గ్రేటర్ వార్ లో ప్రచారాస్త్రంగా మారిన ద్వేషభాష

By Rishi K Nov. 26, 2020, 01:30 pm IST
గ్రేటర్ వార్ లో ప్రచారాస్త్రంగా మారిన ద్వేషభాష

గ్రేటర్ వార్ లో మాటల యుద్ధం కొనసాగుతోంది. కూల్చివేతలు, పేల్చివేతల భాష ప్రచారాస్త్రంగా మారింది. ఒకరు సర్జికల్ స్ట్రైక్ అంటే... ఇంకొకరు సమాధుల కూల్చివేతంటున్నారు. బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా గ్రేటర్ ప్రచారం హీటెక్కింది. పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేసి, రోహింగ్యాలను, పాకిస్తానీలను తరిమి కొడతామంటూ సంజయ్ నిప్పురాజేశాడు. అంతే... ఇప్పుడా నిప్పు దావానలమైనట్లు కనిపిస్తోంది. ఈ మంటల్ని ఆరిపోకుండా చూసేందుకు అన్ని పార్టీలూ తమవంతు కృషి చేస్తున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో మాటల తూటాలు పేల్చుతున్నాయి.

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మునుపెన్నడూ లేనంత ద్వేష భాష వ్యక్తమవుతోంది. అది అచ్చంగా యుద్ధవాతావరణాన్నే తలపిస్తోంది. అక్రమ కట్టడాలు, పేదల ఇళ్లు కూల్చేస్తామంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం హుస్సేన్ సాగర్ వెంట ఉన్న పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూల్చేయాలంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అగ్నికి ఆజ్యపోశారు. ఒకప్పుడు 4700 ఎకరాలున్న హుస్సేన్ సాగర్ ఇప్పుడు 700 ఎకరాలకు కుంచించుకుపోయిందని, అసెంబ్లీలో టీఆర్ఎస్ తోక ఎలా తొక్కాలో మాకు తెలుసంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బీజేపీ చీఫ్ హిందువులకు గర్వకారణమైన పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చిన రెండు గంటల్లో దారుసలాంను కూల్చివేస్తామని హెచ్చరించారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌లో ఇండియా గెలుపును జీర్ణించుకోలేక నిరసన ప్రదర్శన చేసేవాళ్లు పాతబస్తీలో ఉన్నారని, అలాంటివాళ్లపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్న బీజేపీ, గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోకపోయినా వీలైనన్ని ఎక్కువ సీట్లను కైవసం చేసుకోవాలనుకుంటోంది. అందుకోసం మతాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకుంది. బీహార్‌లో కేవలం 12శాతం ఉన్న ముస్లింలు ఎంఐఎంను 5 స్థానాల్లో గెలిపించారని, హైదరాబాద్‌లో ఉన్న హిందువులంతా ఓటు బ్యాంకుగా మారితే బీజేపీ గెలుపు ఖాయమంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. ఓటర్లను మతాలుగా, కులాలుగా చూడడం రాజకీయ పార్టీలకు మొదటి నుంచీ ఉన్న అలవాటు. గ్రేటర్ ఎన్నికల్లోనూ ఆ సమీకరణలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ ఎన్నికలకు ముందే అన్ని సామాజికవర్గాల ప్రజలను సంతృప్తి పరిచే ప్రయత్నాలను ప్రారంభించింది. గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీ పదవులను వేరు వేరు సామాజికవర్గాల వారికి ఇచ్చి వారి పట్ల ప్రేమను ప్రదర్శించింది. ఇక బీజేపీ మెజార్టీ హిందూ ఓటు బ్యాంకు తమదే అని భావిస్తోంది. హిందూ సమాజానికి తామే ఏకైక ప్రతినిధిగా భావిస్తోంది కూడా. కానీ అది ఒక్కటే ఓట్లను రాబట్టలేదు కనుక, హిందూ మతానికి ప్రమాదముందని చూపే ప్రయత్నం చేస్తోంది. అక్బరుద్దీన్ వ్యాఖ్యలను బండి సంజయ్ ప్రొజెక్ట్ చేసిన విధానమే అందుకు నిదర్శనం. కాషాయం కట్టిన ఎన్టీఆర్, అయోద్య విషయంలో నిలబడిన పీవీ నరసింహారావు సమాధులను కూల్చేయాలనడం వెనక హిందూ వ్యతిరేకత ఉందంటూ బండి సంజయ్ మాట్లాడడం మతాల మధ్య దూరాన్ని పెంచే ప్రయత్నమని విశ్లేషకులంటున్నారు.

గ్రేటర్ బరిలో గట్టి పోటీ ఇవ్వడం ద్వారా తెలంగాణలో తమ బలాన్ని పెంచుకోవాలనుకుంటున్న బీజేపీ అధికార టీఆర్ఎస్ ఎదుర్కోవడానికి ఎంఐఎంని టార్గెట్ చేస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది. టీఆర్ఎస్ తో ఎంఐఎం చెలిమిని సాకుగా చూపి హిందువుల ఓట్లను క్యాష్ చేసుకోవాలనుకుంటున్న బీజేపీ దొరికిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాలనుకుంటోంది. టీఆర్ఎస్ ఉగ్రవాదుల శవయాత్ర చేసే పార్టీతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోందంటూ ఘాటు విమర్శలు చేశారు. ప్రగతి భవన్ స్క్రిప్టునే ఎంఐఎం దారుసలాంలో చదువుతోందని, అందుకే దారుసలాంలో సౌండ్ చేస్తే ప్రగతి భవన్‌లో రీసౌండ్ వస్తోందని విమర్శించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై సైతం తీవ్రంగా స్పందించిన బండి సంజయ్ ఎన్నడూ లేనిది పీవీ, ఎన్టీఆర్ ఘాట్ లను సందర్శించి వారికి నివాళులర్పించారు. అటు ఎంఐఎం కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతోంది. కావాలనే తనను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. పెద్దపెద్ద తోపులు మమ్మల్ని ఏమీ చేయలేక వెళ్లిపోయారని, మూసీనది దాటి మీరు రాలేరంటూ బీజేపీకి సవాల్ విసిరారు. చాయ్ వాలా పార్టీ పునాదులు ఈ రాష్ట్రంలో లేవని స్పష్టం చేశారు.

స్థానిక బీజేపీ నేతలతో పాటు ప్రచారం పాల్గొంటున్న అగ్రనేతలు సైతం ఇదే స్టైల్ ఫాలో అవుతున్నారు. పదునైన మాటలతో పంచ్ డైలాగ్ లతో ప్రజల మనసు దోచుకోవాలనుకుంటున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో గ్రేటర్ వార్ దేశ సరిహద్దుల్ని తలపిస్తోంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్లు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది. మాటల యుద్ధం కాస్తా చేతల్లోకి మారితే పరిస్థితి ఏంటా అన్న ఆందోళన మొదలైంది అందరిలో.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp