సంకట స్థితిలో సహాయం అవసరం

By Kotireddy Palukuri Mar. 25, 2020, 11:44 am IST
సంకట స్థితిలో సహాయం అవసరం

కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తున్నాయి. ప్రజలకు అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈ సంకట స్థితి వల్ల పేదలకు చాలా ఇబ్బందులు వస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పౌర సమాజం కలిసి వీరి ఇబ్బందులు తగ్గించడానికి ప్రత్నిస్తున్నాయి.. ఇదీ నిన్న రాత్రి జాతినుద్దేశించి దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలోని ఓ భాగం.

దేశ రక్షణ కోసం, దేశ ప్రజల కోసం 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు మోదీ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనది. అఖండ భారతవానిని 21 రోజుల పాటు అష్ట దిగ్భందనం చేసే నిర్ణయమది. కరోనా మహమ్మరిని అరికట్టేందుకు తప్పక తీసుకోవాల్సిన నిర్ణయమది. ప్రధాని నిర్ణయాని గౌరవిస్తూ ఆయన సూచనలు తూ చూ తప్పకుండా పాటిస్తూ ధనికులు, మధ్య తరగతి వారు, పేదలు అందరూ ఇళ్లకే పరిమితమవ్వాలి. కరోనాను కట్టడి చేయాలి.

ఈ నెల 22వ తేదీన జనతా కర్ఫ్యూ రోజు నుంచే దేశం లాక్‌డౌన్‌ అయినట్లు చెప్పవచ్చు. ఎందుకంటే ఆ మరుసటి రోజే చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ చేశాయి. ఇక మరుసటి రోజే దేశాన్ని లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఏప్రిల్‌ 14వ తేదీ వరకు.. అంటే 24 రోజుల పాటు దేశం యావత్తూ ఇళ్లకే పరిమితమవ్వాలి. మరి వీరందరూ ఏమి తినాలి..? అనే ప్రశ్న ఎదురవుతోంది.

దేశంలో ధనికులు కేవలం 10 శాతం మందే. మిగతా వారు మధ్యతరగతి, పేద కుటుంబాలు, ఏ నెలకు ఆ నెల.. ఏ రోజుకు ఆరోజు తెచ్చుకుని తినే బడుగుజీవులు దేశంలో 90 శాతం మంది ఉన్నారు. ఏ ఒక్క నెల, ఓ ఒక్క రోజు వారి పని ఆగితే.. వారి కుటుంబ బండి ఒడిదొడుకులకు లోనవుతుంది. తిండి లేక ఆ కుటుంబాలు ఆలమటిస్తాయి. నిత్యవసరాలు, కూరగాయల దుకాణాలు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వాలు ప్రకటించినా.. వాటిని కొనుగోలు చేసేందుకు నగదు ఆయా కుటుంబాల చేతిల్లో ఉండవు. ప్రస్తుత పరిస్థితుల్లో అప్పు పుట్టదు.

21 రోజుల పాటు దేశాన్ని లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు మోదీ ప్రకటించిన తర్వాత ఆయన ప్రసంగం చివర వరకూ దేశ ప్రజలు తమకు ఏదైనా సహాయం చేస్తారేమోనని ఆశగా ఎదురుచూశారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు, తమ ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం నుంచి సహాయం వస్తుందని ఆశించారు. పేద, మధ్య తరగతి ప్రజలు, ప్రభుత్వాలు ఆశలు ఆశలుగానే మిగిలాయి కానీ దేశ ప్రధాని నోటి నుంచి సహాయం అనే మాట రాలేదు.

కరోనా మహమ్మరి నుంచి ప్రజలను కాపాడేందుకు లాక్‌డౌన్‌ చేయాల్సిందే. 21 రోజులు కాదు అవసరమైతే రెండు, మూడు నెలలు చేయాల్సిందే. ఇదే సమయంలో ప్రజలకు నిత్యవసరాలు అందించే బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్న విషయం చాయ్‌వాలా నుంచి దేశ ప్రధాని అయిన నరేంద్ర మోదీకి తెలియదనుకోవాలా..? ప్రజలకు సహాయం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయకముందే ప్రధాని మేల్కొనాలి. ఆపత్కాలంలో ప్రభుత్వ చేయూత ఎంతో అవసరం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp