"లాక్‌డౌన్" మార్గదర్శకాలు ...

By iDream Post Mar. 25, 2020, 08:13 am IST
"లాక్‌డౌన్" మార్గదర్శకాలు ...

దేశంలో ఇప్పుడిప్పుడే తన కోరలతో విషము విరజిమ్ముతున్న కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి మంగళవారం అర్ధరాత్రి నుంచి ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటు దేశం మొత్తం లాక్‌డౌన్ చేస్తూ సంచలన నిర్ణయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు.ఈ మూడు వారాలను మీ జీవితంలో మర్చిపోండని దేశ ప్రజలను కోరారు. కరోనా వైరస్‌ ప్రబలకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని ప్రధాని మోదీ తెలిపారు. మీ ఇంటి గడప మీకు లక్ష్మణ రేఖాని దానిని దాటి బయటకు రావొద్దన్నారు. లాక్‌డౌన్ కొనసాగే ఈ 21 రోజులు ప్రజలందరూ సహకరించాలని రెండు చేతులు జోడించి ప్రధాని మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ గురించి సమగ్ర వివరాలు తెలుసుకుందాం.

"లాక్‌డౌన్"అంటే ఏమిటంటే
లాక్‌డౌన్ అంటే "సాంఘిక జీవనానికి దూరంగా ఇంట్లో మనకు మనంగా స్వీయ నిర్బంధంలో ఉండటమే.కరోనా కట్టడి కోసం గత ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరు రాష్ట్రాలను లాక్‌డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు.గత రెండు రోజులుగా లాక్‌డౌన్ వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు తెలుగు ప్రజలకు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది.

దీంతో మరొకసారి 'లాక్‌డౌన్' అనే పదం భారతీయుల నిత్య జీవితంలోకి వచ్చేసింది. లాక్‌డౌన్ కాలంలో అనుసరించాల్సిన నియమాలను తెలుసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత.

లాక్‌డౌన్ సమయంలో లభించే సదుపాయాలు:

★ అత్యవసర సేవలు అందించే హాస్పిటళ్లు,మెడికల్ షాపులు 24 గంటలు అందుబాటులో ఉంటాయి.
★ నియమిత సమయంలో మాత్రమే సూపర్ మార్కెట్లు,పాలు, కూరగాయలు షాపులు వంటి నిత్యావసర దుకాణాలు తెరిచి ఉంచుతారు.
★ నిర్ణీత సమయములో కూరగాయలు,ఇతర నిత్యావసర సరుకుల కొనుగోలుకు పరిమిత సంఖ్యలో ప్రజలను            అనుమతిస్తారు.
★ అత్యవసర విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరు అవుతారు.
★ ప్రయివేట్ ఉద్యోగులు ఇంట్లో నుంచి పని చేసుకునే అవకాశం కల్పిస్తారు.
★ బ్యాంకులు,ఏటీఎంలతో పాటు,ఇన్సూరెన్స్ కంపెనీలు,పోస్టు ఆఫీసులు,టెలీకాం సేవలు అందించే సంస్థలు తమ సేవలు అందిస్తాయి
★ పెట్రోల్ బంకులు,సీఎన్‌జీ బంకులు తెరిచి ఉంటాయి. ఎల్పీజీ గ్యాస్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.
★ లాక్ డౌన్ వలన ఉపాధి కోల్పోయిన కూలీలకు తిండి కోసం బియ్యం, గోధుమపిండి,పప్పులు ప్రభుత్వాలు సరఫరా చేస్తాయి.

లాక్‌డౌన్ కాలంలో పౌరులపై విధించే ఆంక్షలు:

★ ప్రజలను ఇంటి నుండి బయటకు రానివ్వకుండా కట్టుబాటు చెయ్యడం.
★ ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా రోడ్లపై సంచరించే వ్యక్తులను నిర్బంధంలోకి తీసుకొని నెల రోజుల నుండి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా లేదా రెండు
విధిస్తారు.
★ సాయంత్రం ఏడు నుంచి ఉదయం ఆరు గంటల వరకు పౌర ఆంక్షలు కొనసాగుతాయి.ఈ సమయంలో కేవలం మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవాళ్లను మాత్రమే రాత్రిళ్లు అనుమతిస్తారు.
★ కూరగాయలు,నిత్యావసరాల వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తారు.
★ జనసమ్మర్ధం ఉండే ప్రదేశాలైన షాపింగ్ మాల్స్,ఇతర దుకాణాలు,సినిమా థియేటర్స్ మూసివేస్తారు.
★ లాక్‌డౌన్ సమయంలో మద్యం షాపులు,బార్లు,హోటల్స్,రెస్టారెంట్లు మూతపడతాయి.
★ ఆలయాలు,చర్చిలు,మసీదులు వంటి ప్రార్థనాలయాలు భక్తుల సేవలకు దూరంగా ఉంటాయి.పూజా కార్యక్రమాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి.
★ ప్రజలు ఐదుగురి కంటే ఎక్కువమంది గుమికూడకుండా 144 సెక్షన్ అమలు చేయడం.
★ ఫంక్షన్లు,పెళ్లిళ్ల లాంటి వేడుకలకు భారీ సంఖ్యలో జనం హాజరు కావడం నిషేధం.
★ ప్రజారవాణా వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేయడం.

చివరగా ఇరవై ఒక్క రోజులకంటే నూరేళ్ళ జీవితం ఎంతో విలువైనది. అత్యవసరమైన పని ఉంటే తప్పా ఇంటి గడప దాటి కాలు బయట పెట్టొద్దు.మిత్రులను ఇంటికి పిలిపించుకొని సరదాగా కాలక్షేపం చేయడం లాంటి పనులు చేయొద్దు.మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపండి.బోర్ ఫీలింగ్ కలిగినామూడు వారాల పాటు స్వీయ నిర్బంధానికి కట్టుపడదాం. కరోనా మహమ్మారిని దేశం నుండి తరిమికొడదాం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp