కుక్క‌ల తిరుగుబాటు తీర్మానాలు

By G.R Maharshi Apr. 06, 2020, 10:46 am IST
కుక్క‌ల తిరుగుబాటు తీర్మానాలు

అనంత‌పునం ఫ‌స్ట్ రోడ్ బ్రిడ్జి కింద విరిగిపోయిన టేబుల్ చుట్టూ కుక్క‌లు రౌండ్ టేబుల్ స‌మావేశం జ‌రిపాయి. తెల్ల‌మ‌చ్చ‌ల న‌ల్ల‌కుక్క త‌న‌కు తానే అధ్య‌క్షుడిగా ప్ర‌క‌టించుకుని కొన్ని అత్య‌వ‌స‌ర తీర్మానాలు ప్ర‌వేశ పెట్టింది.

1.మ‌నుషుల్ని కుక్క‌ల ప‌ట్ల విశ్వాసం స‌న్న‌గిల్ల‌డం వ‌ల్ల క‌న‌ప‌డ‌కుండా తిరుగుతున్నారు.
2.మ‌నుషుల్ని ప‌ట్టి లాక్కెళ్ల‌డానికి మునిసిపాలిటీ వాళ్లు తిరుగుతుండ‌డం వ‌ల్ల వాళ్లంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయార‌ని గూఢ‌చారి కుక్క‌ల స‌మాచారం.
3.తోక వుండ‌డం వ‌ల్ల మ‌నం స్వేచ్ఛ‌గానూ, అవి లేక మ‌నుషులు ఖైదులోనూ జీవిస్తున్నారు.
4.ఇన్నాళ్లు మ‌నుషులు విసిరే మెతుకుల‌కి అల‌వాటు ప‌డి, మ‌న స‌హ‌జ ల‌క్ష‌ణ‌మైన వేట‌ని మ‌రిచిపోయాం. ఇపుడు ఎవ‌డి తిండికి వాడే పోరాడ్డం వ‌ల్ల సైనికులుగా మారాం. ఇది కుక్క‌ల ఆత్మాభిమాన ప్ర‌క‌ట‌న‌. మ‌నిషికి ఆత్మ‌, అభిమానం రెండూ వుండ‌వు. మ‌నిషి కంటే కుక్క ఎపుడూ గొప్ప‌దే.
5.బానిస‌లుగా పుట్టిన మ‌నుషులు, స‌మ‌స్త జీవ‌జాలాన్ని బానిస‌లుగా మార్చుకునే ప్ర‌య‌త్నం చేశారు. బానిస‌ల తిరుగుబాటు మొద‌లైంది. మ‌నుషులు ఇళ్ల నుంచి బ‌య‌టికి రాకుండా మ‌నం పోరాడాలి.
6.ఒక‌ప్పుడు దొంగ‌ల్ని మ‌నం వాస‌న ప‌ట్టేవాళ్లం. కాలుష్యం వ‌ల్ల మ‌న ముక్కులు ప‌ని చేయ‌క చాలా కాల‌మైంది. మంచోడు, దొంగోడు ఒక్క‌లాగే క‌నిపిస్తున్నారు. మ‌నిషి వ‌ల్ల మ‌న‌కు జ‌రిగిన న‌ష్టాల్లో ఇది ముఖ్య‌మైంది.
7.న‌గ‌రంలోని అన్ని వీధుల్లో ఉన్న కుక్క‌ల్ని స‌మాయ‌త్త‌ప‌రిచి స‌మ‌ర‌భేరీ మోగిద్దాం. మ‌నం ఇంట్లో వుంటే ఎంత ప్ర‌మాద‌మో, మ‌నిషి వీధిలోకి వ‌చ్చినా అంతే ప్ర‌మాద‌మ‌ని గుర్తిద్దాం.
8.మ‌నం వాడిని ఎంత గౌర‌వించినా , మ‌న‌ల్ని వాడు అవ‌మానిస్తూనే వుంటాడు. కుక్క బ‌తుకు, కుక్క చావు, క‌న‌క‌పు సింహాస‌న‌మున శున‌కం, ఇలా నీచ వ‌ర్ణ‌న‌లు చేస్తూనే ఉంటాడు.
9.పాలు తాగే బిడ్డ‌ల్ని కూడా మ‌న నుంచి వేరు చేసే మ‌నిషిపై పోరాటం చేయాలి. పోరాడితే పోయేదేం లేదు మెడ‌లో గొలుసులు త‌ప్ప‌.
10.భౌభౌమ‌నే నినాదంతో , తోక‌నే ప‌తాకంగా, గోళ్లు ఆయుధంగా యుద్ధం చేద్దాం. విజేత‌లై చ‌రిత్ర సృష్టిద్దాం.
ఇదంతా విన్న ఒక ముస‌లి కుక్క "వూ" అని మోర ఎత్తి విషాదంగా మొరిగింది.

"చూడండి కుర్రాళ్లు అనుభ‌వంతో చెబుతున్నా. నేను రెండుసార్లు మునిసిపాలిటి వ్యాన్ నుంచి త‌ప్పించుకున్నా. పొరుగువీధి కుక్క‌ల దాడిలో నాలుగుసార్లు బ‌తికా. రాత్రి మ‌నం ఎన్ని మాట్లాడినా తెల్లారి మ‌నుషులు "చుచ్చుచ్చు" అని అరిచి రెండు ఎండిపోయిన రొట్టెలు చూపిస్తే మ‌నం గాల్లో ఎగురుతూ , తోక‌ల్ని పెయింటింగ్ బ్ర‌ష్‌లా వూపుతూ కుయ్యికుయ్యిమ‌ని వాడి కాళ్లు నాకేస్తాం.

యుద్ధం గురించి మాట్లాడ్డం వేరు, చేయ‌డం వేరు. ఒక వేళ మ‌న‌లో కొంద‌రు ఆవేశ‌ప‌డి యుద్ధానికి పూనుకున్న మ‌న నాయ‌కుడే మ‌నిషిగా ప‌రావ‌ర్త‌నం చెంది మ‌న‌ల్ని అమ్మేస్తాడు. చివ‌రికి మ‌నం ఎవ‌రి మీద పోరాడామో కూడా మ‌రిచిపోయి అదే మ‌నుషుల‌తో క‌లిసి విందు ఆర‌గిస్తాం. వాళ్ల‌లాగే బ‌ట్ట‌లు వేసుకోవ‌డం కూడా నేర్చుకుని, య‌జ్ఞ‌యాగాదులు కూడా చేస్తాం. కుక్క‌ల నిర్మూల‌న కోసం కుక్క‌ల‌తోనే యాగం చేయించ‌డం మ‌నుషుల‌కి తెలుసు.
తోక‌లో జ్ఞానం వుంద‌ని మీ న‌మ్మ‌కం. ఈగ‌ల్ని తోలుకోడానికి త‌ప్ప అది ఎందుకూ ప‌నికి రాద‌ని నా న‌మ్మ‌కం.

కుర్ర కుక్క‌లన్నీ క‌లిసి ముస‌లి కుక్క‌పై దాడికి వెళితే, అది త‌ప్పించుకుని ఒక గోడ‌పైకి ఎక్కి "క‌నిపించ‌ని మ‌నిషితో ఎవ‌డైనా యుద్ధం చేస్తారు. ఒక‌సారి వాడు ఇంట్లో నుంచి బ‌య‌టికొస్తే మ‌న మెడ‌లో వాడిచేత గొలుసు వేయించుకోడానికి మ‌న‌లో మ‌న‌మే యుద్ధం చేస్తాం. ఎవ‌డికి మ‌నం విశ్వాసంగా వుంటామో వాడు God, మ‌నకి ఎవ‌డు విశ్వాసంగా వుంటాడో వాడు Dog.ఇదే లోక‌నీతి" అని చెప్పి పారిపోయింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp