కర్నూలు కార్పొరేషన్ - అన్నిపార్టీలు క్లారిటీ వచ్చేసింది

By Suresh Mar. 04, 2021, 01:15 pm IST
కర్నూలు కార్పొరేషన్ - అన్నిపార్టీలు క్లారిటీ వచ్చేసింది

కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండడంతో ప్రతిపక్ష టీడీపీలో గుబులు మొదలైంది. కర్నూలు మేయర్ పీఠాన్ని తమ ఖాతాలో వేసుకొని టీడీపీని కోలుకోలేని దెబ్బతియ్యాలని అధికార వైసీపీ ఉవ్విళ్లూరుతోంది. అధికార పార్టీలో నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తూ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే హఫీజ్ మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి సయోధ్య కుదిర్చి ఎన్నికల్లో కలిసి పనిచేయాలని అధినాయకత్వం స్పష్టం చేయడంతో ఇద్దరు నేతలు ఐక్యంగా రంగంలోకి దిగారు.

కర్నూలు కార్పొరేషన్‌ పరిధిలోకి కర్నూలు, పాణ్యం, కోడుమూరు నియోజకవర్గాల్లోని 52 డివిజన్లు వస్తాయి. మేయర్ స్థానం బీసీ జనరల్ కి కేటాయించారు. అధికార వైసీపీ తమ మేయర్ గా సీనియర్ నేత బీవై రామయ్య ని ఎంపిక చేసింది. ఈయన కార్పొరేషన్ లో పెద్ద డివిజన్ అయిన 19 నుంచి బరిలో దిగుతున్నారు. అభ్యర్థిని ప్రకటించకుండానే ప్రతిపక్ష టీడీపీ ప్రచారానికి వెళుతోంది.

Also Read:బీ"వై రామయ్య"?

టీడీపీలో ఆధిపత్య పోరు
కర్నూలు పరిధిలోని 33 డివిజన్ల బాధ్యతలు టీజీ భరత్‌, కల్లూరు పరిధిలోని 16 వార్డులను గౌరు వెంకటరెడ్డి, కోడుమూరు పరిధిలోని 3 వార్డుల బాధ్యతలను విష్ణువర్ధన్ రెడ్డి నిర్వహిస్తున్నారు. మూడ్రోజుల క్రితం ఆ పార్టీ ఏర్పాటుచేసిన కర్నూలు నియోజకవర్గ టీడీపీ సర్వసభ్య సమావేశంలో కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి, కేఈ ప్రభాకర్‌, టీజీ భరత్‌, గౌరు చరిత పాల్గొన్నారు. మేయర్ పీఠంపై తమ వారినే కూర్చోపెట్టాలని నాయకులంతా ఆరాటపడుతుండడంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయకుండా మేయర్ స్థానం పై నాయకులు కన్నేయడంతో వీరంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

మరోవైపు మొత్తం 52 డివిజన్లలో 2 డివిజన్లు వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. 49 డివిజన్లలో టీడీపీ తమ అభ్యర్థులను బరిలో దింపగా 17వ డివిజన్ లో సీపీఐ అభ్యర్థికి మద్దతు నిస్తోంది. మరోవైపు కర్నూలు నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో 8 ఎస్వీ మోహన్ రెడ్డి వర్గానికి, మిగిలిన 25 డివిజన్లను ఎమ్మెల్యే హఫీజ్ వర్గానికి వైసీపీ అధినాయకత్వం కేటాయించింది.

Also Read:వాళ్ళు గెలిస్తే మున్సిపాలిటీ పన్నులు తగ్గిస్తారంట..!

చంద్రబాబు పర్యటనపై సర్వత్రా ఆసక్తి
టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వర్గ పోరు నెలకొనడంతో అధినేత చంద్రబాబు మదిలో గుబులు రేపుతోంది. జిల్లా అంతా టీడీపీ చేతులెత్తేసినా కార్పొరేషన్ కి వచ్చేసరికి ఆ పార్టీ నాయకులు పోటాపోటీగా తమ అభ్యర్థులను బరిలో నిలబెట్టారు. రెబెల్స్ బెడద ఎక్కువవడంతో ఎవరికి బీ పారం అందించాలి అన్న విషయంపై ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. మరోవైపు కర్నూలు లోక్ సభ టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్ల మాట ఎవరూ పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలో పరిస్థితులను చక్కబెటెందుకు టీడీపీ అధ్యక్షుడే రంగంలోకి దిగుతున్నారు. ఈ రోజు కార్పొరేషన్ పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు. ఆ తరువాత నాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తానికి కార్పొరేషన్ ఎన్నికలు ప్రతిపక్ష టీడీపీ లో గుబులు రేపుతున్నట్లుగా ఉన్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp