మధ్యప్రదేశ్‌లో తీవ్ర దుమారం లేపుతున్న మాజీ సీఎం కమల్ నాథ్ వ్యాఖ్యలు

By Srinivas Racharla Oct. 19, 2020, 09:00 am IST
మధ్యప్రదేశ్‌లో తీవ్ర దుమారం లేపుతున్న మాజీ సీఎం కమల్ నాథ్  వ్యాఖ్యలు

మధ్యప్రదేశ్‌లో ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.అధికార బిజెపి,ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలకు ఉప ఎన్నికల ఫలితాలు జీవన్మరణ సమస్యగా మారడంతో విమర్శలు స్థాయి మోతాదును మించి పోయింది.తాజాగా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ఉపయోగించిన పదం తీవ్ర దుమారం రేపింది.

గత మార్చి చివరి వారం జ్యోతిరాదిత్య సింధియాకు విధేయులైన 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి పాలక బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం కమల్ నాథ్ చేజారిపోవడానికి కారణమైన మాజీ శాసనసభ్యుల బృందంలో ' ఇమార్తి దేవి' ఒకరు.కాంగ్రెస్‌ని వీడి బిజెపిలో చేరిన ఆమె గతంలో గెలుపొందిన దాబ్రా నియోజకవర్గం నుండే ఉప ఎన్నికల బరిలో నిలిచింది.

ఈ నేపథ్యంలో డబ్రాలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో మాజీ సీఎం కమల్ నాథ్ పాల్గొన్నారు.అందులో కమల్ నాథ్ ప్రసంగిస్తూ బిజెపి అభ్యర్థి 'ఐటమ్' కంటే భిన్నమైన సాధారణ వ్యక్తి తమ కాంగ్రెస్ అభ్యర్థి అని వ్యాఖ్యానించాడు.ఇంకా నేను ప్రత్యర్థి పేరు ఎందుకు చెప్పాలి? నా కన్నా ఆ వ్యక్తి మీ అందరికీ బాగా తెలుసు.ఒక ఐటమ్ ఏమిటి? అని కమల్ నాథ్ మాట్లాడుతుండగా కార్యకర్తలు ఉత్సాహంతో ' ఇమార్తి దేవి' అని కేకలు పెట్టారు. ఆయన ప్రసంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

కాగా సీఎం శివరాజ్ సింగ్ ట్విట్టర్‌ వేదికగా ఒక మహిళను " ఐటమ్" గా పేర్కొనడం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యొక్క "భూస్వామ్య మనస్తత్వాన్ని" వెల్లడిస్తుందని విమర్శించాడు.డబ్రా నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ఇమర్తి దేవి ఒక పేద రైతు కుమార్తె, ఆమె గ్రామ కార్మికురాలుగా తన జీవితాన్ని ప్రారంభించి తరువాత ప్రజా సేవకురాలిగా ఎదిగారని ట్విట్టర్‌లో సీఎం చౌహాన్ పేర్కొన్నాడు.ఇక సీనియర్ కాంగ్రెస్ నేత కమల్ నాథ్ వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మౌన దీక్షను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చేపడుతుండటంతో ఎంపీ రాజకీయాలు మరింత వేడెక్కడున్నాయి.ఈ అంశంపై భోపాల్‌లో ఎన్నికల అధికారులను కలిసిన బిజెపి నేతలు కమల్ నాథ్‌ మహిళలు, దళితులను అవమానించినట్టు ఫిర్యాదు చేశారు.

కాగా మాటల యుద్ధంతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్న సీఎం,మాజీ సీఎం భవిష్యత్తు నవంబర్ 10న వెలువడే ఫలితాలతో తేలనుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp