మాజీ ముఖ్యమంత్రి "ఐటమ్" వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ విచారం...

By Srinivas Racharla Oct. 20, 2020, 09:44 pm IST
మాజీ ముఖ్యమంత్రి "ఐటమ్" వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ విచారం...

మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలలో పాలక బిజెపి,ప్రతిపక్ష కాంగ్రెస్ సై అంటే సై అని ఢీకొంటున్నాయి. డబ్రా ఎన్నికల ప్రచార సభలో మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ చేసిన 'ఐటమ్' వ్యాఖ్యలతో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య రాజుకున్న అగ్గి సెగలు పుట్టిస్తుంది. తాజాగా ఓ బిజెపి మంత్రి కాంగ్రెస్ అభ్యర్థి భార్యను అగౌరపరచడం ఉప ఎన్నికల వేడిని మరింత పెంచింది.

ఇవాళ మధ్యప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ వివాదాస్పద 'ఐటమ్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తీవ్రంగా స్పందించారు.బిజెపి మహిళా మంత్రి ఇమార్తి దేవీపై కమల్‌నాథ్‌ చేసిన 'ఐటమ్' వ్యాఖ్యలను రాహుల్ తప్పు పట్టాడు.తన లోక్‌సభ నియోజకవర్గం వయనాడ్‌లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడుతూ "కమల్‌నాథ్‌ జీ మా పార్టీ వ్యక్తే కావచ్చు.కానీ వ్యక్తిగతంగా నాకు ఆయన ఉపయోగించిన భాష నచ్చలేదు. మాట్లాడిన వ్యక్తి ఎవరైనా సరే అలాంటి భాష ఉపయోగించడాన్ని నేను సహించను" అని ఆయన స్పష్టం చేశాడు. కమల్‌ నాథ్‌ వ్యాఖ్యలు దురదృష్టకరం,ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని పార్టీకి సంబంధం లేదని రాహుల్ ప్రకటించాడు.

కాగా రాహుల్‌గాంధీ తన వ్యాఖ్యలను తప్పు పట్టడంపై కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్‌ స్పందించారు. డబ్రాలో నేను చేసిన వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ తన అభిప్రాయం చెప్పారు. నేను ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశానో ఇప్పటికే వివరణ ఇచ్చాను. నేను ఎవరిని అవమానించాలని ఆ వ్యాఖ్యలు చేయనప్పుడు ఎందుకు క్షమాపణలు చెప్పాలని కమల్‌నాథ్‌ ప్రశ్నించాడు. ఒకవేళ ఎవరైనా అవమానకరంగా భావిస్తే తాను ఇప్పటికే పశ్చాత్తాపం వ్యక్తం చేశానని ఆయన పేర్కొనడం గమనార్హం.

ఇప్పటికే కమల్‌నాథ్‌ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు,రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా విరుచుకు పడుతున్నాయి. తనపై కమల్‌నాథ్‌ చేసిన వ్యాఖ్యలను డబ్రా బీజేపీ అభ్యర్థి, మంత్రి ఇమార్తి దేవీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమల్‌నాథ్‌ని కాంగ్రెస్ పార్టీ నుండి వెంటనే తొలగించాలని సోనియా గాంధీని ఆమె కోరారు. సోనియా గాంధీ తన కూతురుపై ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. కాగా జాతీయ మహిళా కమిషన్ కూడా కమల్‌నాథ్‌ వ్యాఖ్యలపై ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది.

కాంగ్రెస్ అభ్యర్థి భార్యను 'ఉంపుడుగత్తె' అన్న బీజేపీ మంత్రి

మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీకి చెందిన ఓ మంత్రి కూడా కాంగ్రెస్ అభ్యర్థి భార్యని అవమానకరమైన పదజాలంతో దూషించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సోమవారం వైరల్ అయిన ఒక వీడియోలో అనుప్పూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విశ్వనాథ్ సింగ్ కుంజం రెండవ భార్యను "ఉంపుడుగత్తె" గా మంత్రి బిసాహులాల్ సింగ్ అభివర్ణించారు.

మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్‌ వ్యాఖ్యలతో ఉపఎన్నికలలో లబ్ధి పొందేందుకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మౌనదీక్షతో ప్రయత్నించాడు. కానీ తన క్యాబినెట్ మంత్రి బిసాహులాల్ సింగ్ ఓ మహిళను అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు చేయడంతో సీఎం శివరాజ్ సింగ్ పరిస్థితి గొంతులో పచ్చి వెలక్కాయ పడిన చందంగా తయారైంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp