కరోనా లాక్ డౌన్ - బ్యాచిలర్స్ కష్టాలు

By iDream Post Mar. 25, 2020, 08:08 pm IST
కరోనా లాక్ డౌన్ - బ్యాచిలర్స్ కష్టాలు

మాయదారి కరోనా ఇక్కడినుండి వచ్చిందో తెలీదు కానీ దేశం మొత్తం లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం.. ఎక్కడికీ కదిలే వీలులేదు.. కొంచెం స్థిమితంగా ఉన్న కుటుంబాలకు ఈ లాక్ డౌన్ వల్ల వచ్చే నష్టమేం లేదు. కానీ పనికి పోతేకాని పూట గడవని పేద ప్రజలకు మాత్రం ఈ లాక్ డౌన్ వల్ల కడుపు నిండటం కష్టమే.

ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకి కొంత మొత్తం డబ్బు, రేషన్ ఇస్తామని చెప్పినా వాటితో సరిపుచ్చుకోవడం కష్టమే... ఇదంతా పక్కన పెడితే చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తూ హాస్టల్స్ లో ఉంటున్న కొందరు బ్యాచిలర్స్ పరిస్థితి మాత్రం అద్వాన్నంగా మారిపోయింది. ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రభుత్వం హాస్టల్స్ ని ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో హాస్టల్స్ లో ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. కానీ నగరాల నుండి స్వస్థలానికి చేరుకునే అవకాశం లేకపోవడంతో కొందరి పరిస్థితి ముందు నుయ్యి,వెనుక గొయ్యిలా మారిపోయింది. హాస్టళ్లలో ఉండనివ్వరు, బయట తిరగనివ్వరు,హోటల్స్ మూసివేయడంతో ఆహారం దొరికే అవకాశం లేదు. దానికితోడు రాష్ట్ర సరిహద్దులు మూసివేయడం,రవాణా సౌకర్యాలు పూర్తిగా స్తంభిపచేయడంతో కొందరు యువతీయువకులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
దీంతోపాటు కొందరు స్వస్థలాలకు చేరుకోవడానికి ప్రయత్నం చేసినా రవాణా సౌకర్యాలు దొరకని పరిస్థితి. అందుకే హైదరాబాద్ లో చిక్కుకున్న యువతీయువకులు హైదరాబాద్ లో ఉన్న పోలీస్ స్టేషన్లకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. తమను హాస్టళ్లలో ఉండనివ్వడం లేదని దయచేసి స్వస్థలం పంపించే ఏర్పాట్లు చేయాలని పోలీసులను విజ్ఞప్తి చేసారు.హాస్టల్‌ విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లాలనుకునే హాస్టల్‌ విద్యార్థులకు హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్ ఆదేశాల మేరకు అనుమతి పత్రాలు అందజేస్తున్నామని పంజాగుట్ట ఏసీపీ తిరుపతి తెలిపారు. దీనికోసం పంజాగుట్టతో పాటు ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్లలో విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. ఇప్పటికే 200 మందికి పైగా విద్యార్థులకు అనుమతి ఇచ్చామని.. ఆ తర్వాత మరో 700పైగా దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ ఆదేశాల మేరకు పంజాగుట్ట, ఎస్సార్‌ నగర్‌ పరిధిలోని 3వేల మందికి అనుమతి పాసులు మంజూరు చేస్తామని పోలీసులు తెలిపారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp