మహిళల స్పీడ్‌ చెస్‌లో సంచలనం సృష్టించిన తెలుగుతేజం కోనేరు హంపి

By Srinivas Racharla Jul. 19, 2020, 07:42 am IST
మహిళల స్పీడ్‌ చెస్‌లో సంచలనం సృష్టించిన తెలుగుతేజం కోనేరు హంపి

ఫిడే మహిళల స్పీడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో చివరిదైన 4వ గ్రాండ్‌ ప్రీలో భారత గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపి సంచలనం సృష్టించింది.రాపిడ్‌ చెస్‌ నెంబర్‌వన్‌ క్రీడాకారిణి హో ఇఫాన్‌ (చైనా) ను తెలుగు తేజం కోనేరు హంపి చిత్తు చేసి ఫైనల్‌లోకి ప్రవేశించింది.

సెమీఫైనల్‌లో తొలి గేమ్‌ను సునాయాసంగా గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి గెలుచుకుంది.రెండోవ గేమ్‌ను హో ఇఫాన్‌ పుంజుకొని నెగ్గింది.ఆ తర్వాత రెండు గేమ్‌లను హంపి,ఇఫాన్‌ గెలుచుకొని సమఉజ్జీలుగా నిలిచారు. ఈ దశలో ఒత్తిడిని తట్టుకుంటూ ప్రత్యర్థిని తన ఎత్తులతో బోల్తా కొట్టించి నిర్ణయాత్మక గేమ్‌లో విజయం సాధించింది.దీంతో సెమీస్‌లో హంపి 6-5 తేడాతో ఇఫాన్‌ను ఓడించి తుది పోరుకు అర్హత సంపాదించింది.ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో రష్యా స్టార్‌ క్రీడాకారిణి అలెక్సాండ్రా కోస్తానెక్‌తో హంపి తలపడనుంది.

ఇక స్పీడ్‌ చెస్‌లో ఇప్పటివరకు మొత్తం మూడు గ్రాండ్‌ ప్రీ టోర్నీలు జరిగాయి.మొదటి టోర్నీలో కోనేరు హంపి తొలి రౌండ్‌లోనే ఓటమి పాలయింది.రొటేషన్‌ పద్ధతిలో భాగంగా రెండో గ్రాండ్‌ ప్రీలో ఆమె బరిలోకి దిగలేదు. మూడో గ్రాండ్‌ ప్రీలో క్వార్టర్స్‌ వరకు చేరుకుంది.కాగా ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టోర్నీలో అదరగొట్టే ఆటతీరుతో తెలుగమ్మాయి ఫైనల్‌ చేరింది. మొత్తం నాలుగు గ్రాండ్‌ ప్రీ టోర్నీలలో పాయింట్ల ఆధారంగా తొలి రెండు స్థానాల్లో నిలిచిన క్రీడాకారిణుల మధ్య ఈనెల 20న సూపర్‌ ఫైనల్‌ జరగనుంది.

కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో జ‌రిగిన కెయిన్స్ క‌ప్ టోర్నీని గెలవడం ద్వారా కోనేరు హంపి తొలి టైటిల్‌ను గెలుపొందిన సంగతి తెలిసిందే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp