కేజ్రీవాల్ కూడా అంతేనా..?

By Karthik P Apr. 20, 2021, 12:00 pm IST
కేజ్రీవాల్ కూడా అంతేనా..?

ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు అన్నీ ప్రజా ఆరోగ్యం, సంక్షేమం కోసమే. కొన్ని నిర్ణయాలను వేగంగాను, మరికొన్నింటిని ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని నిర్ణయాలు ప్రకటించడానికి, వాటిని అమలు చేసేందుకు మధ్య కొంత సమయం అవసరం. ఈ కోవకు చెందినదే లాక్‌డౌన్‌ నిర్ణయం. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న సమయంలో మహమ్మారికి కల్లెం వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. లాక్‌డౌన్‌ దిశగా సాగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా సెకండ్‌ వేవ్‌లో లాక్‌డౌన్‌ విధించిన తొలి రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది.

నిన్న సోమవారం రాత్రి 10 గంటల నుంచి రాబోవు సోమవారం ఉదయం 5 గంటల వరకు ఆరు రోజుల పాటు లాక్‌డౌన్‌ ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సోమవారం మధ్యాహ్నం ప్రకటించారు, లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నట్లు ఆయన కొన్ని గంటల ముందు చెప్పారు. ఈ నిర్ణయం ప్రకటించే ముందు.. ఢిల్లీ మహానగరంలో ఉన్న వలసజీవుల గురించి కేజ్రీవాల్‌ ఆలోచించారా..? లాక్‌డౌన్‌ అంటే అన్ని బంద్‌. మరి వలస కార్మికులకు చేసేందుకు పని, తినేందుకు తిండి, ఉండేందుకు జాగా దొరకదు. ఇలాంటి పరిస్థితిలో వారు స్వస్థలాలకు బయలుదేరుతారు. వారు వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు తగినంత సమయం ఇచ్చి లాక్‌డౌన్‌ ప్రకటించడం వల్ల వచ్చే నష్టం ఏమిటి..? లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నట్లు కనీసం రెండు, మూడు రోజుల ముందు చెప్పినా.. వలస జీవులకు కష్టాలు తప్పుతాయి.

అలా లాక్‌డౌన్‌ ప్రకటించారో లేదో.. ఇలా వలస జీవులకు గత ఏడాది అనభవాలు కళ్లముందు కదిలాయి. ఇంకేముందు.. బ్యాగు నెత్తిన పెట్టుకుని స్వస్థలాలకు బయలుదేరారు. రైల్వే స్టేషన్ల కిక్కిరిసిపోయాయి. గత ఏడాది ఇదే పరిస్థితి. ఏ మాత్రం ముందు చూపు లేకుండా.. కోట్లాది మంది వలస జీవుల గురించి ఆలోచించకుండా ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్‌ పెట్టేశారు. ఫలితంగా చేసేందుకు పని, తినేందుకు తిండిలేక వసల జీవులు అల్లాడిపోయారు. స్వస్థలాలకు వెళ్లేందుకు వందల కిలోమీటర్లు నడిచారు. కొంత మంది గమ్యాలకు చేరుకున్నారు. మరికొంత మంది మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు.

ఇప్పుడు ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి. వేగంగా తీసుకున్న నిర్ణయం వల్ల వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులను చూసిన కే జ్రీవాల్‌.. ఇది స్వల్పకాలిక లాక్‌డౌన్‌ అని ప్రకటించారు. వలస కార్మికులు నగరం వదిలి వెళ్లిపోవద్దని విజ్ఞప్తి చేశారు. కార్మికుల అవసరాలు తీరుస్తామని హమీ ఇచ్చారు. అయితే లాక్‌డౌన్‌ విషయంలో గత ఏడాది అనుభవం.. కార్మికులకు పాలకులపై నమ్మకం లేకుండా చేసింది. అందుకే కేజ్రీవాల్‌ మాటలు విశ్వసించని కార్మికులు స్వస్థలాలకు బయలుదేరిపోతున్నారు. గత ఏడాదిలాగే ఎవరిని నిందించకుండా సాగిపోతున్నారు.

Also Read : మళ్లీ లాక్ డౌన్ అనివార్యమా, ఢిల్లీ అనుభవం ఏం చెబుతోంది..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp