Kakinada Corporation - కాకినాడ మేయర్‌గా శివప్రసన్న ?

By Aditya Oct. 24, 2021, 09:30 pm IST
Kakinada Corporation - కాకినాడ మేయర్‌గా శివప్రసన్న ?

కాకినాడ నగరపాలక సంస్ధ కొత్త మేయర్‌గా సుంకర శివప్రసన్న ఎన్నిక కానున్నట్టు సమాచారం. తెలుగుదేశం పార్టీకి చెందిన శివ ప్రసన్న.. 40 వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. మెజార్టీ కార్పొరేటర్లు ఈ విషయమై ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. సోమవారం జరిగే ఎన్నిక సందర్భంలో ఆమె పేరును ప్రకటించనున్నారు. డిప్యూటీ మేయర్‌గా ఎవరిని ఎన్నుకుంటారు అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. వైఎస్సార్‌ సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు డిప్యూటి మేయర్‌ అభ్యర్ధిని ఎంపిక చేయనున్నారు. ఈ ఎన్నిక నేపథ్యంలో మెజార్టీ కార్పొరేటర్లు కాకినాడలోని  ఓ హోటల్లో బస చేశారు. కొత్త మేయర్‌ను ఎన్నుకునేందుకు కౌన్సిల్‌ సమావేశం జరిగే సమయానికి కార్పొరేటర్లు నేరుగా హాజరుకానున్నారు.

కోర్టు తీర్పుపై ఉత్కంఠ

నిబంధనలకు విరుద్ధంగా, కనీసం నోటీసు ఇవ్వకుండా తనపై అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహించారని మాజీ మేయర్‌ సుంకర పావని హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసుకు విచారణకు సోమవారం స్వయంగా హాజరుకావాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ కోర్టుకు హాజరై తమ వాదనను వినిపించనున్నారు. ఈ అంశంపై హైకోర్టు నుంచి ఎటువంటి తీర్పు వెలువడుతుందో అని రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల నిర్వహణకు కార్పొరేషన్‌ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. నగరపాలక సంస్ధ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఈ ఎన్నిక జరగనుంది. ఇంతవరకూ మేయర్‌గా ఉన్న సుంకర పావని, డిప్యూటీ మేయర్‌ కాలా భీమశంకర సుబ్రహ్మణ్యేశ్వర సత్తిబాబులపై ఈ నెల 5వ తేదీన మెజార్టీ కార్పొరేటర్లు అవిశ్వాసం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈనెల 12న వారిని తొలగిస్తూ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న మేయర్‌, డిప్యూటీ మేయర్‌ల పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఎన్నిక ప్రక్రియ ఇలా..

కార్పొరేషన్‌ ప్రత్యేక సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు జరగనుంది. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జి.లక్ష్మీశ ప్రిసైడింగ్‌ అధికారిగా వ్యవహరించనున్నారు. తొలుత మేయర్, ఆ తర్వాత డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నిర్వహిస్తారు. ప్రస్తుతం 44 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్‌అఫిషియో సభ్యులు మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిలతో కలిపి 47 మంది ఓటర్లున్నారు. సమావేశం కోరం 50శాతం అంటే 24 మంది సభ్యులు హాజరుకావాల్సి ఉంటుంది. కోరం ఉంటే పోటీ చేసేందుకు ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరతారు. ఒకరు ప్రతిపాదించి మరొకరు బరపరచాల్సి ఉంటుంది. పోటీలో ఒకే అభ్యర్థి నుంచి ప్రతిపాదన వస్తే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. ఒకరి కన్నా ఎక్కువ మంది పోటీలో ఉంటే ఎన్నిక నిర్వహిస్తారు.

ప్రసన్న రాజకీయ నేపథ్యం..

సుంకర శివ ప్రసన్న తెలుగుదేశం పార్టీ తరఫున 40వ డివిజన్‌ నుంచి గెలిచారు. అప్పట్లో సుంకర పావనితో ఈమె మేయర్‌ పీఠానికి పోటీ పడ్డారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈమె తండ్రి సుంకర అన్నవరం టీడీపీలో ముందు నుంచి ఉన్నారు. యనమల రామకృష్ణుడి వర్గంలో ఉండి పార్టీ పదవులు నిర్వహించారు. ఈమె భర్త సాగర్‌ కూడా తెలుగుదేశంలో పార్టీలో పనిచేశారు. పావని ఒంటెత్తు పోకడలు నచ్చక తెలుగుదేశం కార్పొరేటర్లు ఆమెకు ఎదురుతిరిగిన నేపథ్యంలో ఈమె క్రియాశీలకంగా వ్యవహరించారు.

Also Read : Sunkara Pavani - కాకినాడ మాజీ మేయర్‌ పిటిషన్‌ మరో సారి వాయిదా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp