ముద్రగడను వెంటాడుతున్న రత్నాచల్......

By Voleti Divakar Feb. 28, 2021, 07:30 am IST
ముద్రగడను వెంటాడుతున్న రత్నాచల్......

ఉద్యమ రాజకీయాల నుంచి తప్పుకున్నా ముద్రగడ పద్మనాభంను రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కేసు వెంటాడుతూనే ఉంది. తునిలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ దహనం కేసును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపసంహరించుకుంది.

తాజాగా విజయవాడలోని రైల్వే కోర్టు ఈ కేసులో ముద్రగడతో సహా 41 మందికి సమన్లు జారీ చేసింది. మార్చి 2న ఈకేసులో విచారణకు హాజరుకావాలని విజయవాడలోని 2వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమన్లు జారీ చేశారు. ఈ కేసులో తుని వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కూడా ఉన్నారు. ఈ సంఘటన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 2016లో జరగ్గా, ఈ కేసులో రైల్వేకోర్టు తాజాగా సమన్లు జారీ చేయడం గమనార్హం.

ఆనాడు ఇదీ జరిగింది...
కాపులను బిసిల్లో చేర్చి, రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ తో ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కాపులు ఆందోళన చేపట్టారు. దీనిలో భాగంగా 2016లో కాపు ఐక్య గర్జన పేరిట తునిలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆగ్రహం చెందిన ఆందోళనకారులు అటుగా వెళుతున్న రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పుపెట్టారు. ఈ సంఘటన పై రాష్ట్ర పోలీసులతో పాటు, ఆర్పీఎఫ్ పోలీసులు కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కాపు ఉద్యమకారులపై కేసులను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వే పోలీసులు మాత్రం కేసును కొనసాగిస్తున్నారు.

ఉద్యమాల నుంచి విరమించుకున్నా....
తుని సంఘటన తరువాత తీవ్ర మనోవేదనకు గురైన ముద్రగడ రత్నాచల్ దహనాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటన తరువాత కాపు ఉద్యమం దిశ మారింది. దీని పై ముద్రగడ పై తోటి సామాజిక వర్గీయులు విమర్శలు గుప్పించడంతో మనస్తాపం చెంది, ఉద్యమాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

కొద్దిరోజుల క్రితం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కిర్లంపూడి వెళ్లి ముద్రగడతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ముద్రగడకు పెద్ద బాధ్యతను అప్పగిస్తామని చెప్పారు. ఆయనను బిజెపిలోకి ఆహ్వానించారు. దీన్ని ముద్రగడ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఆలోచించుకుని చెబుతానని సోమును పంపివేశారు.

మొన్నడిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమంకు మద్దతుగా, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ముద్రగడ నేరుగా ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రైల్వేకోర్టు సమన్లు పంపడం కాపులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. తిరుపతి ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈకేసును తిరగదోడటం ఒక విధంగా బిజెపికి నష్టదాయకంగా భావిస్తున్నారు. బిజెపితో పాటు, జన సేన పార్టీ కూడా ఈ పరిణామాలతో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp