ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్

By Harinath.P May. 07, 2021, 04:28 pm IST
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏపీ హైకోర్టు అనుమతినిచ్చింది. ఎస్ఈసి ఇచ్చిన నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ నిర్వహించుకోవచ్చని వెల్లడించింది. తాజా తీర్పుతో నెల రోజుల కిందట ముగిసిన ఎన్నికల ఫలితాలు వెల్లడించేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం కోవిడ్ విజృంభిస్తోన్న నేపథ్యంలో కౌంటింగ్ ఎప్పుడు నిర్వహించాలి అన్న దానిపై ప్రభుత్వం సమాలోచన చేసి, నిర్ణయం తీసుకోనుంది.

ఏప్రిల్ 1న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. 8న పోలింగ్, 10న ఫలితాలు వెల్లడించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఏప్రిల్ 6న హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ఇచ్చింది. హైకోర్టులో విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 4 వారాల ఎన్నికల కోడ్ విధించలేదని పిటిషనర్లు వివరించారు. 7 రోజుల్లో ఎలా ఎన్నికలు నిర్వహిస్తారని ప్రశ్నించారు.
పై వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధించింది. ఆ తర్వాత సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఎస్ఈసీ డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయడంతో జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఫలితాలను మాత్రం వెల్లడించొద్దని సూచించింది.

ఏప్రిల్ 8న పోలింగ్ జరగ్గా.. ఫలితాలు వాయిదా పడ్డాయి. ఎన్నికల కౌంటింగ్‌పై హైకోర్టులో గత నెల ఏప్రిల్ 15న విచారణ జరగ్గా.. ఎస్ఈసీ మూడు పిటిషన్లలో రెండింటింకి మాత్రమే కౌంటర్ దాఖలు చేసింది.. మూడో పిటిషన్ కౌంటర్ దాఖలుకు సమయం కోరింది. దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 19కు వాయిదా వేసింది. మళ్లీ కోర్టులో ఆ పిటిషన్‌పై విచారణ జరిగింది వాయిదా పడుతూ వస్తోంది.. మళ్లీ మే 6న (మంగళవారం)విచారణ జరగ్గా.. తీర్పును రిజర్వ్ చేసి, ఇవాళ వెల్లడించింది.

రాష్ట్రంలో 13 జిల్లాల్లో 660 జడ్పీటీసీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 126 ఏకగ్రీవమయ్యాయి. వివిధ కారణాలతో 8 స్థానాలకు ఎన్నికలు జరగలేదు. గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు పోటీలో ఉన్న 11మంది అభ్యర్థులు మరణించారు. మిగిలిన 515 జడ్పీటీసీ స్థానాలకు 2,058 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 10,047 ఎంపీటీసీలకు గాను 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 375 స్థానాలకు వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించ లేదు. 81 మంది అభ్యర్థులు మరణించడంతో మిగిలిన 7,220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 18,782 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 652 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీలకు ఎన్నిక జరిగింది. అయితే ఈ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ బహిష్కరించిన విషయం తెలిసిందే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp