ప్రత్యూష ,ఆయేషా మీరా నుంచి దిశ వరకు ...

By Surya.K.R Dec. 10, 2019, 11:35 am IST
ప్రత్యూష ,ఆయేషా మీరా నుంచి దిశ వరకు ...

యత్ర నార్యంతు పూజ్యంతు రమంతే తత్ర దేవతా , ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని మన పురాణాలను చూపించి భారత దేశం స్త్రీకి ఇచ్చే విలువ ఇది అని గొప్పగా చెప్పుకుంటాం. స్త్రీ మానవ జాతికి మూలాధారం , దేశ ప్రగతిలో స్త్రీ పాత్ర ఎనలేనిది అని పార్లమెంటు బల్లలు చరుస్తూ చెప్పుకుంటాం. ఈ దేశానికి స్వాతంత్రం సిద్దించిన కొద్ది సంవత్సరాలకే స్త్రీకి సాంఘిక ఆర్ధిక హక్కులు కలగజేస్తూ హిందూ కోడ్ బిల్లు తెచ్చాము అని చెప్పుకుంటాం . ఇదంతా నాణేనికి ఒక పార్స్వం మాత్రమే.

మరి నాణెంకి రెండో వైపు చూస్తే స్వాతంత్య్రం వచ్చి ఇన్ని ఏళ్ళు గడిచినా స్త్రీకి స్వేచ్చ లభించిందా , మనం చెప్పుకోటం కాదు స్త్రీ అంతరంగాన్ని తట్టి చూస్తే ఇంకా అదే సంఘర్షణ, అదే అవేదన, అదే భయం. ఇంటి నుండి ఉద్యోగానికో, విద్యకో, తన కుటుంబ అవసరాలకో అడుగు బయటికి పెడితే తిరిగి మళ్లీ తన ఇంటి గడప తొక్కే వరకు తనతో పాటు తన కుటుంబ సభ్యులు అందరిలో తెలియని ఆందోళన. మన చుట్టూ ఉన్న సమాజంలోనే దుర్యోధన దుశ్శాసనులు అభినవ కీచకులు మన కళ్ళ ముందే తిరుగుతున్నారనే నమ్మకం.

Read Also: పవన్ చెప్పిన సుగాలి ప్రీతి హత్య కేసును నీరుకార్చింది ఎవరు?

స్త్రీ మన కళ్ళముందే కాలి బూడిదైపొతే, కళ్ళముందే అవమానానికి గురైతే వెంటనే చట్టాలు అంటాం వాటికి మార్పులు అంటాం రెండు రోజుల పాటు చర్చిస్తాం , కీచకులు బలహీనులైతే పొలీస్ తూటా గుళ్ళు మన ఆక్రోశాన్ని , ఆవేదనని చల్లారుస్తాయి , మరి అదే కీచకులు బలవంతులైతే చట్టాలు చేసేవారే వారికి తోడైతే . న్యాయం కోసం మన స్త్రీ (ఒక ప్రత్యుష తల్లిలా, ఒక అయేషా మీర తల్లిలా) తన కొన ఊపిరి ఉన్నంతవరకు మరో మహా యుద్దమే చేయాలి.

తాజాగా జరిగిన ఉన్నవో ఘటన ప్రభుత్వాలు చట్టాల నుండి కూడా స్త్రీకి రక్షణ కావాలి అనే సందేహాన్ని రేకెత్తిస్తోంది . మరి ఎక్కడ ఉన్నాయి భారత రాజ్యంగంలో సంరక్షింపబడే స్త్రీ పౌర హక్కులు ? న్యాయం కోసం ఎన్ని ఏళ్ళు గాలి బుడగ లాంటి ప్రాణం ఎదురు చూడాలి.

మహిళలకు పెద్దన్నగా ఉంటాను, డ్వాక్రా నేనే తెచ్చాను, మహిళలలకు దీపం పథకం ద్వారా గ్యాస్ బండ ఇచ్చి కట్టెల పొయ్యి కష్టాలు దూరం చేశానని, ప్రగల్బాలు పలికే చంద్రబాబు 2002లో ఆయన ప్రభుత్వంలో జరిగిన ఒక కీచక పర్వం గురించి మాత్రం చెప్పరు, కారణం అందులో ఆయన అనుయాయుల పుత్ర రత్నాలు ఉన్నారనే ఆరోపణలు..  

Read Also: అత్యాచారాల భారతం...

వర్ధమాన నటిగా ఎదుగుతున్న ప్రత్యుషని బడా సంపన్నుడైన సిద్ధార్థ రెడ్డి తన స్నేహితులతో కలిసి సాగించిన రాక్షస క్రీడలో ప్రాణాలు విడిచింది . ఈ అత్యాచార హత్యకు సాధరణ ప్రేమ కధ విఫల ప్రేమ కధ అల్లి ముగింపు పలకాలని చూసారు . పోలీసులతో పాత్రదారులకు రక్షణ కల్పించారు, ఆధారాలు డాక్టర్లతో తుడిపించారు, అరోపణలు వచ్చిన తెలుగుదేశం సీనియర్ మంత్రి కుమారుడిని హుటా హుటిన పూనాకి పంపివేశారు, డాక్టర్ మునిస్వామి ఇచ్చిన రిపోర్టుని చెత్తబుట్టలో వేశారు. వ్యవస్థలు అన్ని ఏకమై నిందితునికి రక్షణ కవచంలా నిలిచాయి కాని ఆ తల్లి తన పేగు బంధాన్ని మర్చిపొలేక ఇంకా పోరాడుతూనే ఉంది. ఇప్పటికి 17ఏళ్ళు , రామాయణ మహాభారత ఇతిహాసాల్లోని వనవాసాన్ని మించినది ఆ తల్లి పోరాట కాలం .

శాంతిభద్రతలు కాపాడం అని చెప్పుకునే కాంగ్రెస్ హయాంలో పాశవికంగా బలాత్కరించి చంపబడ్డ 19 ఏళ్ల ఆయేషామీరాకు న్యాయం జరగలేదు. ఆయేషా మీరా హత్యకేసులో ఒక మంత్రి మనవడి పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి.శివాంజినేయులు, ఉపేందర్ సింఘ్, గురివిందర్ సింగ్, సత్యం బాబు అని అనామకుల చేతులుకి బేడీలు వేయించి నిజాన్ని కప్పిపుచ్చాలి అని చూసినా ఆమె తల్లి న్యాయం కోసం 12 ఏళ్ళుగా పోరాడుతూనే ఉంది. నా కూతురుని అత్యాచారం చేసి చంపి ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ అసలైన నిందితులని పట్టుకోలేదు . సత్యం బాబు మీద కేసు హైకోర్టు కొట్టేసింది. పోలీసులకు లక్ష రూపాయల జరిమానా విధించింది. కానీ ఈ కేసు ఇప్పటికి తెగలేదు,సిబిఐ విచారణ జరుగుతుంది.

Read Also: కేవీపీ వ్యూహంలో భాగంగానే విందు రాజకీయం నడుస్తోందా.?

తెలంగాణలో ఎన్ కౌంటర్కు గురైన వాళ్ళు పేద వాళ్ళు , అదే వారు ధనవంతులు అయితే, రాజకీయ అండదండలు ఉంటే అలాగే చేసేవారా అని ఆ తల్లి వేసిన ప్రశ్నకు రాజ్యంగంలో ఏ పేజీలో సమాధానం ఉందో ? నేటికీ ఈ వ్యవస్థల నుండి ఆ తల్లికి న్యాయం జరిగింది లేదు , ఆ తల్లిదీ కన్నీరే కదా మరి న్యాయం ఎక్కడ ???

ప్రత్యూష , అయేషామీరా , సుగాలి ప్రీతి ఇలా ఎందరో.. కర్మభూమిలో కామంధుల చేతిలో పడి అసువులు బాస్తుంటే , దోషులకు వ్యవస్థలే కొమ్ము కాస్తూ మరో పక్క స్త్రీకి సంఘంలో ఉన్నత స్థానం ఉంది, సమాన హక్కులు ఉన్నాయి అంటూ మన జబ్బలు మనం చట్ట సభల్లో చరుచుకోవటం ఆత్మ వంచన కాదా ? మార్పు రావలసింది చట్టల్లో కాదు చట్ట సభల్లో కూర్చున్నవారిలో. అలాగే మార్పు రావలసింది ఓటు హక్కు వినియోగించుకోవటంలో కాదు, ఓటు హక్కుతో నాయకులను ఎన్నుకునే పద్దతిలో అప్పుడే ఈ దేశంలో ఆడపిల్లకు భద్రత భరోసా ఉంటుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp