Jawad Cyclone - భయపెడుతూ... బలహీనపడుతూ...

By Prasad Dec. 04, 2021, 07:44 pm IST
Jawad Cyclone - భయపెడుతూ... బలహీనపడుతూ...

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘జవాద్‌’ తుఫాను క్రమంగా బలహీనపడుతోందని భారతీయ వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. తుఫాను కాస్తా తీరాన్ని చేరుకునేలోపు తీవ్ర అల్పపీడనంగా మారుతుందని తెలిపింది. ఈ ప్రకటనతో ఆంధ్ర, ఒడిస్సా ప్రజలు కొంత వరకు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పడంతో అధికార యంత్రాంగం ఇంకా అప్రమత్తంగానే ఉన్నారు.

జవాద్‌ తుఫాను గడిచిన నాలుగు రోజులుగా ఈ రెండు ప్రభుత్వాలను, ఏపీలో ఉత్తరాంధ్ర, ఒడిస్సాలో పూరి, బరంపురం ప్రాంత వాసులను కంటిమీద కునుకులేకుండా చేసిన విషయం తెలిసిందే. తుఫాను శుక్రవారం దిశలు మార్చుకుంటూ ముప్పుతిప్పలు పెట్టింది. ఒకానొక సమయంలో ఇది పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ వైపు వెళుతుందని అంచనా వేశారు. కాని తిరిగి ఇది ఉత్తరాంధ్ర, ఒడిశాల మధ్య తుఫాను తీరం దాటుతుందని అంచనా వేశారు. ఈ సమయంలో 80 నుంచి 90 కిమీల వేగంతో గాలులు వీస్తాయని, అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీనితో అటు ఒడిశా, ఇటు ఉత్తరాంధ్ర వాసులు, రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గతంలో తిత్లీ చేసిన నష్టం వారి కళ్లముందు కదిలాడింది. గత ఏడాదిలో గులాబ్‌, యాస్‌ తుఫాను వల్ల కలిగిన నష్టాన్ని ఉత్తరాంధ్ర వాసులు ఇంకా మరువలేదు. ఈ నేపథ్యంలో జవాద్‌ తుఫాను విపత్తు ఎలా ఉంటుందోనని వారు ఆందోళన చెందారు. తుఫాను వల్ల శనివారం ఉదయం నుంచి వర్షం పడుతుందని దీనితో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. తుఫాను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.తుఫాను ప్రభావం వల్ల శనివారం నుంచి ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ చెప్పింది. కాని శనివారం ఉదయం నుంచి ఉత్తరాంధ్ర, ఒడిస్సాల్లో వాతావరణం సాధారణంగా ఉంది. అయితే శనివారం ఉదయం నుంచి తుఫాను క్రమేపీ బలహీన పడుతూ వస్తోంది. ప్రస్తుతం తుఫానుగా ఉన్న జవాద్‌ రానున్న ఆరు గంటల్లో ఒడిశా తీరం వెంబడి ఉత్తరం వైపు పయనిస్తూ తీవ్ర అల్పపీడనంగా మారి ఒడిశాలోని పూరీ వద్ద తీరాన్ని తాకుతుందని ఐఎండీ తాజాగా అంచనా వేసింది. తరువాత ఇది మరింత బలహీనపడి ఒడిశా తీరం వెంబడి పశ్చిమ బెంగాల్‌ తీరం వైపు వెళుతుంది. గత ఆరు గంటలుగా ఇది కేవలం గంటకు నాలుగు కిమీల వేగంతో పయనిస్తోంది. ప్రస్తుతం ఇది విశాఖకు ఆగ్నేయంగా 210 కిమీల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను తీవ్రత తగ్గినా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో అధికారులు ఇంకా అప్రమత్తంగానే ఉన్నారు. శ్రీకాకుళంలో సాయంత్రం నుంచి కాస్త గాలుల తీవ్రత పెరిగింది.

Also Read : Jawad Cyclone - జవాద్ తుఫాను, ఏపీకి ఊరట దక్కినట్టేనా, ఉత్తరాంధ్ర గట్టెక్కినట్టేనా

కడలి కన్నెర్ర.. 

జవాద్‌ తుఫాను ప్రభావం నుంచి తూర్పు గట్టెక్కినా... ఉప్పాడలో సముద్రకోత మాత్రం తీవ్రంగా ఉంది. సముద్ర అలలు పది నుంచి పన్నెండు అడుగులు ఎత్తున ఎగిసి పడుతున్నాయి. సముద్రం ముందుకు చొచ్చుకువచ్చింది. అలల ఉధృతికి తీరం పలుచోట్ల కొట్టుకుపోతోంది. ఉప్పాడతోపాటు కోనపాయిపేట గ్రామం తీవ్ర కోతకు గురవుతోంది. జియోట్యూబ్‌ రక్షణ గోడ సైతం అలల దాటికి చెల్లాచెదురవుతోంది. కాకినాడ నుంచి ఉప్పాడ వరకు ఉన్న బీచ్‌ రోడ్డు పలుచోట్ల ధ్వంసమైంది. శుక్రవారం రాత్రి నుంచి బీచ్‌రోడ్డును అలలు ముంచెత్తుతున్నాయి. పలుచోట్ల రహదారి కోతబారిన పడి సముద్రంలోకి కొట్టుకుపోయింది. రహదారి మీద కెరటాలు విరుచుకు పడటంతో రాకపోకలు నిలిపివేశారు. ఈ రహదారిని మరోసారి పునర్నిర్మించాల్సి ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp