కేజ్రీవాల్ హస్తిన పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు

By Kotireddy Palukuri Feb. 13, 2020, 07:35 am IST
కేజ్రీవాల్ హస్తిన పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయభేరి మోగించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ 16న ఆదివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రామ్‌లీలా మైదానం ఈ కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రజలందరూ ప్రత్యక్షంగా వీక్షించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కేజ్రీవాల్‌తోపాటు కేబినెట్‌ మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రజలందరూ పెద్ద ఎత్తున కదిలిరావాలని ఆప్ నేతలు పిలుపునిచ్చారు.

అంతకుముందు కేజ్రీవాల్‌ కొత్తఎమ్మెల్యేలతో తన నివాసంలో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలందరూ లాంఛనప్రాయంగా కేజ్రీవాల్‌ను ఆప్‌ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత కేజ్రీవాల్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ను కలసి కొత్త ప్రభుత్వ ఏర్పాట్లపై చర్చించారు. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఆప్‌ సన్నాహాలు చేస్తోంది. భారీగా జన సమీకరణ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.

కాగా ఎన్నికల్లో ఆప్ మరో సారి క్లిన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఆప్ 62 సీట్లు గెలుచుకుని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. బిజెపి 8 స్థానాలు గెలుచుకుని గతంలో కన్నా 5 సీట్లు మెరుగుపరుచుకుంది. ఇక కాంగ్రెస్ మునుపటిలాగే ఖాతా తెరవలేదు. వరుసగా కేజ్రీవాల్ మూడో సారి సీఎం గా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp