గుజరాత్ లో స్థానిక ఎన్నికలు 3నెలలు వాయిదా

By Raju VS Oct. 27, 2020, 11:20 am IST
గుజరాత్ లో స్థానిక ఎన్నికలు 3నెలలు వాయిదా

బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముడిపెట్టి ఏపీలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆతృతపడుతున్నారు. కానీ అదే సమయంలో గుజరాత్ లో స్థానిక ఎన్నికలు వాయిదా పడిన విషయాన్ని ఆయన ఎందుకు విస్మరిస్తున్నారన్నదే రాజకీయ వర్గాల్లో ఆసక్తికర అంశం.

తన పదవీకాలం ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన ఆశ పడుతున్నట్టు కనిపిస్తోంది. అదేమీ నేరం కాకపోయినా అదే సమయంలో ప్రజల ప్రాణాలకు భరోసా ఉండాలి కదా అన్నది పలువురి అభిప్రాయం. సాటి రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు వాయిదా వేస్తున్న తీరు చూసిన తర్వాతనైనా ఆయన వైఖరి మార్చుకోవాలన్నది అత్యధికుల వాదన. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు, ఏపీలో స్థానిక ఎన్నికలకు పొంతనే లేదు. సహజంగా గడువు ముగిసిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించని పక్షంలో రాష్ట్రపతి పాలన అవసరం అవుతుంది. అది మళ్లీ వివాదానికి దారితీస్తుంది.

స్థానిక ఎన్నికలు అలా కాదు. అలా అనుకుంటే 2018 నుంచీ స్థానిక ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇదే నిమ్మగడ్డ ఎస్ఈసీగా ఉన్న సమయంలో సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా నాటి ప్రభుత్వం వాయిదా వేసినప్పటికీ ఉలుకూ పలుకూ లేదు. ఎన్నికల నిర్వహణ విషయంలో తాము సిద్ధంగా ఉన్నమని చెప్పినా మార్చిలో ఏకపక్ష నిర్ణయంతో వాయిదా వేసి ఇప్పుడు అత్యధిక కేసులున్న సమయంలో ఎన్నికలకు ఆదుర్థా చూపడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

నిమ్మగడ్డ తీరు మీద ఇప్పటికే అనేక వివాదాలు చెలరేగాయి. తాజాగా రాజకీయ పక్షాలతో సమావేశాలకు సన్నద్ధం కావడం ద్వారా ఆయన ప్రభుత్వంతో ప్రచ్ఛన్న యుద్ధానికి దిగుతున్నట్టుగా స్పష్టమవుతోంది. సమస్యను పరిష్కరించుకునే దిశలో సామరస్య వాతావరణం సృష్టించే బదులుగా సమస్యను పెద్దది చేయాలనే సంకల్పంతో ఆయన ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. కానీ గుజరాత్ లాంటి రాష్ట్రాల అనుభవాల రీత్యా స్థానిక ఎన్నికలకు ఇది తగు సమయం కాదని అర్థమవుతోంది. ఇప్పటికే ప్రధాని సొంత రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను 2021 నాటికి వాయిదా వేశారు. అనివార్యంగా ఆంధ్రప్రదేశ్ కూడా అదే బాట తప్పదని చెప్పవచ్చు. మరి ఎస్ఈసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp