విలీనమా?పొత్తా?అసలు పవన్ రాజకీయాల్లో ఉంటాడా?

By Siva Racharla Jan. 18, 2020, 07:27 pm IST
విలీనమా?పొత్తా?అసలు పవన్ రాజకీయాల్లో ఉంటాడా?

బీజేపీతో జనసేన పొత్తును విశ్లేషించవలసిన అవసరం  ఉందా?
జనసేన రాజకీయ ప్రయాణం ,కమ్యూనిజం ,చెగువేరా నుంచి బీజేపీ శ్యాంప్రసాద్ ముఖర్జీ వరకు పవన్ జంప్ తదితర అంశాల మీద ఏ స్థాయి చర్చ జరగాలి?

రెండు రాజకీయ పార్టీల మధ్య పొత్తు మీద ఆశ్చర్యపోయే రోజులు కావు ఇవి. కాకుంటే పవన్ కళ్యాణ్ ప్రతి సీను రాజకీయక్లైమాక్స్ లాగా ఊగిపోతూ చేసిన కవితావేశ ప్రసంగాలు విన్నవారికి "ఔరా అతడే ఇతడా?" అనిపిస్తుంది.

జనసేన ఆవిర్భావ సందర్భంగా పవన్ కోట్ చేసిన శేషేంద్ర  కవిత ...
యువతరానికి ఏ సంపద విడిచి పెట్టాం,
యుద్ధము రక్తము కన్నీరు తప్ప,
గాయాలు బాధలు వేదనలు తప్ప,
కలలు కలలు కలలు తప్ప,
పిరికితనం మోసం తప్ప --- దీనికి ఇప్పుడు కౌంటర్ గా శేషేంద్ర చెప్పిన
సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు.
తుఫాను గొంతు చిత్తం అనడం ఎరుగదు.
పర్వతం ఎవడికి వంగి సలాం చేయదు అన్న విమర్శ వస్తుంది.

ఈ కవితావేశాలు వదిలి రాజకీయ కోణం లో చూస్తే పోటీ చేయనప్పుడు పార్టీ పెట్టటం ఎందుకు?2014లో స్వచ్చందంగా బీజేపీ-టీడీపీ లకు మద్దతు ఇస్తే సరిపోతుంది కదా? అన్న  ప్రశ్నకు  జనసేన నుంచి ఎప్పుడు సమాధానం రాలేదు. మోడీ.చంద్రబాబు ఇచ్చిన హామీలకు నాది బాధ్యత అనటం ఎంత అవగాహనా రాహిత్యమే అర్ధంకావటానికి పవన్ కు ఎక్కువ రోజులు పట్టలేదు.

తిరుపతి సభలో ప్రత్యేకహోదా మీద మోడీ ఇచ్చిన హామీని  నిలబెట్టుకోండి అని అడగటానికి పవన్ కు సాధ్యం కాలేదు. మిత్రపక్షంగా  ఉండి చర్చించ వలసిన అంశాన్ని కాకినాడలో సభ పెట్టి "పాచిపోయిన లడ్లు"   అనటంతో   సరిపెట్టుకున్నాడు .  అమరావతి విషయంలో ఇదే పోకడ... హామీల అమలకు నాదీ బాధ్యత అన్న పవన్ అమరావతి భూములు మీద మూడు మీటింగుల  హడావుడి తప్ప మిత్రపక్షంగా చంద్రబాబుతో చర్చించి నిర్మాణాత్మకంగా వ్యవహరించింది లేదు. చివరికి అమరావతి శంకుస్థాపనకు హాజరు కాలేదు... జనసేన ఒక రాజకీయ పార్టీగా ఎందుకు ఎదగలేక పోయింది అంటే ఒకటి నుంచి పది కారణాలు పవన్ కళ్యాణ్ వ్యవహార తీరే కారణం.

2014 నుంచి 2019  ఎన్నికల వరకు అంటే ఐదు  సంవత్సరాల కాలంలో ఐదుగురు నాయకులను కూడా వారి అభిమానులకు కానీ కార్యకర్తలకు కానీ  చూపించలేక పోయారు. ప్రజారాజ్యం ఎన్నికల్లో ఓడిపోయి ఉండవచ్చు కానీ ఒక రాజకీయ పార్టీ  ఎలా పనిచేయాలో ఆ విధముగా పనిచేసింది. చిరంజీవికి చేతకాక కాంగ్రెస్ లో విలీనం చేసాడని పరోక్షంగా విమర్శించిన పవన్ పార్టీ నిర్మాణాన్ని చేసుకోలేక పోయాడు అనటం కన్నా ఆయనకు ఆ ఉద్దేశ్యం లేదు,ఆయనకు అంత ఓపిక లేదు అనటమే సమంజసం.

ఎన్నికలు,అదొక గందరగోళం...పవన్  మొదటి నుంచి చెప్తూ వచ్చినట్లు వారికి బలమున్న 40-50 స్థానాలలో పోటీచేసి ఒక 10 స్థానాల మీద కేంద్రీకరించి పనిచేసి ఉంటే నాలుగో ఐదో స్థానాలు గెలిచేవారు. పవన్ కనీసం ఎమ్మెల్యేగా గెలిచిఉండేవాడు.

ఎన్నికల్లో జనసేన వైఫల్యానికి పరాకాష్ట పవన్ రెండు స్థానాలలో ఓడిపోవటం కాదు...అనేక చోట్ల టీడీపీ నాయకులు జనసేన అభ్యర్థులకు బీ-ఫారం ఇవ్వటం..ఇది చూస్తే జనసేన ఎంత సీరియస్ గా ఎన్నికలకు సిద్ధమయ్యిందో అర్ధం అవుతుంది.

ఎన్నికలు ముగిశాయి .. 175 స్థానాలకు గాను జనసేన ఒకే ఓక సీట్ గెలిచింది,రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ గెలిచాడు...పార్టీని నడిపే ఆలోచన ఉన్న ఏ నాయకుడైన ఇలాంటి ఫలితాలు వచ్చిన  తరువాత  జిల్లాల వారిగా నాయకులను,ముఖ్యకార్యకర్తలను పిలిచి సమావేశం పెట్టి ధైర్యం  చెప్తూ పార్టీ కొనసాగుతుంది మీరు ప్రజలతో మమేకంకండి అని భరోసా ఇస్తారు.

గెలిచిన ఒక్క ఎమ్మెల్యే ను పార్టీ పనిలో బాధ్యత పంచకపోవటం,తోలి రోజు నుంచే రాపాక వర ప్రసాద్ . వైసీపీ లో చేరిపోతాడని జనసేన శ్రేణుల ప్రచారం ..చివరికి ఆయన జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.పేరుకు జనసేనలోనే ఉన్నారు కానీ పార్టీ  ఆయన్ను,ఆయన పార్టీని disown చేసుకున్నారు.

రాపాక ఎమ్మెల్యే కాబట్టి చర్చ జరుగుతుంది కానీ సిద్ధాంతకర్త రాజా రవి వర్మ ,కోశాధికారి రాఘవయ్య,అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ ఇలా కాస్తపేరున్న వాళ్ళెవరూ పవన్ తో మిగలలేదు... మిగిలింది ఒక్క నాదెండ్ల మనోహర్ మాత్రమే.

బీజేపీతో పొత్తు ఎందుకు?
గతంలో తిట్టుకున్నారు,విమర్శించుకున్నారు కాబట్టి ఇప్పుడు కలవకూడదుగా అన్నవాదనకు విలువ లేదు. రాజకీయాల్లో కలవటం ,విడిపోవటం సాధారణమే. మరి పవన్ బీజేపీ తో కలవటం మీద ఎందుకు ఇంత విమర్శ ?

పవన్ ఆవేశంలో మాట్లాడిన మాటలు,ప్రతి మాట ఒక సిద్ధాంతంగా ప్రచారం చేసిన తీరు వలనే ఇన్ని విమర్శలు... ఈ ఇతర పార్టీ మాట్లాడని "దక్షిణ భారతం మీద ఉత్తర భారత ఆధిపత్యం" వంటి వాదనలు మొదలుకోని చేగువేరా నుంచి జ్యోతి పూలే,అంబేద్కర్ ,పెరియార్ ఇలా ప్రతి ఒక్కరిని కోట్ చేస్తూ మాట్లాడిన మాటలకు పవన్ ఎదో ఒక రోజు సంజాయిషీ ఇచ్చుకోక తప్పదు. కమ్యూనిస్టులకు నేను ఎమన్నా బాకీ ఉన్నానా?అన్నంత సులభంగా గతంలో చేసిన విమర్శల నుంచి ,సిద్ధాంత వాదనల నుంచి పవన్ తప్పించుకోలేడు . 

ఇప్పుడు బీజేపీ తో పొత్తు ఎందుకు?
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పొత్తులు పెట్టుకునే అవసరం ,సందర్భం ఏమి లేదు. రాజధాని కోసం
అనుకున్నా బీజేపీ సీనియర్ నేతలు GVL ,సునీల్ ధార్ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు అని ఇప్పటికే  చెప్పేశారు . రాజకీయ వర్గాలలో  "పచ్చ బీజేపీ" అని  పిలవబడుతున్న సుజనా చౌదరి లాంటి వలస నాయకుల మాటకు బీజేపీలో ఏ మాత్రం విలువ ఉందో వివిధ సందర్భాలలో బయటపడింది.

ప్రజారాజ్యం సమయంలో చిరంజీవి పార్టీ నడపలేదు,జండా పీకేద్దాం అని ఎమ్మెల్యేలు అంటున్నారని రోజుకు ఒక వార్తా రాసిన ప్రధాన మీడియా బీజేపీ-జనసేన పొత్తును మాత్రం చాలా గౌరప్రద రాజకీయ అవగాహనగా వార్తలు రాసాయి . ఆనాడు వాస్తవముగా ప్రజారాజ్యాని బతికించుకోవాలని  చిరంజీవి చేసిన ప్రయత్నాలు సఫలం కాకుండా అందరు ప్రయత్నం చెయ్యగా ఈనాడు జనసేన బీజేపీ తో కలవటానికి పడిన ఆరాటాన్ని మాత్రం సాకులు కోణంలో చూపారు.

జనసేన ఎంత కాలం కొనసాగుతుంది?
గెలిచినా ఓడినా తనది  25 సంవత్సరాల ప్రయాణం అన్న పవన్   "నేనింతా ఒక పిడికెడు మట్టి కావొచ్చు.  కానీ కలమెత్తితే ఒక  దేశపు జెండాకున్నంత పొగరుంది. కష్టాల్ని కన్నీటిలో ముంచుకుని బిస్కెట్ లా తింటాను.బ్రతుకంటే బలవంతుడైన వాడే శబ్దం నుండి శతాబ్దం వరకూ మలచే శిల్పి అని ఆవిష్కరిస్తాను" అన్న శేషేంద్ర మాటలు గుర్తు తెచ్చుకొని ఉండవలసింది.

పవన్ అడుగులు విలీనమా వైపే అన్నది స్పష్టం. ఇప్పుడున్న రాజకీయ,ఆర్ధిక పరిస్థితుల్లో పార్టీని నడపటం శ్రమతో కూడిన విషయం అని పలు సందర్భాలలో పేర్కొన్న పవన్ ఆ భారాన్ని దింపుకునే దిశా అడుగులు వేసినట్లు కనిపిస్తుంది,దానికి నాదెండ్ల మనోహర్ ఒక వాహకంగా పనిచేస్తున్నాడు.

లేదు మా జనసేన బీజేపీలో విలీనం కాదు అని ఆ పార్టీ అభిమానులు వాదించవచ్చు కానీ 2014 నుంచి 2020 మధ్య పవన్ మాటల్లో వచ్చిన మార్పు, చెప్పినదానికి భిన్నంగా పనిచేసిన సందర్భాలు గుర్తుచేసుకుంటే రాజకీయాల్లో ఏదైనా  సాధ్యం ,అందులో విలీనం కూడా అనిపిస్తుంది.

విలీనమా?పొత్తా?
ఇప్పుడు జరుగుతునం పరిణామాలు గమనిస్తే విలీనం లేక కేవలం పొత్తు .. ఏ నిర్ణయం అయినా బీజేపీ కోర్టులోనే ఉంది. పవన్ చేతిలో బంతి లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా, దక్షిణాదిలో బలపడటానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనిక మీద పెద్ద పాత్ర కోసం పర్యటనం చేస్తున్న  బీజేపీ మరి కొంత  కాలం పరిశీలించిన తరువాత విలీనం మీద ఒక నిర్ణయం తీసుకోవచ్చు.

ప్రతిసారి మాదే అధికారం అని పవన్ అన్నట్లు బీజేపీ లెక్కలు వేసుకోదు.. ఆంధ్రప్రదేశ్ లో అధికార , ప్రతిపక్షాలు వారి ఓట్ బ్యాంక్ ను కాపాడుకున్నంత కాలం మూడో పార్టీకి స్థానం దక్కదు అన్న సంగతి బీజేపీ కి తెలుసు. కేవలం స్వింగ్ ఓటర్ల మీద ఆధారపడి పార్టీని అభివృద్దిచేసుకోలేరు,ఏ పార్టీకైనా సొంత ఓట్ బ్యాంక్ ఉండాలి.. స్వింగ్ ఓటర్లు ఎన్నికల సందర్భంలోనే రాజకీయాల మీద ఎక్కువ ఆసక్తి చూపుతారు.

మొత్తానికి విలీనమా లేక పొత్తు కొనసాగింపా ? ఏ కార్డు వెయ్యాలో బీజేపీ మరో ఆరు నెలల తరువాత ఒక నిర్ణయానికి రావచ్చు... ఈ లోపు పవన్ రాజకీయాలను వదిలి సినిమాలు చేసుకుంటూ బిజీ అయిపోతాడు... ఆరు నెలల తరువాత పడేది బొమ్మో లేక అచ్చో పెద్ద ప్రాముఖ్యత లేని విధంగా పరిస్థితి మారటం ఖాయం... 

"ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కాని గుండెల నిండా ధైర్యం ఉంది"...కవితావేశాలు,భావావేశాలు రాజకీయ పార్టీలను నడపలేవు..ఏమి మాట్లాడుతున్నాం?ఆ మాటకు ఎంత వరకు కట్టుబడి ఉండగలమన్న దీర్ఘ ఆలోచన రాజకీయాల్లో ముఖ్యం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp