లిటిల్ మాస్టర్ సచిన్‌ను వరించిన లారస్‌ స్పోర్టింగ్‌ మూమెంట్ అవార్డు

By Srinivas Racharla Feb. 18, 2020, 07:54 pm IST
లిటిల్ మాస్టర్ సచిన్‌ను వరించిన లారస్‌ స్పోర్టింగ్‌ మూమెంట్ అవార్డు

భార‌త లెజెండ్ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌ ప్ర‌తిష్టాత్మ‌క లారెస్ స్పోర్టింగ్ మూమెంట్ 2000-2020 అవార్డు ద‌క్కించుకున్నాడు.గ‌త రెండు ద‌శాబ్ధాల్లో అత్యుత్త‌మ‌మైన స్పోర్ట్స్ మూమెంట్‌కు ఈ అవార్డ‌ును అందించ‌డం కోసం పోటీ నిర్వహించగా 19 మందితో పోటీప‌డిన టెండూల్క‌ర్‌ అగ్ర‌స్థానంలో నిలిచి అవార్డును ద‌క్కించుకున్నాడు.2011 వ‌న్డే వ‌రల్డ్‌క‌ప్ విజ‌యం త‌ర్వాత స‌చిన్‌ను భార‌త ఆట‌గాళ్లు త‌మ భుజాల‌పై ఊరేగించారు. ఈ విజయ క్షణాలను "క్యారీడ్ ఆన్ ద షోల్డ‌ర్స్ ఆఫ్ నేష‌న్" అనే క్యాప్ష‌న్‌తో ఓటింగ్ నిర్వ‌హించారు.

అవార్డుల ప్రదానోత్సవంలో అత్యధిక ఓట్లు రావడంతో టెన్నిస్ మాజీ ఆటగాడు బోరిస్ బ్రేకర్ లారెన్స్ అవార్డు విజేతగా సచిన్‌ను ప్రకటించాడు.ఈ అవార్డును ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌వా చేతుల మీదుగా లిటిల్‌ మాస్టర్‌ సచిన్‌కు అందజేశారు.బెర్లిన్‌లో అవార్డు అందుకున్నాక సచిన్ మాట్లాడుతూ "అవి చాలా అద్భుత క్ష‌ణాలు.ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యాన్ని మాటల్లో వర్ణించలేనిది.అత్యంత అరుదుగా దేశంలోని అందరూ ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఉత్సవాలు చేసుకున్న సంద‌ర్భ‌మ‌ది.మ‌న జీవితంలో క్రీడలు ఎంత ముఖ్య‌మో,వాటి ప్రభావం ఎలా ఉంటుందో ఈ సంఘటన ద్వారా చెప్ప‌వ‌చ్చు, ఇప్పటికీ ఆ తీపిజ్ఞాపకం నాతోనే ఉంది" అని వ్యాఖ్యానించారు.

తన చిరకాల స్వప్నం నెరవేరిన సందర్భంలో పొందిన అనుభూతి గురించి సచిన్‌ను అడిగినప్పుడు,"నాకు ప‌దేళ్ల వ‌య‌సున్న‌ప్పుడు భార‌త్ మొదటిసారిగా ప్రపంచ కప్ (1983) సాధించింది. అప్పుడు నాకు ఆ విజయం గురించి స‌రైన అవ‌గాహ‌న లేకున్నా అంద‌రితోపాటే సంబరాలు చేసుకున్నా.కొంతకాలానికి ప్రపంచ కప్ విజ‌యం ఘనత గురించి తెలిసింది. మ‌రోసారి వ‌రల్డ్‌క‌ప్ సాధించాల‌నే కోరిక‌తో క్రికెట్ ఆడ‌టం మొద‌లుపెట్టా.క్రికెట్ ఆడ‌టం మొద‌లుపెట్టాక 22 ఏళ్ల త‌ర్వాత నా క‌ల ఫలించింది. వ‌ర‌ల్డ్‌క‌ప్ అందుకున్న క్ష‌ణాల‌ను వ‌ర్ణించ‌లేను’"అని వ్యాఖ్యానించాడు.జాతి మొత్తాన్ని ఏక తాటి పైకి తెచ్చే శక్తి క్రీడలకు ఉందనే ద‌క్షిణాఫ్రికా నల్ల సూర్యుడు నెల్స‌న్ మండేలా మాటల ప్ర‌భావం త‌న‌పై ఉంద‌ని చెప్పుకొచ్చాడు.

ఆనాటి విజయోత్సవ జ్ఞాపకాలు:
వాస్తవానికి 1983లో తొలిసారి వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలుపొందాక మ‌ళ్లీ విశ్వవిజేతగా నిలవడానికి భార‌త్ 28 సంవ‌త్స‌రాలపాటు సుదీర్ఘంగా నిరీక్షించింది. చివరకు 2011లో సొంత‌గ‌డ్డ‌పై ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ధోనీ శ్రీలంక పేసర్‌ కులశేఖర బౌలింగ్‌లో భారీ సిక్స్‌ బాది జట్టును రెండోసారి విశ్వవిజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. అప్పుడు భారత ఆటగాళ్లంతా భావోద్వేగంతో సచిన్‌ను తమ భుజాలపై ఎత్తుకొని మైదానం చుట్టూ తిరుగుతూ విజయోత్సవాలు చేసుకున్నారు.అనంతరం స‌చిన్ మాట్లాడుతూ,త‌న క‌ల నెరవేరింద‌ని,దేనికోస‌మైతే నేను క్రికెట్ ఆడ‌టం ప్రారంభించానో,దాన్ని సాధించాన‌ని,ప్రపంచకప్‌ను ముద్దాడటం సగౌరవంగా ఉందని చెప్పిన సంగతి తెలిసిందే.

అంతర్జాతీయంగా 24 ఏళ్ల పాటు కొనసాగిన కెరీర్‌లో 200 టెస్టులు, 464 వ‌న్డేలు,ఒక టీ20 మ్యాచ్‌లు ఆడిన స‌చిన్ మూడు ఫార్మాట్ల‌లో క‌లిపి 34వేల‌కుపైగా ప‌రుగులు సాధించాడు.ప్రపంచ క్రికెట్‌లో వంద సెంచ‌రీలు సాధించిన ఏకైక క్రికెట‌ర్‌గా చరిత్ర సృష్టించడంతో పాటు అనేక రికార్డులు తన పేరిట లిఖించుకున్న ఘనత లిటిల్‌ మాస్టర్‌దే కావటం భారతీయులకు గర్వకారణం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp