లాక్ డౌన్ పై క్లారిటీ ఇచ్చిన కేటీఆర్

By Kalyan.S Jul. 08, 2020, 10:58 pm IST
లాక్ డౌన్ పై క్లారిటీ ఇచ్చిన కేటీఆర్

జీహెచ్ఎంసీ ప‌రిధిలో మ‌ళ్లీ లాక్ డౌన్ ఉంటుంద‌ని కొద్ది రోజులు తెగ ప్ర‌చారం జ‌రిగింది. ఇంకా దానిపై సందిగ్ద‌త కొన‌సాగుతూనే ఉంది. సీఎం కేసీఆర్ కూడా లాక్ డౌన్ పై ఆలోచిస్తున్నామ‌ని గ‌తంలో ప్ర‌క‌టించిన‌ట్లు వార్త‌లు వెల్లువెత్తాయి. కేభినెట్ మీటింగ్లో నిర్ణ‌యం తీసుకుంటామ‌ని అన్నారు. అయితే.. మీటింగూ లేదు.. లాక్ డౌన్ పై ప్ర‌భుత్వం క్లారిటీ కూడా ఇప్ప‌టి వ‌ర‌కూ ఇవ్వ‌లేదు. కానీ.. జ‌నం మాత్రం సొంతూళ్ల‌కు త‌ర‌లిపోతున్నారు. క‌రోనా విజృంభిస్తూ ఉండ‌డ‌మే దీనికి కార‌ణం. గ‌త 24 గంట‌ల్లోనే.. 1924 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అలాగే.. కేవ‌లం జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1590 మంది వైర‌స్ బారిన ప‌డ్డారు. ఈ రోజే కాదు.. ‌తెలంగాణ రాష్ట్రంలో 80 శాతం క‌రోనా కేసులు జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే న‌మోదు అవుతున్నాయి. దీంతో లాక్ డౌన్ ప్ర‌చారం జోరుగా సాగింది. మొన్నగ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై తో కూడా నెటిజ‌న్లు లాక్ డౌన్ పై ఆలోచించాల‌ని ప‌లువురు సూచించారు. ఈ నేప‌థ్యంలో.. లాక్ డౌన్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్యా లాక్‌డౌన్‌ పెడితే ఆర్థిక పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని వెల్ల‌డించారు. క‌రోనా సోక‌కుండా ప్ర‌భుత్వం ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని, ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపారు.

నాకు క‌రోనా రాదు...

కరోనా క‌ట్ట‌డిలో తెలంగాణ ప్ర‌భుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని రాజకీయ విమర్శలు చేయడం దుర్మార్గపు చర్య అని అభివ‌ర్ణించారు. ఆ విమర్శలు వారి పైశాచిక ఆనందం కోసం మాత్రమేన‌ని ఆరోపించారు. ఇది విమ‌ర్శ‌లు చేసే సంద‌ర్బం కాద‌ని గుర్తుంచుకోవాల‌ని సూచించారు. కేసుల సంఖ్ స‌రే... కరోనా నుంచి కోలుకొని రికవరీ అయిన వారి గురించి ఎవ‌రూ ఎందుకు మాట్లాడ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో కరోనా టెస్టులు సరిగా చేయడం లేదు... ఫలితాలు దాస్తున్నారు అనడం సరికాదని మంత్రి కేటీఆర్ చెప్పారు. అలాగే ప్ర‌జ‌లు కూడా చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెప్పారు. 'ఎవరూ నాకు కరోనా రాదు... అనే అపోహతో ఉండొద్దు... ఇందుకు ఉదాహరణే డిప్యూటీ స్పీకర్ పద్మారావు. నేను ఓ కార్యక్రమానికి ఆయనతో కలిసి హాజరయినప్పుడు మాస్కు పెట్టుకోమంటే నాకు కరోనా రాదు అన్నారు.. కానీ మరుసటి రోజే కరోనా పాజిటివ్ వచ్చింది.. అని చెప్పారు. కోవిడ్-19 కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు లాక్డౌన్ పెడితే ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఫలితంగా కరోనా మరణాల కంటే లాక్ డౌన్ వల్ల సంభవించే మరణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రజలు ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకొని నియంత్రణ చేసుకోవాలి. దేశంలో తెలంగాణ రాష్ట్రం ఫార్మా రంగంలో ముందంజలో ఉంది. కరోనా వ్యాక్సిన్ తొందరలోనే రావాలని కోరుకుంటున్నా.. అని చెప్పారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp