శి అయ్యాడు.ఆ పదవిలో ఉండగా 1975లో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించి నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నందుకు ఆయనని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. 1977లో జైలు నుండి విడుదలైన తర్వాత జనతా పార్టీలో సభ్యుడయ్యాడు.
1977 పార్లమెంట్ ఎన్నికలలో రాంవిలాస్ పాశ్వాన్ హాజీపూర్ నియోజకవర్గం నుండి జనతా పార్టీ తరుపున తొలిసారి లోక్‌సభలో ప్రవేశించాడు.ఈ ఎన్నికలలో అత్యధిక ఓట్ల తేడాతో గెలిచిన ఎంపీగా ఆయన రికార్డు సాధించాడు.అదే నియోజకవర్గం నుండి 1980, 1989, 1996, 1998, 1999, 2004, 2014 ఎన్నికలలో విజయం సాధించిన పాశ్వాన్ మొత్తం ఎనిమిది సార్లు లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు.1983లో రాంవిలాస్ పాశ్వాన్ దళితుల విముక్తి,సంక్షేమం కోసం 'దళిత సేన' ను స్థాపించాడు.దీంతో ఆయన బీహార్‌లో తిరుగులేని దళిత నేతగా ఆవిర్భవించాడు.

1996 నుండి ప్రతి సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా...

తొమ్మిదవ లోక్‌సభ(1989)కు రాంవిలాస్ పాశ్వాన్ ఎన్నికైనప్పుడు వి.పి.సింగ్ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక, సంక్షేమ మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించాడు.ఇక 1996-1998 వరకు కేంద్ర రైల్వే మంత్రిగా కొనసాగాడు. అనంతరం అక్టోబర్ 1999- 2001 సెప్టెంబర్ వరకు కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిగా కూడా పని చేశాడు.

2000లో జనతాదళ్ పార్టీని వీడి లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి)ని స్థాపించి దాని అధ్యక్షుడిగా పని చేశాడు.తదనంతరం 2004 లో ఆనాటి అధికార యూపీఏ ప్రభుత్వంలో చేరిన కొత్తలో రసాయనాలు,ఎరువుల మంత్రిత్వ శాఖ, ఉక్కు మంత్రిత్వ శాఖ మంత్రిగా పనిచేసాడు. కానీ 2009 లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. తరువాత 2014 సార్వత్రిక ఎన్నికలలో హాజీపూర్ నియోజకవర్గం నుండి 16 వ లోక్‌సభ ఎన్నికయ్యాడు. ప్రస్తుతం ఆయన బీహార్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఇక నరేంద్ర మోడీ కేబినెట్‌లో 2014 నుండి కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. 

కాగా ప్రస్తుత బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరు సిద్ధమైన ఎల్‌జెపికి ఆయన మరణం తీరని లోటుగా చెప్పవచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp