ఖ‌మ్మం కాంగ్రెస్‌లో విభేదాల కుంప‌ట్లు..!

By Kalyan.S Dec. 06, 2021, 07:01 pm IST
ఖ‌మ్మం కాంగ్రెస్‌లో విభేదాల కుంప‌ట్లు..!

అస‌లే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ‌లో జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా మారింది. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం రాజ‌కీయంగా బాగా దెబ్బ‌తిన్న పార్టీ. ఏపీలో అస‌లు దాని ఊసే లేదు. రాష్ట్ర ఆవిర్భావంలో కీల‌క పాత్ర పోషించిన‌ప్ప‌టికీ తెలంగాణ‌లోనూ క‌లిసి రాలేదు. ఏడేళ్లుగా ఉనికి కోసం పాకులాడుతూనే ఉంది. అంత‌కంత‌కూ ప్రాతినిధ్యం త‌గ్గుతోంది త‌ప్పా.. పెర‌గ‌డం లేదు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక ఏదో కాస్త ఊపు వ‌స్తోందంటే.. కొంద‌రి నేత‌ల తీరుతో కాంగ్రెస్ ప్ర‌తిష్ట మ‌స‌క‌బారుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఓట‌మిపై జ‌రిగిన స‌మీక్ష సంద‌ర్భంగా.. ఏకంగా ఢిల్లీలోనే గ‌ల్లీ లీడర్లుగా తిట్టుకున్నారు కొంద‌రు ప్ర‌ముఖ నేత‌లు. అనంత‌రం వరి పై జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఒకే వేదిక‌ను పంచుకోవ‌డం శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచింది. కానీ ఇంత‌లోనే బ‌ట్టి విక్ర‌మార్క, రేణుకా చౌద‌రి మ‌ధ్య అంత‌ర్యుద్ధం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

రేణుకా చౌదరి 1984లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్ర‌వేశం చేశారు. రెండు సార్లు రాజ్య సభ సభ్యురాలిగా పని చేశారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. అనంత‌రం రేణుక 1998లో కాంగ్రెస్‌లో చేరారు. నాటి నుంచి అదే పార్టీలో ప‌లు ప‌ద‌వులు అనుభ‌వించి నేటికీ కొన‌సాగుతున్నారు. పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా ఆమెకు గుర్తింపు ఉంది.విప‌క్షాల‌పైనే కాకుండా అప్పుడ‌ప్పుడు సొంత పార్టీ నేత‌ల‌పైనే ఫైర్ అవుతూ ఉంటారు. ఇప్పుడూ అదే జ‌రుగుతోంది. రేణుకా చౌదరి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య కోల్డ్ వార్ న‌డుస్తోంది. ఎప్ప‌టి నుంచో ఈ తంతు కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ ఇటీవ‌ల కొంచెం హైలెవ‌ల్‌కు చేరింది. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నిక నుంచి మొదలైన ఈ వార్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలతో మరింత ముదిరిందని తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పే.. జిల్లా కీలక నేతలే ఇలా పోటా పోటీగా ఉండటంతో నేతలకు, శ్రేణులకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదని టాక్‌ వినిపిస్తోంది.

Also Read : Punjab Congress - కేజ్రీవాల్‌కి 'టిట్‌ ఫర్‌ టాట్‌' అంటూ ఝలక్‌ ఇచ్చిన పంజాబ్ కాంగ్రెస్

ఖ‌మ్మం జిల్లాకు చెందిన ఇద్ద‌రూ త‌మ‌దే పై చేయి కావాల‌ని ఆది నుంచీ పోటీ ప‌డుతూనే ఉన్నారు. ఒకే పార్టీలో ఉన్న‌ప్ప‌టికీ ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. ఇండైరెక్టుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉండేవారు. గతంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా రేణుక చౌదరి బాహాటంగానే ఎన్నికల్లో పోటీ చేసినవారి గురించి మాట్లాడుతూ.. ఈ సారి ఎన్నికల్లో నిజమైన కాంగ్రెస్ వాళ్లకు టికెట్స్ ఇవ్వలేదని, త‌ర్వాత అయినా అలా జరగకుండా చూస్తానంటూ పేర్కొన్నారు. నిజమైన కాంగ్రెస్ నాయకులకి అన్యాయం చేశారని భ‌ట్టిని ఉద్దేశించే ఆమె ఆ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు క‌ల‌క‌లం రేగింది. ఆ మీటింగ్ లో అప్పటి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌తో పాటు మాణిక్యం ఠాగూర్ కూడా ఉన్నారు. ఇక ఖమ్మం డీసీసీ విషయంలో కూడా వార్ నడిచింది. బట్టి విక్రమార్క పట్టు బట్టి మరి పువ్వాళ్ల దుర్గ ప్రసాద్‌ను నియమించారు. అయితే దుర్గ ప్రసాద్ నియామకాన్ని కూడా రేణుక వ్యతిరేకించారట. నా అభిప్రాయం లేకుండా ఎలా నియమిస్తారంటూ రేణుక బట్టిపై ఫైర్‌ అయ్యారని సమాచారం.

డీసీసీ అధ్యక్షుడి నియామకం నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ వరకు ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదరట్లేదని సమాచారం. పైగా రేవంత్ పీసీసీ అయిన తరువాత బట్టికి తెలియకుండా ఖమ్మం నేతలతో కలిసి రేణుక తన నివాసంలో విందును ఏర్పాటు చేశారని.. దీంతో ఇద్దరు కీలక నేతల మధ్య మరింత గ్యాప్‌ పెరిగిందని సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఈ ఇద్దరు నేతల తీరుతో కేడ‌ర్ ఆందోళ‌న చెందుతోంది. కరవమంటే కప్పకి కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా క్యాడర్ పరిస్థితి ఉందని టాక్‌ వినిపిస్తోంది. అంత‌ర్గ‌త క‌ల‌హాలు కాంగ్రెస్‌కు కొత్త కాక‌పోయిన‌ప్ప‌టికీ ...ప‌రిస్థితులు బాగా లేని స‌మ‌యంలో కూడా అవి హెచ్చుమీర‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

Also Read : L.Ramana - ఏ పార్టీలో అయినా ఎల్‌. ర‌మ‌ణ‌ ఎదురీద‌క త‌ప్ప‌దా?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp