ఒకే ఒక్కడి దారెటు?

By Raju VS Dec. 05, 2019, 08:11 am IST
ఒకే ఒక్కడి  దారెటు?

అక్క‌డ జ‌న‌సేన అడ్ర‌స్ గ‌ల్లంత‌వుతుందా.. ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆతృత‌ప‌డిన అధినేత‌కు కూడా సాధ్యం కానిది ఆయ‌న‌కు చెల్లింది. కానీ ఆ త‌ర్వాత దానికి త‌గ్గ‌ట్టుగా ప్రాతినిధ్యం ద‌క్క‌డం లేద‌నే అభిప్రాయం ఆయ‌న‌కు క‌లుగుతోంది. దానికి అనుగుణంగానే ప‌రిస్థితులు కూడా ఉన్నాయి. చివ‌ర‌కు పార్టీ స‌మావేశంలో కూడా త‌న‌ను అవ‌మానించిన నేత‌ల తీరుతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న జ‌న‌సేన‌కు చెందిన ఏకైక ఎమ్మెల్యే ఇప్పుడు పార్టీ వీడేందుకు దాదాపుగా నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.

తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీరు, వ్యాఖ్య‌ల‌తో ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ ప‌రిణామాల‌తో జ‌న‌సేన అడ్ర‌స్ గ‌ల్లంత‌య్యే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏకంగా సీఎం అవుతాన‌ని చెప్పి బ‌రిలో దిగిన ప‌వ‌న్ పార్టీ ఆఖ‌రికి అక్క‌డ ఉనికిని కోల్పోయే ద‌శ‌కు చేరుకుంటుంద‌నే అభిప్రాయం బ‌ల‌పడుతోంది. తూర్పు గోదావ‌రి జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రాపాక వ‌ర‌ప్ర‌సాద్ విజ‌యం సాధించారు. వైఎస్ హ‌యంలో ఆయ‌న కాంగ్రెస్ త‌రుపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆత‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గుర్తించ ద‌గ్గ స్థాయిలో ఓట్లు సాధించారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరేందుకు ఆయ‌న గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ అప్ప‌టికే జ‌గ‌న్ త‌న అభ్య‌ర్థిని ఖరారు చేయ‌డంతో రాపాక చూపు జ‌న‌సేన వైపు మ‌ళ్లింది. ఆపార్టీ త‌రుపున బ‌రిలో దిగి సొంత బ‌లాన్ని ఉప‌యోగించి విజ‌యం సాధించారు.

రాష్ట్ర‌మంతా ఓట‌మి చ‌విచూసినా రాజోలులో మాత్రం జ‌న‌సేన జెండా ఎగుర‌వేయ‌గ‌లిగారు. అందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఛ‌రిష్మా క‌న్నా రాపాక వ‌ర‌ప్ర‌సాద్ కి స్థానికంగా ఉన్న బ‌లం ఎక్కువ ప్ర‌భావం చూపింద‌నే విష‌యం స్ప‌ష్టం అయ్యింది. ఎన్నిక‌ల అనంత‌రం రాపాక వ‌ర‌ప్ర‌సాద్ తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. విజ‌యం త‌ర్వాత త‌న పార్టీ అధ్య‌క్షుడి క‌న్నా ముందే ముఖ్య‌మంత్రిని క‌లిసి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఆ త‌ర్వాత అసెంబ్లీ వేదిక‌గా జ‌గ‌న్ ని పొగిడి జ‌న‌సైనికుల‌కు విస్మ‌యం క‌లిగించారు. చివ‌ర‌కు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం కూడా చేసి రాజ‌కీయ వ‌ర్గాల్లో సైతం ఆస‌క్తిని రేకెత్తించారు. ఆ వెంట‌నే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ కి రాజ‌కీయ గురువుగా భావించే మ‌రో మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు వైసీపీ తీర్థం పుచ్చుకోవ‌డంతో ఇక రాపాక కూడా రెడీ అవుతున్నార‌నే సంకేతాలు బ‌ల‌ప‌డ్డాయి.

అదే స‌మ‌యంలో జ‌న‌సేన పార్టీ నేత‌ల తీరు కూడా రాపాకకి మింగుడుప‌డ‌డం లేద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. పార్టీ స‌మావేశంలో నాదెండ్ల మ‌నోహ‌ర్ వంటి నేత‌లు త‌న‌ను అవ‌మానించినా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ట్టించుకోక‌పోవ‌డం రాపాక‌లో అసంతృప్తిని రాజేసింది. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో నాదెండ్ల వివ‌ర‌ణ ఇచ్చినా వ‌ర‌ప్ర‌సాద్ మాత్రం సంతృప్తి చెంద‌లేదు.

ఇక తాజాగా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించేందుకు కులం, మ‌తం వంటి అంశాల‌ను ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీరు ప‌ట్ల రాపాక వ‌ర‌ప్ర‌సాద్ ర‌గిలిపోతున్నారు. విధానాల ప‌రంగానే త‌ప్ప తాను వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌న‌ని గ‌తంలో చెప్పిన ప‌వ‌న్ ఇప్పుడు దానికి భిన్నంగా దేశ‌మంతా ఉల్లి కొర‌త ఉంటే ఏపీలో జ‌గ‌న్ కి ఆపాదించి విమ‌ర్శ‌ల‌కు దిగ‌డాన్ని జీర్ణం చేసుకోలేక‌పోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఈ ప‌రిణామాల‌తో రాపాక వ‌ర‌ప్ర‌సాద్ అనుచ‌రుల నుంచి ఆయ‌న‌పై ఒత్తిడి పెరుగుతోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి నాయ‌కుడి వెంట కొన‌సాగ‌డం క‌న్నా పార్టీ మారి, ప‌రువు నిలుపుకోవ‌డం శ్రేయ‌స్క‌ర‌మ‌ని ఆయ‌నకు ప‌లువురు సూచిస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో చివ‌ర‌కు రాపాక కూడా పార్టీ మారేందుకు నిర్ణ‌యించుకోవ‌డంతో అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా జ‌న‌సేన ఏకైక ఎమ్మెల్యే ఎలాంటి ప్ర‌క‌ట‌న చేస్తారోన‌నే చ‌ర్చ సాగుతోంది. జ‌న‌సేన ఉనికికే ఎస‌రు పెట్ట‌బోతున్న ఆయ‌న నిర్ణ‌యం రాజ‌కీయంగా ఆస‌క్తిక‌ర‌మే అవుతుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp