కరోనా సంక్షోభంలో కూడా ఉద్యోగుల జీతాలను పెంచిన IT Company

By Vivek Segileti Apr. 15, 2020, 02:36 pm IST
కరోనా సంక్షోభంలో కూడా ఉద్యోగుల జీతాలను పెంచిన  IT Company

కరోనా వచ్చిన దగ్గర్నుంచి ఎన్నెన్నో వార్తలు నిత్యం ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి వాటిల్లో ఎక్కువ ఆందోళనకు గురిచేస్తున్న వార్త 'ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవబోతోందనీ మరీ ముఖ్యంగా కరోనా దెబ్బకు అమెరికా అల్లకలలోమైందనీ ఆ ప్రభావం సాఫ్ట్ వేర్ రంగం మీద ఎక్కువగా ఉంటుందని' రకరకాల ఊహాగానాలు..

'అమెరికాలో లక్ష జాబులు తీసేశారనీ, జర్మనీ కూడా అదే బాటలో నడవబోతోందంటూ' వివిధ వెబ్ మీడియాల్లో వస్తున్న వార్తలు అటువంటి ఊహాగానాలకు మరింత ఊతమిస్తున్నాయి. ఇప్పుడున్న కమ్యునికేషన్, డిజిటల్ వ్యవస్థ దృష్ట్యా ఆ ప్రచారం ప్రతి మారుమూల పల్లెకూ చేరింది ఎంతలా అంటే సాఫ్ట్ వేర్ జాబంటే ఏంటో కూడా తెలియని ఒక ముసలి తాత 'హైద్రాబాదులో జాబులు తీసేస్తున్నారంటనే' అంతలా.

మరి నిజంగా అంత ప్రభావం ఉండేటట్లు అయితే బ్యాంకింగ్ వ్యవస్థ లేని ప్రపంచాన్ని, టెలి కమ్యునికేషన్ వ్యవస్థ లేని జనాన్ని, ఇతరత్రా సేవా రంగం కుదేలయిన ప్రపంచాన్ని ఊహించగలమా? కష్టం. నేటి ఆధునిక మానవుడు అంతలా వాటితో మమేకమైపోయాడు. కాబట్టి విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కరోనా ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది గానీ అదెంత వరకు ఉంటుందో ఇప్పుడే ఒక అంచనాకు రావడం కొంచెం కష్టమే.

ఇంకోపక్క అలాంటి దుష్ప్రచారాలను నమ్మవద్దని చెప్పేలా తన ఉద్యోగుల్లో, ప్రజల్లో ఒక భరోసానిస్తూ కాప్ జెమినీ లాంటి మల్టీ నేషనల్ కంపెనీ అడుగు ముందుకేయడం కూడా ఒక రకమైన ఆరోగ్యకర వాతావరణం నింపగలుగుతుంది.

'కాప్ జెమినీ ఇండియాలో పనిచేసే ఎనభై నాలుగు వేల మంది ఉద్యోగులకు(70%) ఏప్రిల్ ఒకటో తేదీ నుండి జీత భత్యాలు పెంచుతున్నామనీ, మిగతా వారికి జూలై నుండి ఇస్తామని' ఆ సంస్థ యాజమాన్య ప్రకటించారు. అలాగే ప్రాజెక్టు లేక బెంచ్ మీద ఉన్న ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోబోమని కాప్ జెమినీ ఇండియా సిఈవో అశ్విన్ యార్డీ ప్రకటించారు. మరో అడుగు ముందుకేసి లాక్ డౌన్ సమయంలో వర్క్ ఫ్రమ్ హామ్ చేస్తున్న వారికి షిఫ్ట్ అలవెన్సులు కూడా ఇస్తామని ప్రకటించడం ఆ సంస్థ యొక్క ఔదార్యాన్ని చూపుతోంది.

కాప్ జెమినీ ఇండియా విభాగం ఉద్యోగుల భద్రత కోసం రెండు వందల కోట్ల నిధిని ఏర్పాటు చేసి ఎటువంటి కష్టకాలంలోనైనా ఉద్యోగలుకు తోడుగా నిలుస్తామని ప్రకటించి ప్రపంచానికొక ఆదర్శ మార్గాన్ని చూపుతోంది.

ఇటువంటి కష్టకాలాల్లో ప్రభుత్వం మరింత చొరవ చూపి, కంపెనీ ప్రతినిధులతో చర్చించి వారి భవిష్యత్ పట్ల ప్రజలకు ఒక భరోసా నింపేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర పరిధిలో ఉంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం పరిధిలో ఉంటే కేంద్ర ప్రభుత్వం ఒకడుగు ముందుకేసి తదనుగున చర్యలకు ఉపక్రమించడం సమాజ శ్రేయస్కరం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp