ఖమ్మంలో బీజేపీ, జనసేన దోస్తీ.. ప్రభావం ఎంత?

By Ritwika Ram Apr. 19, 2021, 02:31 pm IST
ఖమ్మంలో బీజేపీ, జనసేన దోస్తీ.. ప్రభావం ఎంత?

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. దీనిపై ఇరు పార్టీలకు చెందిన లీడర్లు సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏ పార్టీ తరఫున ఎంత మంది బరిలో నిలుస్తారు? ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారు? అనేది ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు చూపబోయే ప్రభావం ఎంత? ఓట్లు చీలుస్తాయా? సీట్లు సాధిస్తాయా? కార్పొరేషన్​ను దక్కించుకుంటాయా?

తొలి సారి కలిసి పోటీ

జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని భావించాయి. కానీ బీజేపీ అందుకు ఒప్పుకోలేదు. దీంతో జనసేన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. అప్పటికే జనసేన తరఫున నామినేషన్లు వేసిన అభ్యర్థులు విత్ డ్రా చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో నేతల నుంచి వ్యతిరేకత వచ్చినా జనసేన తన నిర్ణయానికే కట్టుబడింది. మరోవైపు కొందరు బీజేపీ నేతలు జనసేనను హేళన చేస్తూ మాట్లాడారు. మద్దతు ఇవ్వమని జనసేనను తాము అడగలేదని, వాళ్లే వచ్చి మద్దతు ఇస్తామని చెప్పారని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్​కు దీటుగా బీజేపీ సీట్లు గెలుచుకుంది. దీంతో తాము సపోర్టు చేయడం వల్లే బీజేపీకి సీట్లు పెరిగాయిన జనసేన లీడర్లు కౌంటర్ కామెంట్లు చేశారు.

ఆ రిజల్ట్ రిపీట్ అవుతుందా?

2012లో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది. 2016 మార్చి 6వ తేదీన 50 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 291 మంది అభ్యర్థులు బరిలో నిలబడ్డారు. టీఆర్‌ఎస్‌ 34 డివిజన్లు గెలుచుకుని మేయర్‌ పీఠం దక్చించుకుంది. అప్పటి ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసినా.. ఒక్క సీటు కూడా దక్కలేదు. అయితే ఇప్పుడు పార్టీ చాలా వరకు మారింది. టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలను రిపీట్ చేయాలని చూస్తోంది. సాగర్ లో కాస్త వెనుకబడినా.. బైపోల్ రిజల్ట్ రావడానికి టైం పడుతుంది కాబట్టి.. ఆ ఎఫెక్ట్ ఖమ్మం మున్సిపల్ ఎన్నికలపై పడదని భావిస్తోంది. మరోవైపు ఖమ్మంలోనే కాదు.. తెలంగాణలోనే తొలిసారి జనసేన పోటీ చేస్తోంది. బీజేపీతో కలిసి బరిలోకి దిగుతోంది. అధికార టీఆర్ఎస్​పై గట్టిపోటీ ఇస్తామనే భావిస్తోంది.

జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేశారా?

నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆదివారమే ఆఖరు. రెండు పార్టీలు పొత్తు నిర్ణయం తీసుకునే సరికి.. పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. అయితే బీజేపీ తరఫున 70 మందికి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇండిపెండెంట్లు 50 మంది దాకా నామినేషన్ వేశారు. మరి ఇండిపెండెంట్లలో జనసేన తరఫున ఎవరైనా బరిలో ఉన్నారా? లేక బీజేపీ లీడర్లలో కొందరిని జనసేనలోకి చేర్చుకుంటారా? లేక జీహెచ్ఎంసీలో మాదిరి బీజేపీ పోటీ చేస్తే జనసేన సపోర్టు చేస్తుందా? అనేది క్లారిటీ రాలేదు.

జనసేన గుర్తు ఏది?

స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ కామన్ గుర్తు అయిన ‘గాజు గ్లాసు’ను ఎన్నికల సంఘం తొలగించింది. కామన్ సింబల్ ఇచ్చాక వరుస ఎన్నికల్లో కనీసం 10 శాతం సీట్లలో పార్టీ పోటీ చేయకపోతే కేటాయించిన గుర్తును తొలగిస్తారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. అంతకుముందు జరిగిన ఎన్నికల్లోనూ 10 శాతం సీట్లలో అభ్యర్థులను నిలపలేదు. దీంతో రూల్స్ ప్రకారం గుర్తును తొలగిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని, గాజు గ్లాస్ గుర్తును కొనసాగించాలని జనసేన కోరింది. కానీ అందుకు ఈసీ ఒప్పుకోలేదు. దీంతో జనసేన ఏ గుర్తుపై పోటీ చేస్తుందనేది తెలియదు. బీజేపీ కమలం గుర్తుపై పోటీ చేస్తుందా? లేక కొత్త గుర్తును ఎంచుకుంటుందా? అనేది తెలియాల్సి ఉంది.

మిగతా మున్సిపాలిటీల్లో..?

కేవలం ఖమ్మం కార్పొరేషన్ వరకే రెండు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఎన్నికలు జరగనున్న వరంగల్ కార్పొరేషన్, జడ్చర్ల, కొత్తూరు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి అక్కడ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా? లేక వేర్వేరుగానా అనేది క్లారిటీ లేదు.

Also Read : ఆ సీట్ ఏకగ్రీవం వెనుక ఆసక్తికర రాజకీయాలు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp