కర్ణాటక ఉపఎన్నికల

By Amar S Dec. 06, 2019, 08:02 am IST
కర్ణాటక ఉపఎన్నికల

కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ పూర్తైంది. తెల్లవారుజామునుండే ఓటర్లు పోలింగ్ బూత్ లకు క్యూ కట్టారు. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలోని 17మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. రెండు నియోజకవర్గాల్లో కేసులు విచారణలో ఉండడంతో వాటిని పెండింగ్ లో ఉంచారు. రాజీనామా చేసిన అభ్యర్థులందర్నీ అనర్హులని ప్రకటించిన సుప్రీంకోర్టు ఉపఎన్నికలో పోటీ చేసేందుకు అవకాశమిచ్చింది.

అలా అనర్హతవేటు పడినవారిలో 16మంది అధికార భారతీయ జనతా పార్టీలో చేరారు. వారిలో ఇప్పుడు 13మంది పోటీ చేసారు. వీరిలో చాలామందికి మంత్రి పదవులిస్తానని ఇప్పటికే ముఖ్యమంత్రి యాడ్యూరప్ప ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ 15 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. జేడీఎస్ 12, బీఎస్పీ 2, ఎన్సీపీ ఒక్కోస్థానంలో పోటీకి దిగాయి.

గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన కాంగ్రెస్, జేడీఎస్ ప్రస్తుతం వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఇప్పుడు అతానీ, విజయనగర, కాగ్వాద్, గోకక్, ఎల్లాపూర, హిరికెరూర్, హున్సూర్, మహాలక్ష్మీ లేఅవుట్, రాణిబెన్నూర్, చిక్ బళ్లాపుర, హోస్కేటే, కేఆర్ పేట, కేఆర్ పురం, శివాజీనగర్, యశ్వంత్ పూర్ స్థానాల్లో ఉపఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికలు మాత్రం మంత్రివర్గ విస్తరణ ఆధారంగా జరుగుతున్నాయని స్పష్టమవుతోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సావాడి ఈ విషయాన్ని తెలిపారు.

ఉప ఎన్నికల ఫలితాలు ఈనెల 9న వెలువడ్డాక రాష్ట్ర మంత్రివర్గం విస్తరిస్తామని ప్రకటించారు. కర్ణాటక మంత్రి వర్గంలో ముఖ్యమంత్రితో పాటుగా మరో 34మంది మంత్రులు ఉండవచ్చు. ప్రస్తుతానికి యాడ్యూరప్ప మంత్రివర్గంలో కేవలం 18మంది మాత్రమే ఉన్నారు. అలాగే కాంగ్రెస్, జేడీఎస్ లో అనర్హులైన ఎమ్మెల్యేలు బీజేపీ టికెట్ పై పోటీ చేయడం వల్ల వారు గెలిస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటానని యాడ్యూరప్ప ఎన్నికల ప్రచారంలోనే ప్రకటించారు.

అయితే ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న 15 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 6సీట్లు గెలిస్తేనే ఆపార్టీకి శాసనసభలో మెజారిటీ ఉంటుంది. బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుంది. దీంతో ఈ ఉప ఎన్నికలు యాడ్యూరప్ప ప్రభుత్వానికి కీలకంగా మారాయి. ప్రస్తుతం బీజేపీకి 106మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఉపఎన్నికల ఫలితాలు వస్తే.. మేజిక్ ఫిగర్ 112కు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ కచ్చితంగా 6 సీట్లు గెలవాల్సి ఉంది. లేకుంటే సభలో బలాబలాలు మారిపోయి యాడ్యూరప్ప కుర్చీ కూలిపోయే అవకాశమూ లేకపోలేదు. డిశంబర్ 9వ తేదీన ఈ ఉపఎన్నికల ఫలితాలు తేలనున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp