దేవతలు నడయాడిన ప్రాంతంలో ఆహారం లేక బురద, మట్టి తింటున్న చిన్నారులు

By Amar S Dec. 05, 2019, 10:56 am IST
దేవతలు నడయాడిన ప్రాంతంలో ఆహారం లేక బురద, మట్టి తింటున్న చిన్నారులు

ఆ రాష్ట్రం భారతదేశంలోనే అందమైన రాష్ట్రంగా పేరుగాంచింది.. ధనిక రాష్ట్రంగా కీర్తిగడించింది.. అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రం.. దేశంలోనే అత్యంత అధిక అక్షరాస్యత నమోదవుతున్న రాష్ట్రం.. టూరిజం పరంగానూ డెవలప్ అవుతోంది.. ఇండియాలో ఎక్కడా లేనివిధంగా 6 ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు ఉన్నాయి. కవులు సైతం దేవతలు నడయాడే ప్రదేశంగా గొప్పగా చెప్పే రాష్ట్రమే కేరళ.. ఇక్కడ ఎన్ని ఉంటే ఏం.. ఓ అమానవీయమైన ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది.. గుండె తరుక్కుపోయే ఘటన బయటకు వచ్చింది. పేదరికంతో ఓ తల్లి పిల్లల్ని చంపుకోలేక కడుపునిండా బువ్వపెట్టలేని దయనీయమైన పరిస్థితి వెలుగుచూసింది. దీంతో పిల్లలు తమ ఆకలి తీర్చుకునేందుకు మట్టి, బురదను తింటున్న వైనం వెలుగుచూసింది.

ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటనపట్ల అందరూ కేరళ పాలకుల్ని తిట్టి పోస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని ఓ రైల్వే ట్రాక్ సమీపంలోని ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఉదంతాన్ని సర్వత్రా ఖండిస్తున్నారు. తాగుడుకు బానిసైన ఇంటి యజమాని కుటుంబ పోషణ పట్టించుకోకపోవడంతో ఆ మహిళ సాధ్యమైనంత మేర పిల్లలను పోషించడానికి ప్రయత్నించింది. అందరూ చిన్నపిల్లలే కావడంతో వారిని ఇంటివద్దే ఉంచి పనులకు వెళ్లడం సాధ్యం కాలేదు. అప్పటికీ తనకు అవకాశం ఉన్నమేర పనులు చేసి పిల్లలకు ఆహారం పెట్టింది. ఇంకా తనవల్ల కాకపోవడంతో ఆ పిల్లలకు బురద, మట్టితో కడుపు నింపుతోంది. మొత్తం ఆరుగురు పిల్లలు ఉండడంతో వారికి ఆహారాన్ని ఎలా ఇవ్వాలో అర్థం కాని దీన పరిస్థితుల్లో ఆ తల్లి ఉంది.

ఈ ఘటన స్థానికుల సాయంతో వెలుగులోకి వచ్చిన వెంటనే తిరువనంతపురం మేయర్ స్పందించారు. మొత్తమ్మీద ప్రభుత్వం దృష్టికి వారి దీన గాధ వెళ్లింది. వెంటనే వారి సమస్యలు తీర్చేందుకు నడుం బిగించారు. ఇద్దరు చిన్నారులు (నెలన్నర వయసున్న) మినహా మిగిలిన నలుగురు పిల్లల్ని శిశు సంరక్షణ సమితి వారి సంరక్షణ బాధ్యతల్ని తీసుకుంది. ఆ తల్లికి ఉద్యోగాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే లైఫ్ మిషన్ పథకం కింద నిర్మిస్తున్న అపార్ట్ మెంట్లో ఒక ఫ్లాట్ ను ఆమెకు కేటాయించారు. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నాయి. సంపన్న రాష్ట్రంలో ఇంత దారుణమా.? అని పలువురు నేతలు మండిపడుతున్నారు. కేరళకు ఈ ఘటన ఒక అవమానంగా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన పట్ల దేశం యావత్తు చలించిపోతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp