వామపక్షం.. చెరో పక్షం

By Ramana.Damara Singh Apr. 20, 2021, 09:45 am IST
వామపక్షం.. చెరో పక్షం

తెలంగాణ రాజకీయాల్లో వింత పొత్తులు, విచిత్ర విన్యాసాలు చోటుచేసుకుంటున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనను పోటీ చేయనివ్వకుండా చేసి దాని గ్లాసు గుర్తుకు ఎసరుపెట్టిన బీజేపీతోనే కలిసి ఖమ్మం నగరపాలక ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించడం ఒక విడ్డూరమైతే.. నిన్నటికి నిన్న జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆరెస్ కు మద్దతు ఇచ్చిన రెండు వామపక్షాలు ఖమ్మం ఎన్నికల్లో మాత్రం తలో దారి పట్టాయి. ఊహించని విధంగా సంభవించిన ఈ పరిణామాలతో ఖమ్మంలో గుమ్మంలో రసవత్తర పోరుకు తెరలేచింది.

అక్కడ అలా.. ఇక్కడ ఇలా..

ఈ నెల 17న జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో వామపక్షాలైన సీపీఐ, సీపీఎం లు కాంగ్రెస్ ను కాదని అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు పలికాయి. సీపీఎం మాజీ నేత, దివంగత నోముల నర్సింహయ్య తనయుడు భగత్ ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలవడమే దానికి కారణం. ఆ విషయం పక్కన పెడితే.. ఆ ఎన్నిక పూర్తి కాకముందే తెలంగాణలో పెండింగులో ఉన్న మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఇందులో ఖమ్మం నగర పాలక సంస్థ కూడా ఉంది. ఇక్కడ మొదటి నుంచి వామపక్షాలకు మంచి పట్టు ఉండేది. నగరపాలక సంస్థగా మారక ముందు ఖమ్మం మున్సిపాలిటీ చైర్మన్ గా సీపీఎం నేత చిర్రావూరి లక్ష్మీనర్సయ్య సుదీర్ఘ కాలం చైర్మన్ గా కొనసాగారు. ఇటీవలి కాలంలో కొంత పట్టు కోల్పోయినా సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. కానీ ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేయకపోగా చెరో పార్టీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడం విస్మయం కలిగిస్తోంది.

ఈ మార్పు ఎందుకంటే..

ఖమ్మంలో పువ్వాడ కుటుంబానికి మంచి పట్టుంది. ఆ కుటుంబం ఎటు ఉంటే సీపీఐ అటే మొగ్గు చూపుతుందనేది ఖమ్మం వాసులకు అనుభవపూర్వకంగా తెలుసు. పువ్వాడ అజయ్ గత కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో ఉండటంతో ఆ ఎన్నికల్లో సీపీఐ కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసింది. ప్రస్తుతం పువ్వాడ టీఆరెస్ లో ఉన్నారు. దాంతో సహజంగానే సీపీఐ ఆ పార్టీతో జత కట్టడానికే మొగ్గు చూపింది. సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా టీఆరెస్ తో పొత్తుకే మొగ్గుచూపారు. అయితే సాగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి మద్దతు తెలపడంపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, టీడీపీలతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకుంది.

గత ఎన్నికల్లో ఇలా..

ఖమ్మం నగర పాలకసంస్థ హోదా పొందిన తర్వాత జరుగుతున్న రెండో ఎన్నికలివి. ప్రస్తుతం 60 డివిజన్లు ఉండగా టీఆరెస్ తో పొత్తు పెట్టుకున్న సీపీఐ 5 డివిజన్లలో పోటీ చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్, టీడీపీలతో జతకట్టిన సీపీఎం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్నది ఇంకా ఖరారు కాలేదు. కాగా గత ఎన్నికల్లో ఆరు చోట్ల పోటీ చేసిన సీపీఐ రెండు డివిజన్లలో విజయం సాధించగా, 26 డివిజన్లలో ఒంటరిగా పోటీ చేసిన సీపీఎం రెండు చోట్లే గెలుపొందింది. అయితే నగరంలో సీపీఐ కంటే బలంగా ఉన్న సీపీఎం 10కి పైగా డివిజన్లలో ప్రభావం చూపగలదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp