Janasena-Glass symbol: గ్లాసు గుర్తు కోరే అవకాశాలు వదులుకుంటోన్న జనసేన

By Sanjeev Reddy Oct. 15, 2021, 04:00 pm IST
Janasena-Glass symbol: గ్లాసు గుర్తు కోరే అవకాశాలు వదులుకుంటోన్న జనసేన

ఏ ఉప ఎన్నికలోనూ పాల్గొనక మద్దతులకే పరిమితమై తమ ఓటు బ్యాంకుతో పాటు , గ్లాసు గుర్తుని ఇతరులకు త్యాగం చేస్తున్న వైనం పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు . ఈ నెల 13 న బద్వేల్ ఉప ఎన్నికల తాలూకూ నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత బరిలో మిగిలిన పార్టీ , వ్యక్తిగత అభ్యర్థులకు గుర్తులు కేటాయించిన ఎన్నికల కమిషన్ గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన గుర్తు అయిన గ్లాసు గుర్తుని నవతరం పార్టీ తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలిచిన గోదా రమేష్ కుమార్ కి కేటాయించింది .

ఈ అంశాన్ని దృవీకరిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేసిన నవతరం పార్టీ అధ్యక్షుడు రావి సుభ్రమణ్యం మాట్లాడుతూ ఇటీవల తిరుపతి ఉప ఎన్నికలోనూ గ్లాసు గుర్తు తమకే కేటాయించారని , తమ పార్టీతో పోటీ పడి గ్లాసు గుర్తు దక్కించుకోలేకే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బద్వేల్ ఉప ఎన్నిక బరి నుండి తప్పుకొన్నాడని తెలిపారు . నైతిక విలువలకు కట్టుబడి పోటీ చేయట్లేదన్న పవన్ కళ్యాణ్ బిజెపికి మద్దతు ఇవ్వడంలోని నైతికత ఏంటో చెప్పాలని సవాల్ విసిరారు . వరుసగా జరిగే ఎన్నికలలో గ్లాసు గుర్తుతో పోటీ చేస్తున్న తాము రాబోయే సార్వత్రిక ఎన్నికలలో సైతం గ్లాసు గుర్తునే దక్కించుకొంటామని ధీమా వ్యక్తం చేశారు .

ప్రత్యేక హోదా విషయంలో బిజెపి రాష్ట్రానికి చేసిన అన్యాయానికి ప్రతిగా బిజెపి పాల్గొనే ప్రతి ఎన్నికలో ఆ పార్టీ ఓటమి కోసం పని చేస్తామని చెప్పిన రావు సుభ్రమణ్యం పవన్ కళ్యాణ్ నిజంగా నైతిక విలువలకు కట్టుబడి పోటీ చేయకుండా తప్పుకొని ఉంటే మరణించిన అభ్యర్థి కుటుంబం పట్ల సానుకూల ధోరణితో ఉండి ఉంటే ఈ కారణాల వలన తాను పోటీ చేయట్లేదు అని ఇదే కారణంతో ఈ ఉప ఎన్నికల్లో బిజెపికి తాను మద్దతు ఇవ్వట్లేదని పత్రికా ముఖంగా ప్రకటించి తన నిబద్ధత నిరూపించుకోవాలన్నారు . 

Also Read : Badvel By Poll-బద్వేల్ లో బీజేపీ కి ఎందుకు టెన్ష‌న్ ప‌ట్టుకుంది?

ఎవరీ గోదా రమేష్ కుమార్ ...

గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజక వర్గానికి చెందిన వ్యక్తి గోదా రమేష్ కుమార్ . దళిత హక్కుల పరంగా పలు పోరాటాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రమేష్ కుమార్ దళిత బహుజన హక్కుల సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు . దళిత హక్కుల కై చేసిన పోరాటాలతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో అతని కృషికి గాను 2020 డిసెంబర్ లో హానరీ డాక్టరేట్ సత్కారం పొందారు . 2015 లో నవతరం పార్టీ సభ్యత్వం తీసుకొన్న గోదా రమేష్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట అసెంబ్లీ నుండి పోటీ చేశారు .

ఇటీవల తిరుపతి ఉపఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ జనసేన గ్లాసు గుర్తుని ఇతనికి కేటాయించడంతో సంచలనానికి కేంద్ర బిందువు అయ్యారు . ఇప్పుడు బద్వేల్ ఉప ఎన్నికలో సైతం గ్లాసు గుర్తుని దక్కించుకుని మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచిన రమేష్ కుమార్ తన గెలుపు పట్ల ఆశాభావం వ్యక్తం చేస్తూ , హోదా విషయంగా బిజెపి మోసాన్ని , పవన్ కళ్యాణ్ ద్వంద్వ వైఖరిని ప్రజలకి తెలియజేసి బీజేపీకి రాష్ట్రంలో స్థానం లేకుండా చేయటమే తమ పార్టీ ముఖ్య ఉద్దేశ్యమని అందుకోసం కృషి చేస్తామని తెలిపారు .

పార్టీ గుర్తింపు కోల్పోయిన జనసేన ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే గ్లాసు గుర్తుని పొందే అవకాశం ఉండి కూడా వరుసగా తిరుపతి , బద్వేల్ ఉప ఎన్నికలలో పోటీ చేయకుండా రెండో సారి కూడా గుర్తుని కోల్పోవడంతో పాటు భవిష్యత్ లో అదే గుర్తు పొందే అవకాశాలు సంక్లిష్టం అవ్వడంతో జనసైనికులు నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు .

Also Read : Janasena Party: జనసేన ఎన్నికల గుర్తు చేజారినట్టేనా?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp