బీజేపీ జాతీయ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు న‌డ్డాతో జేసీ భేటీ

By Sodum Ramana Nov. 22, 2019, 06:23 pm IST
బీజేపీ జాతీయ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు న‌డ్డాతో జేసీ భేటీ

బీజేపీ జాతీయ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో అనంత‌పురం మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. ఢిల్లీలో రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నాచౌద‌రి ఇంట్లో వారి భేటీ ప్రాధాన్యం సంత‌రించుకొంది. అనంత‌పురంలో ముఖ్య‌మైన నాయ‌కులు జేసీ , ప‌రిటాల సునీత కుటుంబాలు బీజేపీలో చేరుతాయ‌ని కొన్ని నెల‌లుగా విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్నాన‌ని జేసీ చెబుతూ వ‌స్తున్నారు.
ఇటీవ‌ల జేసీ కుటుంబానికి చెందిన జేసీ ట్రావెల్స్‌పై ర‌వాణాశాఖ అధికారులు దాడులు నిర్వ‌హించారు. జేసీ ట్రావెల్స్‌కు చెందిన బ‌స్సులు ఒక ప‌ర్మిట్‌తో అనేక రూట్ల‌లో తిరుగుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నాయ‌ని ర‌వాణాశాఖ అధికారులు గుర్తించి సుమారు 40 బ‌స్సుల‌ను సీజ్ చేశారు. జేసీ ట్రావెల్స్‌పై కేసులు కూడా న‌మోదు చేశారు.

దీనిపై జేసీ దివాక‌ర్‌రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ స‌ర్కార్ క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, ర‌వాణాశాఖ అధికారులు రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు లొంగి త‌మ‌పై కేసులు న‌మోదు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. అంతేకాకుండా ర‌వాణాశాఖ అధికారుల‌పై కోర్టుకు వెళుతాన‌ని ఆయ‌న ఇటీవ‌ల ప్ర‌క‌టించారు.
కొంత‌కాలం ట్రావెల్స్ వ్యాపారం కూడా మానుకుంటాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. దీన్నిబ‌ట్టి జేసీ ఎంత ఒత్తడిలో ఉన్నారో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ నేప‌థ్యంలో బీజేపీ జాతీయ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు న‌డ్డాతో ఆయ‌న భేటీ ప్రాధాన్యం సంత‌రించుకొంది. ఇప్ప‌టికే ప‌లువురు టీడీపీ నేత‌లు బీజేపీలో చేర‌డం తెలిసిందే. టీడీపీ నుంచి బీజేపీలో చేరాల‌నుకునే వారికి సుజ‌నాచౌద‌రి మ‌ధ్య‌వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఎందుకంటే నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు టీడీపీలో సుజ‌నా కీల‌క‌పాత్ర పోషించారు.

జ‌గ‌న్ స‌ర్కార్‌పై జేపీ న‌డ్డాకు దివాక‌ర్‌రెడ్డి ఫిర్యాదు చేసిన‌ట్టు స‌మాచారం. అలాగే పార్టీ మార్పు త‌దిత‌ర అంశాల‌పై వారి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలిసింది. మున్ముందు జేసీ రాజ‌కీయంగా ఎలాంటి అడుగులు వేస్తారోన‌నే చ‌ర్చ స‌ర్వ‌త్రా జ‌రుగుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp