బీజేపీ పొత్తు... గాజు గ్లాస్ చిత్తు!

By Mavuri S Apr. 17, 2021, 02:41 pm IST
బీజేపీ పొత్తు... గాజు గ్లాస్ చిత్తు!

భారతీయ జనతా పార్టీని నమ్ముకున్న జనసేనకు తెలంగాణలో పెద్ద దెబ్బే తగిలింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదు అయిన జనసేన పార్టీకి కామన్ సింబల్ గా కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ తన మొదటి ఎన్నికల్లో కచ్చితంగా 10% స్థానాల్లో పోటీ చేయాలి. అప్పుడే వారికి కేటాయించిన కామన్ సింబల్ అనేది వస్తుంది. ఎన్నికల గుర్తింపు చట్టంలోని కామన్ సింబల్ నిబంధనల ప్రకారం ఇది అన్ని పార్టీలకూ వర్తిస్తుంది. అయితే ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బిజెపి పొత్తులో భాగంగా ఎక్కడ పోటీ చేయకుండానే కేవలం మద్దతు తెలిపింది.

దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి నోటీసు జారీ చేసింది.10% స్థానాల్లో ఎందుకు పోటీ చేయలేదో.. కామన్ సింబల్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసులో పేర్కొంది. దీనికి జనసేన పార్టీ లిఖితపూర్వకంగా ఇచ్చిన జవాబు మీద కేంద్ర ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీతో పొత్తు వల్లనే తాము జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయలేదని జనసేన పార్టీ న్యాయవాదులు ఇచ్చిన జవాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంతృప్తి పరచ లేకపోయింది.

దీంతో తెలంగాణలో రాబోయే వరంగల్, ఖమ్మం మున్సిపాలిటీలకు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న జనసేన పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ గానే భావించాలి. ఈ ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తు కామన్ ఎన్నికల సింబల్ గా ఉంచింది. అంటే ముందుగా పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థులు కోరుకుంటే గాజు గ్లాస్ గుర్తు ఎవరికైనా కేటాయిస్తారు. అంతేకాదు నవంబర్ 18, 2025 సంవత్సరం వరకు జనసేన పార్టీ కు మళ్లీ కామన్ సింబల్గా ఏ ఎన్నికల్లోనూ గాజు గ్లాస్ గుర్తు తెలంగాణలో కేటాయించే అవకాశం లేకపోయింది. అంటే వచ్చే తెలంగాణ సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు కూడా జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేసినప్పటికీ స్వతంత్ర అభ్యర్థులు గా పరిగణించి, అవకాశం ఉన్న గుర్తును ఎన్నికల్లో కేటాయిస్తారు.

జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిబంధనల వల్ల అనుసరించి 10% స్థానాల్లో పోటీ చేయని మరో నాలుగు పార్టీలకు కూడా కామన్ సింబల్ లో ఎన్నికల సంఘం రద్దు చేసింది. కేవలం నిబంధనల మేరకే ఇవి రద్దు అయినప్పటికీ, ఇది వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీ పొత్తు మీద పెను ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే వారికి ఏ అభ్యర్థికి ఏ గుర్తు కేటాయించారు అన్న దాని మీద అయోమయం నెలకొనే అవకాశాలు ఉన్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp