జైలుకు వెళ్లిన మేయర్ గురించి తెలుసా...?

By Voleti Divakar Nov. 22, 2020, 12:56 pm IST
జైలుకు వెళ్లిన మేయర్ గురించి తెలుసా...?

నగరానికి మేయర్‌ మొదటి పౌరుడిగా ప్రొటోకాల్‌ పాటించడం ఆనవాయితీ. అలాంటి గౌరవ హోదాలో ఉండే మేయర్‌నూ ఒక సందర్భంలో పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ చరిత్రలో అరెస్టు అయిన తొలి మేయర్‌గా చరిత్రకెక్కారు ఎన్‌. లక్ష్మీనారాయణ ముదిరాజ్‌. 1969 తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన అమరవీరుల స్మారకంగా గన్‌పార్కు వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపం నెలకొల్పాలని ఆనాటి ఉద్యమకారులు నిర్ణయించారు. 1970, ఫిబ్రవరి 23న గన్‌పార్కులో స్తూపం శంకుస్థాపన తలపెట్టారు. కార్యక్రమానికి స్థానిక పోలీసుల అనుమతి ఉన్నా, అప్పటి ప్రభుత్వం వ్యతిరేకించింది. శంకుస్థాపన ఆపేయాలని హుకుం జారీచేసింది. దీంతో గన్‌పార్కు చుట్టూ వందల మంది పోలీసులు మోహరించారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్‌ చేసిమరీ అమరవీరుల స్తూపానికి పునాదిరాయి వేశారు లక్ష్మీనారాయణముదిరాజ్‌. ఆయనతోపాటు కార్యక్రమంలో పాల్గొన్న వారినీ పోలీసులు అరెస్టు చేసి ఠాణాకి తరలించారు. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా నగరమంతా నిరసనలు మిన్నంటాయి. తర్వాత లక్ష్మీనారాయణ ముదిరాజ్‌ కాంగ్రె్‌స్ కు రాజీనామా చేసి, తెలంగాణ ప్రజా సమితి పార్టీలో చేరారు. 1972లో మహారాణిగంజ్‌ (ఇప్పటి గోషామహల్‌)నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. బీసీ కమిషన్‌ సభ్యుడిగానూ సేవలందించారు. అనారోగ్యంతో 2015లో కన్నుమూశారు.

డిప్యూటీ మేయర్‌నూ

ప్రత్యేక తెలంగాణ పోరాటంలో పోలీసుల కాల్పులకు బలైన విద్యార్థుల స్మారకంగా సికింద్రాబాద్‌ క్లాక్‌టవర్‌ ప్రాంతంలోనూ మరో స్తూపం నిర్మించతలపెట్టారు. ఫిబ్రవరి 25న డిప్యూటీ మేయర్‌ మ్యేడం రామచంద్రరావు చేతులమీదుగా శంకుస్థాపన జరిగింది. అప్పుడూ డిప్యూటీ మేయర్‌నూ అరెస్టు చేసి, జైలుకు తరలించారు. ప్రజా నిరసన వెల్లువెత్తడంతో మూడు రోజుల తర్వాత వారందరినీ విడుదల చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp