స్థానిక స‌మ‌రం ఇక వ‌చ్చే ఏడాదే..!

By Kalyan.S Aug. 07, 2020, 06:26 am IST
స్థానిక స‌మ‌రం ఇక వ‌చ్చే ఏడాదే..!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనని తెలుస్తోంది. ఇటీవలే పాత ఆర్డినెన్స్‌కు కాలం చెల్లడంతో ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్‌‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జగన్ సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. ఏపీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగిస్తున్నట్లు ఉత్వర్వులు జారీ చేసింది. 108 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీల్లో ప్రత్యేకాధికారుల పాలనను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రత్యేకాధికారుల పాలన డిసెంబర్‌ 31 లేదా పాలకవర్గం ఏర్పాటయ్యే వరకూ పొడిగించడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేక అధికారుల పాలన అక్టోబర్‌ 10 వరకూ పొడిగించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల్లోనూ 2021 జనవరి 2 తేదీ వరకూ ప్రత్యేకాధికారుల పాలన పొడిగిస్తున్నట్టు నోటిఫికేషన్‌లో పురపాలక శాఖ స్పష్టం చేసింది.

కోవిడ్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేయటంతో ఈ నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు పురపాలక శాఖ స్పష్టం చేసింది. మొత్తానికి చూస్తే మొన్న ఆర్డినెన్స్, ఇప్పుడు పొడిగింపుకు సంబంధించిన ఉత్వర్వులను బట్టి చూస్తే ఇప్పట్లో ఎన్నికలుండవని ప్రభుత్వం సంకేతాలిచ్చిందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు!. స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణల పేరిట ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఆర్డినెన్స్‌ నంబరు 2 జారీ చేసింది. మొత్తం ఎన్నికల ప్రక్రియను 15 రోజులకు కుదించడంతోపాటు.. ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీ వంటి అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే ఐదేళ్లలో సదరు అభ్యర్థి ఎన్నికను రద్దు చేయవచ్చునంటూ కొత్త నిబంధనను తీసుకొచ్చింది.

ఈసీ నిర్ణ‌యంపైనే ఆధారం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మ‌ళ్లీ బాధ్యతలు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. గ‌త సోమవారం ఉదయం 11.15 గంటలకు బాధ్యతలు తీసుకున్నారు. ఆ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ అన్నారు. రాగద్వేషాలకు అతీతంగా ఎస్‌‌ఈసీ పనిచేస్తుందని చెప్పారు. గతంలో మాదిరిగానే ప్రభుత్వం నుంచి తోడ్పాటు లభిస్తుందని భావిస్తున్నాను అన్నారు. ప్రత్యేక అధికారుల పాలన పొడిగిస్తూ ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్వర్వుల ప్ర‌కారం.. వ‌చ్చే ఏడాది వ‌ర‌కూ స్థానిక ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలు లేన‌ట్లే క‌నిపిస్తోంది. అయితే దానిపై నిర్ణ‌యం తీసుకోవాల్సింది ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌. దీంతో నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ ఏం నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp