గ్రేటర్ మేయర్ పీఠం కోసం...వారసుల పోటీ!

ఉభయ తెలుగు రాష్ట్రాలకు కీలక మైన హైదరాబాద్ మేయర్ పీఠం కోసం సీనియర్ రాజకీయ నాయకులు, వారసుల కన్ను పడింది. వీరిలో చాలా మంది కార్పొరేటర్ సీట్లను ఆశించినా కొందరికే అవకాశం దక్కింది. మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, సబితారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ కుటుంబ సభ్యులు టికెట్లు ఆశించినట్లు ప్రచారం జరిగినా అభ్యర్థుల జాబితాలో చోటు దక్కలేదు. కానీ ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ల కుటుంబాలకు చెందిన సుమారు అరడజను మందికి కార్పొరేటర్లుగా టికెట్ దక్కడంతో వారు మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుత మేయర్ రామ్మోహన్ భార్య శ్రీదేవితో పాటు ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్యేలు బేతి సుభాష్‌రెడ్డి, సాయన్న, దివంగత నేతలు పి.జనార్ధన్‌రెడ్డి, చింతల కనకారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరుల కుటుంబ సభ్యులు కార్పొరేటర్ అభ్యర్థులుగా టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగారు.
సామాజిక సమీకరణాలు.. విధేయత
గ్రేటర్ పీఠం జనరల్ మహిళకు కేటాయించిన నేపథ్యంలో ఓసీ సామాజికవర్గానికి చెందిన పలువురు అభ్యర్థులు మేయర్ పదవిని ఆశిస్తున్నారు. టికెట్ల కేటాయింపులో రెడ్డి సామాజికవర్గానికి ఏకంగా 31 డివిజన్లు కేటాయించగా, ఇందులో సగానికి పైగా మహిళలు ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ సామాజికవర్గానికి అవకాశం వస్తుందని పార్టీలో అంతర్గతంగా లెక్కలు వేస్తున్నారు. అయితే రాజకీయ వారసులు కాకుండా పార్టీ నాయకత్వం పట్ల విధేయులుగా ఉండే వారికే మేయర్ పీఠం దక్కే సూచనలు ఉన్నాయని కొందరు నేతలు అంటున్నారు.
టీఆర్ఎస్లో ‘మేయర్’ ఔత్సాహికులు
బంజారాహిల్స్ డివిజన్ నుంచి వరుసగా రెండోసారి పోటీ చేస్తున్న ఎంపీ కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, ఖైరతాబాద్ డివిజన్ నుంచి బరిలో ఉన్న దివంగత పి.జనార్ధన్‌రెడ్డి కుమార్తె విజయారెడ్డి ఔత్సాహికుల జాబితాలో ఉన్నట్టు చెబుతున్నారు. ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి (చర్లపల్లి), ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి భార్య బేతి స్వప్నారెడ్డి (హబ్సిగూడ), కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత (కవాడిగూడ) కూడా మేయర్ రేసులో ఉన్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు సుసరితారెడ్డి (మూసారాంబాగ్), మరో మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి (అల్వాల్) ఔత్సాహికుల జాబితాలో ఉన్నారు. రెండు పర్యాయాలు ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రామ్మోహన్‌గౌడ్ భార్య ముద్దగోని లక్ష్మీప్రసన్నగౌడ్ (బీఎన్‌రెడ్డి), టీఆర్ఎస్ కార్మిక విభాగం నేత మోతె శోభన్‌రెడ్డి భార్య శ్రీలత (తార్నాక) కూడా మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నట్లు తెలిసింది.
రాజకీయ వారసత్వాన్ని పక్కన పెట్టే పక్షంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సన్నిహితుడు దుర్గాప్రసాద్‌రెడ్డి భార్య పద్మావతిరెడ్డి, ప్రస్తుత హఫీజ్‌పేట్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్‌గౌడ్, సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ పేర్లు కూడా తెరమీదకు వచ్చే అవకాశముందని అంటున్నారు.


Click Here and join us to get our latest updates through WhatsApp