Kakinada Corporation - మేయర్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం.. ఆ 9 మంది మినహా అందరూ వైసీపీనే..

By Aditya Oct. 25, 2021, 01:34 pm IST
Kakinada Corporation - మేయర్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం..  ఆ 9 మంది మినహా అందరూ వైసీపీనే..

కాకినాడ నగరపాలక సంస్థ నూతన మేయర్‌ ఎన్నిక అనంతరం ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల పూర్తయిన తర్వాత.. 21 మంది టీడీపీ కార్పొరేటర్లు, ముగ్గురు బీజేపీ, ముగ్గురు స్వతంత్ర కార్పొరేటర్లు వైసీపీ కండువాలు కప్పుకున్నారు. మొత్తం 44 మంది కార్పొరేటర్లలో మాజీ మేయర్‌ సుంకర పావని, 8 మంది కార్పొరేటర్లు టీడీపీలో ఉండిపోయారు. ఇకపై 35 మంది కార్పొరేటర్లు వైసీపీ తరఫున ప్రాతినిధ్యం వహించబోతున్నారు.

కొత్త మేయర్‌గా సుంకర శివప్రసన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రోజు  సోమవారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. మాజీ మేయర్ సుంకర పావనికి వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమెను ఈ నెల 5వ తేదీన పదవి నుంచి తొలగించిన విషయం విదితమే.

ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభం అయింది. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జి.లక్ష్మీశ ప్రిసైడింగ్‌ అధికారిగా వ్యవరించారు. మేయర్ అభ్యర్థిగా సుంకర శివప్రసన్న పేరును బీజేపీకి చెందిన నల్లబిల్లి సుజాత ప్రతిపాదించ గా టీడీపీకి చెందిన డిప్యూటీ మేయర్ - 2 చోడిపల్లి సత్యప్రసాద్ బలపరిచారు. టీడీపీకి చెందిన 9మంది కార్పొరేటర్లు గైర్హాజరు కాగా మిగిలిన కార్పొరేటర్లు పార్టీలకు అతీతంగా శివప్రసన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డిప్యూటీ మేయర్ -1గా వైఎస్సార్ సీపీకి చెందిన 24వ డివిజన్ కార్పొరేటర్ మీసాల ఉదయ కుమార్ పేరును టీడీపీకి చెందిన చవ్వాకుల రాజబాబు ప్రతిపాదించగా బీజేపీకి చెందిన బోడి సత్యవతి బలపరిచారు.

ఎన్నికలోనూ అదే ఐక్యత..

పార్టీలకు అతీతంగా మాజీ మేయర్ పావనిని వ్యతిరేకించిన కార్పొరేటర్లు కొత్త మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోవడంలోనూ ఐక్యత చూపారు. నాలుగేళ్ల క్రితం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 33  కార్పొరేటర్ స్థానాల్లో గెలిచినా, టీడీపీలో వచ్చిన వర్గ పోరు వల్ల 9 మంది ఒక గ్రూపుగా మిగిలారు. అందులో మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వర్గం 8 మంది కాగా మాజీ మేయర్ పావని ఒక్కరే ఉన్నారు. మిగిలిన కార్పొరేటర్లు వైఎస్సార్ సీపీ, బీజేపీ, ఇండిపెండెంట్లతో కలసి కొత్త మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు. దీంతో పార్టీలకు అతీతంగా వారి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. మేయర్, డిప్యూటీ మేయర్ - 2 పదవులను టీడీపీ వర్గీయులు గెలువగా, డిప్యూటీ మేయర్ -1 పదవిని వైఎస్సార్ సీపీ గెలుచుకుంది. డిప్యూటీ - 2 స్థానానికి ఇటీవలే ఎన్నిక జరిగింది.

కాగా, నిబంధనలకు విరుద్ధంగా, కనీసం నోటీసు ఇవ్వకుండా తనపై అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహించారని మాజీ మేయర్‌ సుంకర పావని హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణను కోర్టు మరో రెండు వారాలకు వాయిదా వేసింది.

Also Read : Sunkara Siva Prasanna - కాకినాడకు కొత్త మేయర్ వచ్చేశారు.. ఎట్టకేలకు ఆమె పంతం నెగ్గింది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp