తెగని పేచీ.. కేఆర్‌ఎంబీ గెజిట్‌ అమలుపై ఉత్కంఠ

By Karthik P Oct. 12, 2021, 03:50 pm IST
తెగని పేచీ.. కేఆర్‌ఎంబీ గెజిట్‌ అమలుపై ఉత్కంఠ

కృష్ణా నదిపై తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రాజెక్టులు, వాటి పరిధిలోని కేంద్రాల నిర్వహణ, నియంత్రణ, పర్యవేక్షణను కృష్ణా నదీ యాజమాన్య మండలి (కేఆర్‌ఎంబీ) పరిధిలోకి తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ అమలుపై పేచీ వీడలేదు. ఈ నెల 14వ తేదీ నుంచి గెజిట్‌ అమలు చేయాల్సిన ఉన్న తరుణంలో.. కేఆర్‌ఎంబీ చైర్మన్‌ ఎంపీ సింగ్‌ అధ్యక్షతన రెండు రాష్ట్రాల ఇరిగేషన్‌ ఉన్నతాధికారుల సమావేశం మరోసారి హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్‌సీ మురళీధర్, ఆంధ్రప్రదేశ్‌ నుంచి జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ నారాయణ రెడ్డిలు హాజరయ్యారు. గెజిట్‌ అమలుపై నియమించిన ఉప సంఘం ఇచ్చిన నివేదికపై చర్చ జరిగింది.

సిద్ధమన్న ఆంధ్రప్రదేశ్‌..

గెజిట్‌ అమలుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గతంలో చెప్పిన మాటకే కట్టుబడి ఉంది. గెజిట్‌ను అమలు చేసేందుకు జీవో జారీ చేస్తామని ఈ రోజు సమావేశంలోనూ ఏపీ అధికారులు బోర్డుకు తెలియజేశారు. 14వ తేదీన గెజిట్‌ అమలుకు వీలుగా ఏపీ పరిధిలోని ప్రాజెక్టులు, కేంద్రాలను బోర్డుకు అప్పజెప్పేలా జీవో జారీ చేస్తామని పేర్కొన్నారు. అదే సమయంలో తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులు, కేంద్రాలను కూడా బోర్డు పరిధిలోకి రావాలని ఏపీ అధికారులు స్పష్టం చేశారు.

తేల్చని తెలంగాణ..

గెజిట్‌ అమలుపై తెలంగాణ మాత్రం ఎటూ తేల్చలేదు. గతంలో చెప్పిన విషయాలనే తాజాగా బోర్డు సమావేశంలో తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. వివిధ ప్రాజెక్టులపై నెలకొని ఉన్న వివాదాలు పరిష్కారం అయ్యే వరకు గెజిట్‌ అమలును వాయిదా వేయాలని రజత్‌కుమార్‌ కోరారు. సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఈ నెల 14వ తేదీలోపు గెజిట్‌ అమలుపై తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని చెప్పారు.

పవర్‌ ప్లాంట్లపైనే చిక్కుముడి..

ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ ఉత్పత్తిపైనే ప్రతిసారి వివాదం మొదలవుతోంది. ఆ తర్వాత అది నిర్మాణం అయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల వైపు వెళుతోంది. గెజిట్‌ అమలులో కూడా విద్యుత్‌ ప్లాంట్ల విషయమే కీలకంగా మారింది. శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టులు ఏపీ, తెలంగాణ భూభాగాల్లో ఉన్నాయి. ఆయకట్టు ఏపీలో ఉండగా.. విద్యుత్‌ ప్లాంట్లు మాత్రం తెలంగాణ భూ భాగంలో ఉన్నాయి. ఆయకట్టుకు నీరు అవసరం అయినప్పుడు విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉండగా.. తెలంగాణ ఈ విషయంతో సంబంధం లేకుండా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండడంతో.. విలువైన జలాలు సముద్రం పాలవుతున్నాయి. ఏపీ ఆందోళనను భేఖాతరు చేస్తోంది. విద్యుత్‌ ఉత్పత్తిని ఆపాలని కేంద్రం చెప్పినా.. పట్టించుకోవడం లేదు.

Also Read : గెజిట్ల అమలుకు వేళాయే..

ఈ నేపథ్యంలో.. గెజిట్‌ అమలులోకి వస్తే.. విద్యుత్‌ప్లాంట్లు కూడా బోర్డు పరిధిలోకి వస్తాయి. ఫలితంగా ఇష్టారీతిన విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం తెలంగాణ కోల్పోతుంది. అందుకే గెజిట్‌ అమలుపై నాన్చివేత థోరణని అవలంభిస్తోందన్న అనుమానాలున్నాయి. ఏపీ మాత్రం పవర్‌ ప్లాంట్లను కూడా బోర్డు పరిధిలోకి తీసుకురావాల్సిందేనంటూ తెగేసి చెబుతోంది. ఈ నేపథ్యంలో గెజిట్‌ అమలు ప్రారంభమయ్యే ఈ నెల 14వ తేదీ లోపు తెలంగాణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp